వైఎస్‌ ప్రాజెక్టులకు గేట్లెత్తుతున్నావ్‌ | Rayalaseema projects being ignored: ys Jagan | Sakshi
Sakshi News home page

వైఎస్‌ ప్రాజెక్టులకు గేట్లెత్తుతున్నావ్‌

Published Fri, Jan 6 2017 2:28 AM | Last Updated on Wed, Jul 25 2018 4:42 PM

వైఎస్‌ ప్రాజెక్టులకు గేట్లెత్తుతున్నావ్‌ - Sakshi

వైఎస్‌ ప్రాజెక్టులకు గేట్లెత్తుతున్నావ్‌

రైతు భరోసా యాత్రలో చంద్రబాబుపై మండిపడ్డ జగన్‌
రైతు భరోసా నుంచి సాక్షి ప్రతినిధి:  ‘‘దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో చేపట్టిన ప్రాజెక్టులకు ఇప్పుడు చంద్రబాబు వచ్చి గేట్లు ఎత్తుతున్నాడు. వైఎస్సార్‌కు క్రెడిట్‌ ఇవ్వాల్సిన ప్రాజెక్టులకు లస్కర్‌ మాదిరిగా గేట్లు ఎత్తి, తానే ఆ ప్రాజెక్టుల కోసం కలలు కన్నానని చెబుతున్నారు. అదీ అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత. ప్రజల జ్ఞాపకశక్తి తక్కువ అనే దుర్బుద్ధితో చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారు’’ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మండిపడ్డారు. శ్రీశైలం డ్యాంలో నీరు ఉన్నప్పటికీ  నీరు ఇవ్వడంలేదని, డ్యాం 100 అడుగుల కింద ప్లంజ్‌ పూల్‌కు గండిపడినా మరమ్మతులు చేయడంలేదని, సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబు వైఖరికి నిదర్శనమని ధ్వజమెత్తారు.

కర్నూలు జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించేందుకు జగన్‌ గురువారం రైతు భరోసా యాత్రకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్‌ నుంచి లింగాలగట్టుకు మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో చేరుకున్నారు. అక్కడ ఆయనకు నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం శ్రీశైలం డ్యాం చేరుకుని సాగునీటి ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు వైఖరిని ఎండగట్టారు. అక్కడి నుంచి సున్నిపెంటకు చేరుకున్న ఆయనకు అడుగడుగున ఘన నీరాజనాలు పలికారు. సుమారు రెండు కిలోమీటర్ల రోడ్‌షోకు ఏకంగా ఆరు గంటల సమయం తీసుకుంది. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులను ఆయన ప్రేమపూర్వకంగా పలకరిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ప్రసంగం ఆయన మాటల్లోనే..

శ్రీశైలంలో నీళ్లున్నా సీమకివ్వలేదు...
పోతిరెడ్డిపాడు రాయలసీమకు నీళ్లు ఇచ్చే ప్రధాన కాలువ. పోతిరెడ్డిపాడును ఆపరేట్‌ చేయాలంటే శ్రీశైలం డ్యాంలో 844 అడుగుల నీరు ఉండాలి. కేవలం ఈ ఒక్క కాలువే 44వేల క్యూసెక్కుల నీరును డిశ్చార్జ్‌ చేస్తుంది. ఈ రోజు డ్యాంలో 862 అడుగుల నీరు ఉంది. ఆగస్టు 16వ తేదీ నుంచి జనవరి 5వ తేదీ వరకూ సుమారు 130 రోజులుగా 844 అడుగుల కంటే పైనే నీరుంది. అయినా రాయలసీమలోని ప్రాజెక్టులకు నీరివ్వలేదు. దీంతో గండికోటతోపాటు దిగువనున్న రిజర్వాయర్‌లన్నింటిలోనూ నీరు లేదు. ప్రాజెక్టుల పట్ల చంద్రబాబు ప్రేమెంతో తెలుసుకోవడానికి ఇదొక నిదర్శనం.

2009లో వరదలు వచ్చినప్పుడు విపరీతంగా నీటిని నిల్వ చేసినప్పుడు శ్రీశైలం ప్లంజ్‌పూల్‌లో దాదాపు 100 అడుగుల లోపల గొయ్యి ఏర్పడితే దానిని మరమ్మతు చేయడానికి వీరికి మనసు రాలేదు. అది రిపేరు చేయకపోతే అది అలాగే కొనసాగితే బ్యాక్‌ వాటర్‌ ప్రెజర్‌... ఆ గొయ్యి నుంచి డ్యాం మీద పడుతుంది. దానివల్ల డ్యాంకు ప్రమాదమని తెలిసినా ఏడేళ్లుగా మరమ్మతులు చేయలేదు. దీనికోసం ఇంజినీర్లు పంపించిన ప్రతిపాదనలను చంద్రబాబు మూడేళ్లుగా పట్టించుకోలేదు. ఇక పూర్తయిన పులిచింతల ప్రాజెక్టులో 44 టీఎంసీల నీరు నిలబెట్టుకోవచ్చు. రాజశేఖరరెడ్డిగారు ప్రాజెక్టు కట్టి అప్పచెప్పినా కూడా చంద్రబాబు ఆర్‌ అండ్‌ ఆర్‌కు డబ్బులు ఇవ్వకపోవడంవల్ల నీళ్లు నింపుకోలేని దుస్థితి. దీంతో ప్రకాశం బ్యారేజీనుంచి 55 టీఎంసీల నీటిని సముద్రంలోకి వదులుకోవాల్సి వస్తోంది. ప్రాజెక్టులపై చంద్రబాబు ప్రేమకు ఇన్ని నిదర్శనాలున్నాయి.

ప్రాజెక్టులపై బాబువన్నీ అబద్ధాలే
కర్నూలు–కడప కెనాల్‌(కేసీ కెనాల్‌)కు సప్లిమెంటు చేసే మచ్చుమర్రి ప్రాజెక్టు మొదలు పెట్టింది వైఎస్‌ రాజశేఖరరెడ్డి. ఆయన హయాంలోనే 90 శాతం పనులు పూర్తయ్యాయి. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఐదుశాతం పూర్తి చేస్తే.. చంద్రబాబు మిగిలిన ఐదుశాతం మాత్రమే పూర్తి చేశారు. కానీ రాజశేఖరరెడ్డికి క్రెడిట్‌ ఇవ్వకుండా తానే కష్టపడి కట్టినట్లు బిల్డప్‌ ఇస్తూ చంద్రబాబు కన్నార్పకుండా అబద్ధాలు చెబుతుంటే స్థానిక ఎమ్మెల్యే, మా ఐజయ్య అన్న ఆశ్చర్యపోయారు. రాజశేఖరరెడ్డి కట్టిన ప్రాజెక్టుకు లస్కర్‌లా గేట్లెత్తి తానే కలలు కన్నానని చెబుతున్నారు. ప్రజల జ్ఞాపకశక్తి తక్కువనే దుర్బుద్ధితో తానే క్రెడిట్‌ తీసుకోవాలని యోచిస్తున్నారు. ఈ మనిషి దిక్కుమాలిన ఆలోచనలన్నీ ఇదే విధంగా ఉంటాయి. ఇంతాచేసి... చంద్రబాబు ఆర్భాటంగా ప్రారంభించిన ముచ్చుమర్రి ప్రాజెక్టు పంపులిప్పుడు పనిచేయడంలేదు. ఒక్కరోజుకే మూతపడ్డాయి. సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబు వైఖరికి ఇదీ నిదర్శనం.

 వసంతరావు కుటుంబానికి అండగా నిలుస్తాం  
శ్రీశైలం ప్రాజెక్టు: ప్రత్యర్థుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఆసాది వసంతరావు(53) కుటుంబానికి అండగా నిలుస్తామని పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భరోసానిచ్చారు. రైతు భరోసా యాత్రలో భాగంగా శ్రీశైలం చేరుకున్న జగన్‌.. గురువారం మధ్యాహ్నం సున్నిపెంటలోని వసంతరావు ఇంటికి చేరుకున్నారు. సతీమణి శైలజ, కుమార్తె మానస, కుమారుడు ప్రవీణ్‌తేజలను పరామర్శించారు. పార్టీకి విస్తృత సేవలు అందించిన వసంతరావు కుటుంబానికి అన్నివిధాల అండగా నిలుస్తానని ఆయన భరోసానిచ్చారు.

రెండో రోజు భరోసా యాత్ర సాగుతుందిలా..
జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు భరోసా కల్పించేందుకు జగన్‌ చేపట్టిన రైతు భరోసా యాత్ర  రెండో రోజు శుక్రవారం(6వ తేదీ) శ్రీశైలం నియోజకవర్గంలో సాగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement