విభాగంలో రాడ్ల మధ్య ఇరుక్కున్న రమణ
సాక్షి, ఉక్కునగరం(గాజువాక): స్టీల్‌ప్లాంట్ స్పెషల్ బార్ మిల్(ఎస్‌బీఎం) విభాగంలో సోమవారం జరిగిన ప్రమాదంలో ఓ కాంట్రాక్టు కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కాకినాడకు చెందిన జి.రమణ(28) పెదగంట్యాడ మండలం దిబ్బపాలెంలో నివసిస్తున్నాడు. ఉదయం షిఫ్ట్‌లో ఎస్‌బీఎం విభాగంలోని స్టాకు యార్డులో ఎత్తులో ఉన్న రౌండు బండిల్స్‌పై కూర్చుని గ్యాస్ కటింగ్ పనులు చేస్తున్నాడు. ఈ సమయంలో ఆపై ఉన్న ఇనుప బండిళ్లు ఒక్కసారిగా ఊడి పడడంతో ఆయన కింద పడిపోయాడు. అంతే కాకుండా అతనిపై గుండ్రపు రాడ్లు ఒక్కసారిగా పడిపోయాయి.
రాడ్లు మధ్య నలిగిపోయిన రమణను బయటకు తీసేందుకు సహ ఉద్యోగులు తీవ్రంగా ప్రయత్నించారు. ఎట్టకేలకు హైడ్రాతో అతనిపై పడ్డ రాడ్లను తొలగించి ప్రాథమిక చికిత్సా కేంద్రానికి తరలించారు. అనంతరం నగరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. విభాగం అధికారి నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని కాంట్రాక్టు కార్మిక నాయకులు ఆరోపించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హామీ ఇవ్వడంతో కార్మికులు ఆందోళన విరమించారు. స్టీల్‌ప్లాంట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన రమణ నాలుగు రోజుల క్రితమే విధుల్లో చేరినట్టు తెలిసింది. దీంతో తోటి కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment