వారిపై ఎందుకంత ప్రేమ !
వారిపై ఎందుకంత ప్రేమ !
Published Wed, Jul 20 2016 12:48 AM | Last Updated on Mon, Feb 17 2020 5:16 PM
కొన్ని సీట్లు అంతే..
కలెక్టరేట్‌లో తహశీల్దారు ఏళ్లుగా తిష్ట
బదిలీ చేస్తారు.. డిప్యుటేషన్ ఇస్తారు
అనంతపురం అర్బన్ : ప్రభుత్వ శాఖలకు కలెక్టర్ కార్యాలయం ఆదర్శప్రాయంగా ఉండాలి. పారదర్శకంగా ఉంటూ ప్రతి శాఖకు ఆదర్శంగా నిలవాలి. ముఖ్యంగా నియమ, నిబంధనల విషయంలో ఇతర శాఖలకు మార్గదర్శకంగా వ్యహరించాలి. అయితే ఇక్కడా తిరకాసు వ్యవహారాలు షరా మామూలేనన్న విమర్శలను వినవస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగుల బదిలీలు, డిప్యుటేషన్ల విషయంలో ఈ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరి సిబ్బందిపై ఉన్నతాధికారులు అమితప్రేమ కురిపిస్తున్నారు. అధికారుల్లో బి సెక్షన్ సూపరింటెండెంట్‌గా ఉంటున్న తహశీల్దారు వరదరాజులు ఈ విమర్శలు అధికంగా ఎదుర్కొంటున్నారు. ఈయనపై అధికారులు విపరితమైన ప్రేమ ‘వరద’ని పొంగిస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. కలెక్టర్ కార్యాలయం బి సెక్షన్ సూపరింటెండెంట్‌గా దాదాపు ఎమిదేళ్లగా ఇతను తిష్టవేశారనే ఆరోపణలు ఉన్నాయి. కూడేరు తహశీల్దారుగా వెళ్లినా కేవలం ఒక్క ఏడాది మాత్రమే అక్కడ చేసి తిరిగి కలెక్టరేట్‌కి డిప్యుటేషన్ వచ్చారు. గత ఏడాది ఈయన్ను బత్తలపల్లి తహశీల్దారుగా బదిలీ చేశారు. ఈయన అక్కడ కనీసం జాయిన్ కాలేదు. డిప్యుటేషన్‌పై బి సెక్షన్ సూపరింటెండెంట్‌గా కొనసాగుతూ వచ్చారు. ఇటీవల బదిలీలు నిర్వహించిన క్రమంలో ఇతన్ని కలెక్టరేట్‌కి బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చారు. అయితే షరా మామూలే. తిరిగి డిప్యుటేషన్ వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ కార్యాలయంలో ఏళ్లుగా ఒకే సీటులో కొనసాగుతున్న అధికారి ఎవరంటే రెండో ఆలోచన లేకుండా తహశీల్దారు వరదరాజులు అని ఇక్కడి ఉద్యోగులు ఠక్కున సమాధానం ఇస్తారు. డిప్యుటేషన్లు, బదిలీల వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించే కలెక్టర్ కూడా ఈయన విషయంలో ఎందుకో ఉదాసీనంగా వ్యవహరిస్తారనే విమర్శలు ఉద్యోగవర్గాల నుంచి వస్తున్నాయి.
బదిలీ స్థానాలు మారిపోయాయి :
ఇటీవల రెవెన్యూ శాఖలో బదిలీలు జరిగాయి. కొందరు ఉద్యోగుల్ని బదిలీ చేశారు. వారు అక్కడ జాయిన్ కాకుండానే ఆ ఉత్తర్వులు రద్దు కావడం.. మలి ఉత్తర్వులు జారీ చేయడం చకచకా జరిగిపోయాయి. ఈ బదిలీల వ్యవహారంపైన ఉద్యోగ వర్గాల నుంచి విమర్శలు వినవస్తున్నాయి. కలెక్టరేట్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా (ఎస్‌ఏ) ఉన్న రమాదేవిని తొలుత ధర్మవరం ఆర్డీఓ కార్యాలయానికి బదిలీ చేశారు. ఆ బదిలీని కాదని అనంతపురం పీఏబీఆర్ భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయంలో పోస్టింగ్ ఇచ్చారు. సీనియర్ అసిస్టెంట్ బి.సురేఖరావ్‌ని గార్లదిన్నె తహశీల్దారు కార్యలయానికి బదిలీ చేశారు. ఆమె తిరిగి కలెక్టరేట్‌లో ఏస్‌ఏగా పోస్టింగ్ ఇచ్చారు. ఎస్‌ఏ మాధవ కృష్ణయ్యని కొత్త చెరువు తహశీల్దారు కార్యాలయంలో ఆర్‌ఐ–2గా పోస్టింగ్ ఇస్తూ బదిలీ చేశారు. తిరిగి ఆయనకు బుక్కరాయసముద్రం తహశీల్దారు కార్యాలయంలో ఎస్‌ఏగా పోస్టింగ్ ఇచ్చారు. ఎస్‌ఏ శోభరాణిని పెనుకొండ తహశీల్దారు కార్యాయంలో ఎస్‌ఏగా బదిలీ చేశారు. తిరిగి ఆమెకి గార్లదిన్నె తహశీల్దారు కార్యాలయం ఆర్‌ఐ–2గా పోస్టింగ్ ఇచ్చారు. ఇలాగే మరికొన్ని బదిలీల్లో మార్పులు చేశారు. ఈ వ్యవహారంపై రెవెన్యూ శాఖ ఉద్యోగుల నుంచే పెద్ద ఎత్తున విమర్శులు వినవస్తున్నాయి.
Advertisement