
పెదవాల్తేరు(విశాఖ తూర్పు): స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులంతా సేఫ్‌జోన్‌లోనే ఉంటారని, ఎవరూ సంక్షేమం, భవిష్యత్ కోసం ఆందోళన చెందాల్సిన పనిలేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో ఆమె శనివారం మీడియాతో మాట్లాడారు. ఉక్కు ప్రైవేటీకరణ వల్ల పరిశ్రమకు ఎటువంటి నష్టం వాటిల్లదన్నారు. స్టీల్‌ప్లాంట్‌ను గతంలో పోస్కో, తరువాత టాటా కొనుగోలు చేస్తుందని మీడియాలోనే కథనాలు వచ్చాయి తప్ప కేంద్ర ప్రభుత్వం ఏమీ చెప్పలేదని స్పష్టం చేశారు. స్టీల్‌ప్లాంట్ విక్రయానికి కేంద్రం టెండర్లు పిలవలేదన్నారు.
గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఏపీకి ఎంతగానో నష్టం కలిగిందన్నారు. జన్మభూమి కమిటీల ద్వారా అవినీతి జరిగిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో విధ్వంసకర, కక్ష పూరితమైన పాలన సాగుతోందన్నారు. ఏపీ అప్పులపాలై దీన, హీన స్థితిని ఎదుర్కొంటోందన్నారు. రూ.20 ఖరీదు చేసే మద్యాన్ని రూ.200కి అమ్ముతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కేంద్రీకృత అవినీతి వల్లనే ఇసుక ధరలు పెరిగిపోతున్నాయన్నారు. కేంద్రంపై ప్రజల్లో దురభిప్రాయం కలిగేలా ఇక్కడ ప్రచారం చేస్తున్నారన్నారు.