ఉక్కునగరం(గాజువాక): విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెంలోని స్టీల్‌ప్లాంట్ ఆర్చ్ వద్ద ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు ఆదివారానికి 500 రోజులు పూర్తి కానున్నాయి. స్టీల్‌ప్లాంట్‌ను శతశాతం వ్యూహాత్మక అమ్మకం చేయాలని గతేడాది జనవరి 27న కేంద్ర కేబినెట్ కమిటీ ఆన్ ఎకనమిక్ ఎఫైర్స్ కమిటీ నిర్ణయించింది. దీంతో ఉక్కు కార్మిక వర్గం భగ్గుమంది.
ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా పలు ఆందోళనలు నిర్వహించింది. ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీలో రెండు రోజలు ధర్నాలు చేపట్టారు. ముఖ్యంగా జాతీయ రహదారిని రెండు రోజుల పాటు దిగ్భందించారు. స్టీల్‌ప్లాంట్ పరిపాలన భవనం, గేట్ల ముట్టడి చేపట్టారు. ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో పార్లమెంట్‌లో పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పింది.
ఇందులో భాగంగా అమ్మకాల ప్రక్రియలకు ట్రాన్సాక్షన్, లీగల్ అడ్వైజర్ల నియామకాలు చేపట్టింది. ఉక్కు ఉద్యమానికి బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు, రచయితలు, మేధావులు, రైతు సంఘాలు, ప్రజా సంఘాలు ఇలా అన్ని వర్గాలకు చెందిన వారు మద్దతు ఇస్తూ దీక్షల్లో పాల్గొంటున్నారు. దీక్షలు ప్రారంభించి 500 రోజులు పూర్తవుతున్న సందర్భంగా ఆదివారం పలు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు.
నేడు నగరానికి మహా ప్రదర్శన
ఉద్యమం 500వ రోజుకు చేరుకుంటున్న సందర్భంగా ఆదివారం ఉదయం స్టీల్‌ప్లాంట్ నుంచి నగరానికి మహా ర్యాలీ నిర్వహించేందుకు ఉక్కు పరిరక్షణ కమిటీ ఏర్పాట్లు చేసింది. 10వేల మంది ఉక్కు ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు, నిర్వాసితులు, యువకులు, మాజీ ఉద్యోగులు, ప్రజా సంఘాల నాయకులు ఈ ప్రదర్శనలో పాల్గోనున్నారు. ఈ నెల 27న కలెక్టర్‌కు వినతిపత్రం అందజేయనున్నారు. మహా ప్రదర్శన విజయవంతం చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు పరిరక్షణ పోరాట కమిటీ ప్లాంట్‌లో, ఉక్కునగరంలో, నిర్వాసిత కాలనీల్లో విస్తృత ప్రచారం చేసింది.
మహా ప్రదర్శన రూట్‌మ్యాప్
ప్రదర్శన కార్యక్రమం ఆదివారం ఉదయం ఉక్కునగరం నుంచి దేశపాత్రునిపాలెం, శనివాడ, అగనంపూడి, కూర్మన్నపాలెం, వడ్లపూడి మీదుగా కూర్మన్నపాలెం దీక్ష శిబిరం వద్దకు చేరుకుంటుంది. అక్కడ నుంచి ఉదయం 9 గంటలకు బైక్‌లపై నగరంలో డీఆర్‌ఎం కార్యాలయానికి చేరుకుని.. అక్కడ నుంచి కాలినడకన జీవీఎంసీ మహాత్మాగాంధీ విగ్రహం వరకు ప్రదర్శన కొనసాగనుంది. అక్కడ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు పోరాట కమిటీ నాయకులు తెలిపారు.
ఫిబ్రవరి 2021
- 2న కేంద్ర నిర్ణయం బయటకు పొక్కింది.
- 3న వేలాది మంది కార్మికులు ఉక్కు పరిపాలన భవనాన్ని ముట్టడించారు
- 5న స్టీల్‌ప్లాంట్ ఆర్చి నుంచి నగరంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు బైక్ ర్యాలీ చేపట్టారు.
- 7న ఉక్కు కార్మిక సంఘాలు, అధికార సంఘం, వివిధ అసోసియేషన్లతో పోరాట కమిటీ ఏర్పాటైంది.
- 10న మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభం
- 12న స్టీల్‌ప్లాంట్ ఆర్చ్ వద్ద రిలే నిరాహార దీక్షలు ప్రారంభించిన సీపీఐ నారాయణ, నాటి పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు
- 17న విశాఖ విమానాశ్రయంలో పోరాట కమిటీ నాయకులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశం
- 18న స్టీల్‌ప్లాంట్ ఆర్చ్ వద్ద బీజేపీ మినహా మిగతా అన్ని రాజకీయపార్టీలతో భారీ బహిరంగ సభ
- 20న జీవీఎంసీ నుంచి కూర్మన్నపాలెం దీక్షా స్థలి వరకు 25 కిలోమీటర్ల మేర ఎంపీ విజయసాయిరెడ్డి, వైఎస్సార్ సీపీ నేతల పాదయాత్ర
- 26న జాతీయ రహదారిపై రాస్తారోకో
- 27, 28వ తేదీల్లో రెండు రోజుల పాటు జాతీయ రహదారి దిగ్భందం
మార్చి 2021
- 9న ఉక్కు పరిపాలన భవనం ముట్టడి
- 14న కూర్మన్నపాలెం నుంచి గాజువాక వరకు పాదయాత్ర
- 15న ఢిల్లీలో వివిధ పార్టీల ఎంపీలకు వినతిపత్రాల సమర్పణ
- 20న వేలాది మందితో ఉక్కు త్రిష్ణా మైదానంలో కార్మిక గర్జన
- 26న రైతు చట్టాలు, స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై భారత్ బంద్
- 31న నిర్వాసిత సంఘాల ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్
ఏప్రిల్ 2021
- 4న ఆర్.కె బీచ్‌లో నిరసన ప్రదర్శన
- 8న అగనంపూడి నుంచి బీహెచ్‌పీవీ వరకు 10 వేల మందితో 10 కిలో మీటర్ల మానవహారం
- 18న రైతాంగ పోరాట నాయకుడు రాకేష్ సింగ్ తికాయత్ ఆధ్వర్యంలో రైతు, కార్మిక గర్జన
మే 2021
- 22న దీక్ష శిబిరం వద్ద 100 జెండాలు, 100 మీటర్ల బ్యానర్‌తో వంద మంది దీక్ష
- 22న ఉద్యోగులు తమ ఇళ్ల వద్ద కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన
జూన్ 2021
- స్టీల్‌ప్లాంట్ కార్మిక నాయకుల ఆధ్వర్యంలో రిలే దీక్షలు
జూలై 2021
- 8న ఉక్కు గేట్ల వద్ద ధర్నా
- 9న సీపీఐ కార్యదర్శి నారాయణ దీక్ష స్థలి సందర్శన
- 10న నగరంలోని మహాధర్నాకు బైక్ ర్యాలీ
- 15న కోక్‌ఓవెన్స్ నుంచి మెయిన్ గేటు వరకు పాదయాత్ర
- 27న చలో అడ్మిన్ కార్యక్రమం
(చదవండి: ప్రజల చెంతకే పాలన... జగనన్నతోనే సాధ్యం)
Comments
Please login to add a commentAdd a comment