ఏపీలో నిరంతర విద్యుత్ హుళక్కేనా!
అక్టోబర్ 2 నుంచి పథకం కొన్ని ప్రాంతాలకే పరిమితం
వ్యవసాయానికి 9 గంటలపైనా అస్పష్టత
నేడు ఢిల్లీలో మంత్రుల భేటీ
హైదరాబాద్: గృహావసరాలకు నిరంతర విద్యుత్ సరఫరా హామీ అమలు విషయంలో ఆంధ్రప్రదేశ్ సర్కారు మల్లగుల్లాలు పడుతోంది. ఈ పథకాన్ని కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితం చేయాలన్న ఆలోచన కూడా చేస్తోంది. దీంతోపాటే వ్యవసాయానికి తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా చేస్తామన్న ఎన్నికల హామీని కూడా పక్కకు నెట్టే ప్రయత్నంలో ఉంది. గృహావసరాలకు 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయాలన్న కేంద్ర పథకానికి ఆంధ్రప్రదేశ్‌ను ఎంపిక చేయడం, అక్టోబర్ 2 నుంచి ప్రయోగాత్మకంగా మొదలు పెట్టాల్సిన సంగతి తెలిసిందే. తొందరపడి 24 గంటల సరఫరా మొదలు పెడితే సరఫరా పరంగా ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉందని అధికారులు వివరించారు.
దీంతో పథకం అమలుపై ఇప్పుడు మల్లగుల్లాలు పడుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 122.37 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుండగా, డిమాండ్ 123.50 మిలియన్ యూనిట్లు ఉంది. 24 గంటల విద్యుత్ సరఫరాతోపాటు, రైతులకు తొమ్మిది గంటల విద్యుత్ ఇవ్వాలనే ఎన్నికల హామీని నెరవేరిస్తే డిమాండ్ ఆరు రెట్లు పెరగొచ్చని అంచనా. విశాఖపట్టణం, తిరుపతి వంటి నగరాలతో పాటు, కొన్ని మండలాలు, అందులోనూ కొన్ని గ్రామాలనే పథకం అమలుకు ఎంపిక చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగే రాష్ట్రాల విద్యుత్ మంత్రుల భేటీపై ఆంధ్రప్రదేశ్ సర్కారు గంపెడాశలు పెట్టుకుంది.