ఇసుకేస్తే.. రాలనంత డబ్బు!
చినగంజాం : జిల్లాలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. కొందరు ముఠాలుగా ఏర్పడి ట్రాక్టర్లకు ట్రాక్టర్ల ఇసుకను యథేచ్ఛగా దోచుకెళ్తున్నారు. కోట్ల రూపాయల ఇసుక తరలి వెళ్తున్నా సంబంధిత అధికారులు నిద్ర నటిస్తున్నారు. ఇసుక మాఫియాలో కొందరు అధికారులకు సైతం భాగస్వామ్యం ఉందంటే అతిశయోక్తికాదు. నిరుపేదలకు ప్రభుత్వం ఇచ్చిన భూములు సైతం ప్రస్తుతం అనధికారికంగా ఇసుక క్వారీలుగా చెలామణి అవుతున్నాయి.
ప్రైవేట్ భూములు కొనుగోలు చేయడం తలకు మించిన భారం కావడంతో అక్రమార్కుల చూపు పేదల భూములపై పడింది. పేదల డీకే భూములపై కన్నేసి వాటిని తక్కువ రేటుకు కొనుగోలు చేసి భారీగా ఇసుక తవ్వితీసి కోట్లు గడిస్తున్నారు. చీరాల, ఈపూరుపాలెం, వేటపాలెం, చినగంజాం, కొత్తపట్నం తదితర ప్రాంతాల్లో ఇసుక యథేచ్ఛగా రవాణా అవుతున్నా ఇదేమని ప్రశ్నించే అధికారులు లేకపోవడం విచారకరం.
రోజూ రూ.లక్షల్లో దోపిడీ
తక్కువ రోజుల్లో లక్షాధికారులగా మారేందుకు కొందరు ఇసుక అక్రమ రవాణానే వ్యాపారంగా చేసుకున్నారు. ఒక్క చినగంజాం మండలంలోనే రోజుకు 200 నుంచి 300 వాహనాల ఇసుక అక్రమంగా తరలిపోతోంది. ట్రాక్టర్ ఇసుకలోడు ఖరీదు రూ. 500 నుంచి రూ.1000 వరకు ఉండగా రోజుకు సుమారు రూ.1.5 లక్షల నుంచి రూ.3 లక్షలు వరకు అక్రమార్కులు ఆర్జిస్తున్నారు. ఒక ట్రాక్టర్‌కు మూడు క్యూబిక్ మీటర్లు చొప్పున ఇసుక, పెద్ద లారీకి 6 ట్రాక్టర్‌లు చొప్పున 18 క్యూబిక్ మీటర్లు తర లిస్తున్నారు. అంటే రోజుకు కనీసం 1000 క్యూబిక్ మీటర్ల ఇసుక తరలి వెళ్తోందన్నమాట. దాదాపు 90 శాతం మందికి లెసైన్స్‌లు లేవంటే ఆశ్చర్యం వేయక మానదు.
అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన రెవెన్యూ, మైనింగ్, పోలీస్ అధికారుల్లో కొందరు మామూళ్లకు అలవాటు పడి సమర్థంగా విధులు నిర్వహించే అధికారులను సైతం అపహాస్యం చేస్తున్నారు. రెవెన్యూ, మైనింగ్, పోలీస్ అధికారులు తనిఖీకి వచ్చే విషయం అక్రమార్కులకు ముందుగానే తెలిసిపోతుందంటే వారి పలుకుబడి ఎంతవరకు ఉందో అర్థమవుతోంది. చినగంజాం నుంచి ఇసుక తరలిస్తున్న వాహనాలు రెవెన్యూ కార్యాలయం, పోలీస్‌స్టేషన్ మీదుగా స్వేచ్ఛగా వెళ్తుండటం గమనార్హం.
పర్యావరణానికి ముప్పు
భారీ స్థాయిలో ఇసుక తవ్వకాలు జరపడంతో భవిష్యత్‌లో గ్రామాలు వరద ముంపునకు గురయ్యే అవకాశం వుంది. 20 అడుగులకు పైబడి ఇసుక తవ్వి తరలిస్తున్నారు. భవిష్యత్తులో పర్యావరణానికి ముప్పు వాటిల్లక తప్పదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉపయోగం లేని ఫిర్యాదులు
ప్రభుత్వ భూముల్లో ఇసుకను యథేచ్ఛగా తవ్వి తరలిస్తూ ఇదేమని ప్రశ్నించే వారిని వాహనాలతో తొక్కిస్తామని మాఫియా బెదిరిస్తోంది. స్థానికంగా పలువురు కలెక్టర్‌ను కలిసి పలుమార్లు ఫిర్యాదు చేసినా ఉపయోగం లేదు. కమిటీలు వేసి సర్వే చేయించడం మినహా ఇసుక తవ్వకాలను ఆపేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు శూన్యం. ఇసుకాసురులు పేదల భూములే లక్ష్యంగా తమ దందా కొనసాగిస్తున్నారు. చినగంజాం రెవెన్యూ సర్వే నంబర్ 828,829,830లలో, మోటుపల్లి 128, 129, 130 సర్వే నంబర్‌లలో భూమికి ప్రభుత్వం కొందరు పేదలకు తాత్కాలికంగా పట్టాలు ఇచ్చింది. అక్రమార్కులు ఆ భూములే లక్ష్యంగా తవ్వకాలు సాగిస్తున్నారు.