బిల్లులు కట్టకుంటే కరెంట్‌ కట్‌ | Power utilities get notices for dues to NTECL | Sakshi
Sakshi News home page

బిల్లులు కట్టకుంటే కరెంట్‌ కట్‌

Published Fri, Apr 21 2017 1:45 AM | Last Updated on Wed, Sep 5 2018 3:44 PM

బిల్లులు కట్టకుంటే కరెంట్‌ కట్‌ - Sakshi

బిల్లులు కట్టకుంటే కరెంట్‌ కట్‌

విద్యుత్‌ బిల్లుల మొండి బకాయిలు చెల్లించనిపక్షంలో రాష్ట్రానికి విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తామని

ట్రాన్స్‌కోకు ఎన్టీపీసీ వెల్లూరు ప్లాంట్‌ అల్టిమేటం
► రూ.134 కోట్ల బకాయిలపై డిస్కంలకు నోటీసులు
►  ఈ నెల 26లోగా చెల్లించాలని డిమాండ్‌
► 109 మెగావాట్ల విద్యుత్‌ సరఫరా నిలిచిపోయే ప్రమాదం


సాక్షి, హైదరాబాద్‌: విద్యుత్‌ బిల్లుల మొండి బకాయిలు చెల్లించనిపక్షంలో రాష్ట్రానికి విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తామని తమిళనాడులోని ఎన్టీపీసీ వెల్లూరు ప్లాంట్‌ యాజమాన్యం తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ సరఫరా సంస్థ (ట్రాన్స్‌కో)కు అల్టిమేటం జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీకి ఎన్టీపీసీ వెల్లూరు యాజమాన్యం తాజాగా లేఖ రాసింది. గతేడాది నవంబర్‌ నుంచి పేరుకుపోయిన రూ. 134.15 కోట్ల విద్యుత్‌ బిల్లుల బకాయిలను ఈ నెల 26లోగా చెల్లించనిపక్షంలో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం (పీపీఏ)లోని విద్యుత్‌ సరఫరా నియంత్రణ నిబంధనలను ప్రయోగిస్తామని ఈ లేఖలో స్పష్టం చేసింది.

నిబంధనల మేరకు తెలంగాణ ట్రాన్స్‌కోకు విద్యుత్‌ సరఫరాను నిలిపివేయడంతోపాటు విద్యుత్‌ను ఇతర కొనుగోలుదారులకు మళ్లిస్తామని తేల్చి చెప్పింది.1,500 మెగావాట్ల వెల్లూరు ఎన్టీపీసీ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం నుంచి ఒప్పందం మేరకు రాష్ట్రానికి 109 మెగావాట్ల విద్యుత్‌ సరఫరా జరుగుతోంది. బిల్లుల బకాయిలు చెల్లించని పక్షంలో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తామని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల విద్యుత్‌ సంస్థలకు సైతం ఎన్టీపీసీ వెల్లూరు నోటిసులు జారీ చేసింది.

డిస్కంలపై తీవ్ర ఒత్తిడి
విద్యుత్‌ కొనుగోళ్లకు సంబంధించిన రూ. వేల కోట్ల బిల్లుల చెల్లింపుల విషయంలో తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు చేస్తున్న జా ప్యంపై విద్యుదుత్పత్తి కంపెనీలు ప్రతి నెలా గగ్గోలు పెడుతున్నాయి. తెలంగాణ, ఏపీ విద్యుదుత్పత్తి సంస్థ(జెన్‌కో)లకు రాష్ట్ర డిస్కంలు చెల్లించాల్సిన బకాయిలు రూ.5 వేల కోట్లకుపైనే ఉన్నాయి. అదే విధంగా కేంద్ర విద్యుదుత్పత్తి కేంద్రాలు (సీజీఎస్‌), ఇతర ప్రైవేటు విద్యుత్‌ కంపెనీలకు కలిపి మొత్తం మరో రూ.వెయ్యి కోట్ల బిల్లుల బకా యిలు చెల్లించాల్సి ఉంది. విద్యుత్‌ చార్జీల వసూళ్లతో వచ్చే ఆదాయంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే విద్యుత్‌ సబ్సిడీ నిధులతో విద్యుదుత్పత్తి కంపెనీలకు బిల్లుల బకాయిలు చెల్లిస్తున్నా ప్రతి నెలా రూ. 6 వేల కోట్ల బకాయిలు అలానే మిగిలిపోతున్నాయి.

గత ఆర్థిక సంవత్సరం చివరి వరకు మొండి బకాయిలు రూ. 9 వేల కోట్లకు పేరుకుపోవడంతో డిస్కంలు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రూ. 3 వేల కోట్లను పెట్టుబడి మూలధనంగా డిస్కంలకు మంజూ రు చేయడంతో బకాయిలు రూ. 6 వేల కోట్లకు తగ్గాయి. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ సరఫరా కొనసాగింపు కోసం ప్రతి నెలా డిస్కంలకు చెల్లించాల్సిన విద్యుత్‌ సబ్సిడీ నిధుల విడుదలలో రాష్ట్ర ప్రభుత్వం తరచూ జాప్యం చేస్తుండటంతో తెలంగాణ ట్రాన్స్‌కో, డిస్కంల యాజమాన్యాలపై తీవ్ర ఒత్తిడి నెలకొంటోంది. కాగా, రాష్ట్రానికి విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తామని ఎన్టీపీసీ విద్యుత్‌ కేంద్రాలతోపాటు పలు ప్రైవేటు విద్యుదుత్పత్తి కంపెనీలు గతంలోనూ అల్టిమేటాలు జారీ చేశాయని ట్రాన్స్‌కో వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement