
ఉల్లంఘిస్తే ప్రతిఘటనే..!
- శ్రీశైలంలో 854 అడుగుల కనీస నీటి మట్టం రాయలసీమ హక్కు
- ఇందులో తల దూర్చవద్దు
- జలయుద్ధాలకు ఆజ్యం పోయద్దు
- 7న జరిగే శ్రీశైలం జలాశయం ముట్టడికి అందరూ ఆహ్వానితులే
- విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు భూమా, బుడ్డా
నంద్యాల: శ్రీశైలం జలాశయంలో శాశ్వతంగా 854 అడుగుల కనీస నీటి మట్టాన్ని కొనసాగించాలని, దానిని ఉల్లంఘిస్తే ప్రతిఘటించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వానికి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు భూమానాగిరెడ్డి, బుడ్డా రాజశేఖర్ రెడ్డిలు అల్టిమేటం జారీ చేశారు. ఆదివారం నంద్యాల పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. భూమా మాట్లాడుతూ.. ప్రస్తుతం ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయం నిండే అవకాశం ఉందన్నారు. కనీస నీటిమట్టం 854 అడుగులు ఉంచకుండా.. విద్యుత్, తాగునీటి అవసరాల పేరుతో నీటిని ఇతర ప్రాంతాలకు చెందిన వారు, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు తీసుకొని వెళ్తే సహించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
రాయలసీమలోని అన్ని జిల్లాలు కృష్ణా జలాలపైనే ఆధారపడ్డాయనే విషయాన్ని పాలకులు గుర్తించాలన్నారు. సీమలోని మూడు కోట్ల మంది ప్రజల తాగు, సాగునీటి అవసరాలను శ్రీశైలం రిజర్వాయర్ తీరుస్తోందన్నారు. గత నెల 10వ తేదీన హైదరాబాద్‌లో జరిగిన కృష్ణా జలాల కమిటీ సమావేశంలో శ్రీశైలం జలాశయం కనీస నీమట్టాన్ని 788 అడుగులకు తగ్గించాలని నిర్ణయం చేస్తే సీఎం చంద్రబాబునాయుడు, నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమాతో పాటు రాయలసీమకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని భూమా ప్రశ్నించారు.
రాజకీయాలకు అతీతంగా అధికార పార్టీ నాయకులు నోరు మెదపకుండా రాయలసీమ ప్రజల నోరును కొట్టినవారయ్యారన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, ప్రజల సంక్షేమానికి పాటుపడినప్పుడే ప్రజాప్రతినిధులుగా గౌరవం ఉంటుందన్నారు. శ్రీశైలం రిజర్వాయర్‌లో 854 అడుగుల కనీస నీటిమట్టాన్ని కొనసాగించడానికి ముఖ్యమంత్రిని, డిప్యూటీ సీఎంను కలవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. వైఎస్సార్, అనంతపురం జిల్లాలకు చెందిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలతోపాటు టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ నాయకుల మద్దతు కూడగడతామన్నారు. సీమ రైతుల ప్రయోజనార్థం ఈ నెల 7వ తేదీన శ్రీశైలం డ్యాంను ముట్టడిస్తున్నామని, ఇందుకు అందరూ ఆహ్వానితులే అని పేర్కొన్నారు.
మూడో రాష్ట్ర ఏర్పాటుకు ఆజ్యం పోయొద్దు..: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న నిర్ణయాలతో మూడో రాష్ట్ర ఉద్యమం ఆరంభమయ్యే అవకాశం ఉందని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి అన్నారు. ఎలాగూ పంట రుణాలను మాఫీ చేసే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదని, కనీసం శ్రీశైలం జలాశయం నీటితోనైనా పంటలు పండించుకుందామనుకుంటే అడ్డుకుంటున్నారని విమర్శించారు. గతంలో ముఖ్యమంత్రిగా కొనసాగుతూ చంద్రబాబు నాయుడు.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఆజ్యం పోస్తూ నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు రాజధానితో పాటు ఇతర ప్రాజెక్టులన్నీ కోస్తాంధ్రకు తరలిస్తూ సీమ ప్రజల ఆగ్రహం చవి చూస్తున్నారన్నారు. చివరికి సాగునీరు కూడా అందకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని.. దీంతో ప్రత్యేక రాష్ట్రం కోసం సీమ ప్రజలు ఉద్యమించే పరిస్థితి తెస్తున్నారన్నారు.