
సాక్షి, హైదరాబాద్: వడ్డెర సొసైటీలకు, ఎస్సీ, ఎస్టీ యువకులతో ఏర్పడే సొసైటీలకు ఇసుక తయారీ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వ సహకారం అందిస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం ఇసుక రీచ్‌ల నుంచి వస్తున్న సహజ ఇసుకకు బదులుగా తయారీ ఇసుక వినియోగం పెంచాలన్నారు. స్టోన్ క్రషర్ల వంటి వాటి ద్వారా వడ్డెరల ఉపాధి పోయిందని, ఈ ఇసుక ప్లాంట్ల ఏర్పాటుతో వారికి ఉపాధి దొరికే అవకాశం ఉందని మంత్రి చెప్పారు. ఎస్సీ, ఎస్టీ యువతకు సంబంధిత సంక్షేమ శాఖ, ఉప ప్రణాళికల ద్వారా ఆర్థిక సహాయం, శిక్షణ, రుణాలు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు.
వచ్చే ఏడాదికి జిల్లాల వారీగా అవసర ఇసుక అవసరాలు, డిమాండ్‌పై అంచనాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. పోలీసులు, రెవిన్యూ, మైనింగ్ విభాగాలు సంయుక్తంగా ఇసుక తవ్వకాలపై పర్యవేక్షణ చేయాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో సదస్సు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.