కాంట్రాక్టు సంస్థను బ్లాక్‌లిస్టులో పెట్టి చర్యలు తీసుకోవాలి
ముఖ్యమంత్రి రేవంత్ వైఫల్యం వల్లే ప్రజాధనం నీటిపాలు
త్వరలో రిటైర్డ్ ఇంజనీర్లు, పార్టీ నేతలతో సుంకిశాలకు: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం..పర్యవేక్షణ లోపంతోనే రిటైనింగ్ వాల్ కొట్టుకుపోయి సుంకిశాల పంప్‌హౌస్ నీట మునిగిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఆగస్టు 2న ఘటన జరిగినా అసెంబ్లీ వేదికగా ప్రకటన చేయకుండా..రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలను తొక్కిపెట్టిందన్నారు. సీఎంకు సమాచారం లేదంటే ఆయనకు పాలనపై పట్టు లేనట్టేనని వ్యాఖ్యానించారు. మాజీ మంత్రులు సబితాఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహమూద్ అలీ, ఎమ్మెల్యే కేపీ వివేకానందతో కలిసి తెలంగాణభవన్‌లో శుక్రవారం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
పంప్‌హౌస్ నీట మునిగిన సమాచారం తెలియనంత మొద్దునిద్రలో ప్రభుత్వం ఉందా? అని కేటీఆర్ ప్రశ్నించారు. అధికారుల ఒత్తిడితో హడావుడిగా గేట్లు, మోటార్లు బిగించడంతో ఈ ఘటన జరిగిందని చెప్పారు. మున్సిపల్ మంత్రిత్వ శాఖ బాధ్యతలు చూస్తున్న రేవంత్‌రెడ్డి వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగిందని, సీఎం పదవికి ఆయన అనర్హుడు అని విమర్శించారు. ‘చిత్తశుద్ధి ఉంటే కాంట్రాక్టు సంస్థను బ్లాక్‌లిస్టులో పెట్టి కఠినచర్యలు తీసుకోవాలి. సుంకిశాల ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సిట్టింగ్ లేదా రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలి. త్వరలో రిటైర్డ్ ఇంజనీర్లు, పార్టీ నాయకులతో కలసి సుంకిశాలను సందర్శించి ప్రజలకు వాస్తవాలు వివరిస్తాం’ అని కేటీఆర్ ప్రకటించారు.
వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఆరోపణలు
‘గతంలో మేడిగడ్డ కుంగుబాటు ఘటన జరిగిన వెంటనే కాంట్రాక్టు సంస్థ ఎల్‌అండ్‌టీతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. కానీ సుంకిశాల రిటైనింగ్ వాల్ కొట్టుకుపోయి న ఘటనపై తమ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకునేందుకు మంత్రులు బీఆర్‌ఎస్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మా మీద బట్టకాల్చి మీద వేస్తే సహించేది లేదు.
ప్రాజెక్టు డిజైన్ కాదు.. భట్టి ఆలోచన విధానమే లోపభూయిష్టంగా ఉంది. గతంలో మేడిగడ్డపై హడావుడి చేసిన ఎన్‌డీఎస్‌ఏ (నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ) ఎందుకు రాలేదు. దీనిపై బీజేపీ నాయకులు, కేంద్ర సంస్థలు ఎందుకు స్పందించడం లేదు. పంప్‌హౌస్ మునకతో కోట్లాది రూపాయల సంపద నీటి పాలైంది. హైదరాబాద్ మహానగర ప్రజలకు తీరని నష్టం వాటిల్లింది. నీళ్ల విషయంలో కేసీఆర్‌కు మంచి పేరు వస్తుందని కాంగ్రెస్ బురదచల్లే ప్రయత్నాలు చేస్తోంది’ అని కేటీఆర్ విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment