గోపాల.. గోపాల..! | Bhadrachalam forest department in Deputation, suspension | Sakshi
Sakshi News home page

గోపాల.. గోపాల..!

Published Tue, Jun 14 2016 2:59 AM | Last Updated on Mon, Sep 4 2017 2:23 AM

Bhadrachalam forest department in Deputation, suspension

భద్రాచలం : భద్రాచలం అటవీశాఖను ఓ గోపాలుడు కుదిపేస్తున్నాడు. దుమ్ముగూడెం రేంజ్ పరిధిలోని డీ కొత్తూరు బీట్‌లో పట్టుబడిన అక్రమ కలప రవాణాలో అసలు దోషులెవరనే దానిపై సాగుతున్న విచారణలో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భద్రాచలంలో తిష్టవేసిన ఆంధ్రప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఆ శాఖలోని ఓ అధికారి, అదేవిధంగా కొంతమంది సిబ్బంది సహకారంతోనే పెద్ద ఎత్తున టేకు కలపను అక్రమంగా తరలిస్తున్నట్లు ఆరోపణలు వ చ్చాయి. భద్రాచలం డీఎఫ్‌ఓ శివాల రాంబాబు సైతం సిబ్బంది పాత్ర ఉందని ప్రకటించారు.

దీనిపై ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో విచారణ సాగిస్తున్నారు. తీగ లాగితే డొంక కదలిందన్న చందాన అనేక ఆసక్తి కరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయని తెలిసింది. కలప స్మగ్లింగ్‌కు సూత్రధారిగా అనుమానిస్తున్న భద్రాచలంలోని ఓ ‘గోపాలుడి’సెల్‌ఫోన్ కాల్‌డేటా ఆధారంగా కూపీ లాగుతున్నారు.
 
గత నెల రోజుల్లో ఆ వ్యక్తితో టచ్‌లో ఉన్న అటవీశాఖ అధికారులు, సిబ్బంది ఎవరనేది ముందుగా ఆరా తీసిన తరువాత, మరింత సమాచారాన్ని రాబట్టే దిశగా విచారణను వేగవంతం చేశారు. డివిజన్ అటవీశాఖలోని ఓ అధికారికి దీనిలో ప్రమేయం ఉందని విస్తృత ప్రచారం సాగుతున్న నేపథ్యంలో అతని కాల్‌డేటాను సైతం నిఘా వర్గాలు పరిశీలిస్తున్నాయి. అయితే రూ.6.80 లక్షల విలువ గల టేకు కలప పట్టుబడిన ఘటనలో విచారణ పక్కదారి పట్టించేందుకు కొంతమంది ఒత్తిడి తీసుకొస్తున్నట్లుగా తెలుస్తోంది.

కలప స్మగ్లర్‌తో టచ్‌లో ఉన్న ఆ శాఖలోని ఓ అధికారి ఈ కే సులో ఇరుక్కోకుండా ఉండేలా భద్రాచలంలోని కొన్నివర్గాల నాయకులతో విచారణ అధికారులపై ఒత్తిడి తీసుకోస్తున్నారని ఆ శాఖలోని సిబ్బంది బాహాటంగానే చెప్పుకుంటున్నారు. ఇది వరకే ఐదు లారీల వరకూ టేకు కలప ఈ ప్రాంతం నుంచి తరలిపోయిందని, అధికారుల పాత్ర లేకుండా ఇది ఎలా సాధ్యమౌతుందని ఉద్యోగుల్లో చర్చ సాగుతోంది.
 
మళ్లీ టెంటు పడనుందా..
భారీ స్థాయిలో స్మగ్లింగ్ జరిగిందని తెలిసినప్పటకీ, క్రింది స్థాయిలో ఉన్న ఉద్యోగులను బలి పశువులుగా చేయటం సరైంది కాదని ఆ శాఖలోని ఉద్యోగులు అంటున్నారు. భద్రాచలం డివిజన్ అటవీశాఖలో ఇటీవల జరుగుతున్న వరుస ఘటనలపై తీవ్రంగా పరిగణిస్తున్న ఉద్యోగులు.. ఇక్కడి అధికారులు అవలంభిస్తున్న ఏకపక్ష విధానాలను ఆ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమౌతున్నారు.

గతంలోనూ ఇలానే జరిగితే, అప్పటి అధికారికి వ్యతిరేకంగా డివిజన్ కేంద్రంలో టెంట్ వేశామని, మళ్లీ అటువంటి పరిస్థితులే నెలకొంటున్నాయని అటవీశాఖ ఉద్యోగుల సంఘం నాయకుడొకరు ఆవేదన వెళ్లగక్కారు. భద్రాచలం డివిజన్‌లోని అటవీశాఖలో జరుగుతున్న అడ్డగోలు డిప్యూటేషన్లు, సస్పెన్షన్‌లపై గుర్రుగా ఉన్న ఆ శాఖలోని ఉద్యోగులు ఆందోళన బాట పట్టేందుకు యూనియన్ రాష్ట్ర, జిల్లా నాయకులతో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement