raith bharosa yatra
-
వైఎస్ ప్రాజెక్టులకు గేట్లెత్తుతున్నావ్
రైతు భరోసా యాత్రలో చంద్రబాబుపై మండిపడ్డ జగన్ రైతు భరోసా నుంచి సాక్షి ప్రతినిధి: ‘‘దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చేపట్టిన ప్రాజెక్టులకు ఇప్పుడు చంద్రబాబు వచ్చి గేట్లు ఎత్తుతున్నాడు. వైఎస్సార్‌కు క్రెడిట్ ఇవ్వాల్సిన ప్రాజెక్టులకు లస్కర్ మాదిరిగా గేట్లు ఎత్తి, తానే ఆ ప్రాజెక్టుల కోసం కలలు కన్నానని చెబుతున్నారు. అదీ అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత. ప్రజల జ్ఞాపకశక్తి తక్కువ అనే దుర్బుద్ధితో చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. శ్రీశైలం డ్యాంలో నీరు ఉన్నప్పటికీ నీరు ఇవ్వడంలేదని, డ్యాం 100 అడుగుల కింద ప్లంజ్ పూల్‌కు గండిపడినా మరమ్మతులు చేయడంలేదని, సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబు వైఖరికి నిదర్శనమని ధ్వజమెత్తారు. కర్నూలు జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించేందుకు జగన్ గురువారం రైతు భరోసా యాత్రకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ నుంచి లింగాలగట్టుకు మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో చేరుకున్నారు. అక్కడ ఆయనకు నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం శ్రీశైలం డ్యాం చేరుకుని సాగునీటి ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు వైఖరిని ఎండగట్టారు. అక్కడి నుంచి సున్నిపెంటకు చేరుకున్న ఆయనకు అడుగడుగున ఘన నీరాజనాలు పలికారు. సుమారు రెండు కిలోమీటర్ల రోడ్‌షోకు ఏకంగా ఆరు గంటల సమయం తీసుకుంది. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులను ఆయన ప్రేమపూర్వకంగా పలకరిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ప్రసంగం ఆయన మాటల్లోనే.. శ్రీశైలంలో నీళ్లున్నా సీమకివ్వలేదు... పోతిరెడ్డిపాడు రాయలసీమకు నీళ్లు ఇచ్చే ప్రధాన కాలువ. పోతిరెడ్డిపాడును ఆపరేట్ చేయాలంటే శ్రీశైలం డ్యాంలో 844 అడుగుల నీరు ఉండాలి. కేవలం ఈ ఒక్క కాలువే 44వేల క్యూసెక్కుల నీరును డిశ్చార్జ్ చేస్తుంది. ఈ రోజు డ్యాంలో 862 అడుగుల నీరు ఉంది. ఆగస్టు 16వ తేదీ నుంచి జనవరి 5వ తేదీ వరకూ సుమారు 130 రోజులుగా 844 అడుగుల కంటే పైనే నీరుంది. అయినా రాయలసీమలోని ప్రాజెక్టులకు నీరివ్వలేదు. దీంతో గండికోటతోపాటు దిగువనున్న రిజర్వాయర్లన్నింటిలోనూ నీరు లేదు. ప్రాజెక్టుల పట్ల చంద్రబాబు ప్రేమెంతో తెలుసుకోవడానికి ఇదొక నిదర్శనం. 2009లో వరదలు వచ్చినప్పుడు విపరీతంగా నీటిని నిల్వ చేసినప్పుడు శ్రీశైలం ప్లంజ్‌పూల్‌లో దాదాపు 100 అడుగుల లోపల గొయ్యి ఏర్పడితే దానిని మరమ్మతు చేయడానికి వీరికి మనసు రాలేదు. అది రిపేరు చేయకపోతే అది అలాగే కొనసాగితే బ్యాక్ వాటర్ ప్రెజర్... ఆ గొయ్యి నుంచి డ్యాం మీద పడుతుంది. దానివల్ల డ్యాంకు ప్రమాదమని తెలిసినా ఏడేళ్లుగా మరమ్మతులు చేయలేదు. దీనికోసం ఇంజినీర్లు పంపించిన ప్రతిపాదనలను చంద్రబాబు మూడేళ్లుగా పట్టించుకోలేదు. ఇక పూర్తయిన పులిచింతల ప్రాజెక్టులో 44 టీఎంసీల నీరు నిలబెట్టుకోవచ్చు. రాజశేఖరరెడ్డిగారు ప్రాజెక్టు కట్టి అప్పచెప్పినా కూడా చంద్రబాబు ఆర్ అండ్ ఆర్కు డబ్బులు ఇవ్వకపోవడంవల్ల నీళ్లు నింపుకోలేని దుస్థితి. దీంతో ప్రకాశం బ్యారేజీనుంచి 55 టీఎంసీల నీటిని సముద్రంలోకి వదులుకోవాల్సి వస్తోంది. ప్రాజెక్టులపై చంద్రబాబు ప్రేమకు ఇన్ని నిదర్శనాలున్నాయి. ప్రాజెక్టులపై బాబువన్నీ అబద్ధాలే కర్నూలు–కడప కెనాల్(కేసీ కెనాల్)కు సప్లిమెంటు చేసే మచ్చుమర్రి ప్రాజెక్టు మొదలు పెట్టింది వైఎస్ రాజశేఖరరెడ్డి. ఆయన హయాంలోనే 90 శాతం పనులు పూర్తయ్యాయి. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఐదుశాతం పూర్తి చేస్తే.. చంద్రబాబు మిగిలిన ఐదుశాతం మాత్రమే పూర్తి చేశారు. కానీ రాజశేఖరరెడ్డికి క్రెడిట్ ఇవ్వకుండా తానే కష్టపడి కట్టినట్లు బిల్డప్ ఇస్తూ చంద్రబాబు కన్నార్పకుండా అబద్ధాలు చెబుతుంటే స్థానిక ఎమ్మెల్యే, మా ఐజయ్య అన్న ఆశ్చర్యపోయారు. రాజశేఖరరెడ్డి కట్టిన ప్రాజెక్టుకు లస్కర్‌లా గేట్లెత్తి తానే కలలు కన్నానని చెబుతున్నారు. ప్రజల జ్ఞాపకశక్తి తక్కువనే దుర్బుద్ధితో తానే క్రెడిట్ తీసుకోవాలని యోచిస్తున్నారు. ఈ మనిషి దిక్కుమాలిన ఆలోచనలన్నీ ఇదే విధంగా ఉంటాయి. ఇంతాచేసి... చంద్రబాబు ఆర్భాటంగా ప్రారంభించిన ముచ్చుమర్రి ప్రాజెక్టు పంపులిప్పుడు పనిచేయడంలేదు. ఒక్కరోజుకే మూతపడ్డాయి. సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబు వైఖరికి ఇదీ నిదర్శనం. వసంతరావు కుటుంబానికి అండగా నిలుస్తాం శ్రీశైలం ప్రాజెక్టు: ప్రత్యర్థుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆసాది వసంతరావు(53) కుటుంబానికి అండగా నిలుస్తామని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసానిచ్చారు. రైతు భరోసా యాత్రలో భాగంగా శ్రీశైలం చేరుకున్న జగన్.. గురువారం మధ్యాహ్నం సున్నిపెంటలోని వసంతరావు ఇంటికి చేరుకున్నారు. సతీమణి శైలజ, కుమార్తె మానస, కుమారుడు ప్రవీణ్తేజలను పరామర్శించారు. పార్టీకి విస్తృత సేవలు అందించిన వసంతరావు కుటుంబానికి అన్నివిధాల అండగా నిలుస్తానని ఆయన భరోసానిచ్చారు. రెండో రోజు భరోసా యాత్ర సాగుతుందిలా.. జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు భరోసా కల్పించేందుకు జగన్ చేపట్టిన రైతు భరోసా యాత్ర రెండో రోజు శుక్రవారం(6వ తేదీ) శ్రీశైలం నియోజకవర్గంలో సాగుతుంది. -
శ్రీశైలం డ్యాంను పరిశీలించిన వైఎస్ జగన్
-
శ్రీశైలం డ్యాంను పరిశీలించిన వైఎస్ జగన్
కర్నూలు : ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం మధ్యాహ్నం శ్రీశైలం చేరుకున్నారు. ఆయన శ్రీశైలం డ్యాంను పరిశీలించారు. శ్రీశైలం చేరుకున్న వైఎస్ జగన్‌కు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. శ్రీశైలం నుంచి మొదటి విడత రైతు భరోసా యాత్ర గురువారం ప్రారంభంకానుంది. శ్రీశైలం, నంద్యాల నియోజకవర్గాల్లో మొదటి రోజు ఆయన పర్యటించనున్నారు. అప్పుల బాధతో, రుణమాఫీ అమలుకాక ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శిస్తారు. -
శ్రీశైలం బయల్దేరిన వైఎస్ జగన్
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి శ్రీశైలం బయల్దేరారు. కర్నూలు జిల్లాలో అప్పుల బాధ తాళలేక, వ్యవసాయం గిట్టుబాటు కాక ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆయన ఓదార్చి, వారిలో ధైర్యం నింపనున్నారు. శ్రీశైలం నుంచి ప్రారంభమయ్యే ఈ భరోసా యాత్ర మొదటి విడతలో శ్రీశైలం, నంద్యాల నియోజకవర్గాల్లో జరగనుంది. అప్పుల బాధతో, రుణమాఫీ అమలుకాక ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించి ఈ సందర్భంగా ఆయన భరోసా ఇస్తారు. ఇందులో భాగంగా వైఎస్ జగన్ హైదరాబాద్ నుంచి నేరుగా లింగాలగట్టుకు చేరుకుని శ్రీశైలం డ్యాంను పరిశీలించనున్నారు. అనంతరం సున్నిపెంట మీదుగా శ్రీశైలం చేరుకుంటారు. -
రేపటి నుంచి రైతు భరోసా యాత్ర
కర్నూలు జిల్లాలో వారం రోజులు వైఎస్ జగన్ పర్యటన సాక్షి ప్రతినిధి, కర్నూలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 5(గురువారం) నుంచి కర్నూలు జిల్లాలో ‘రైతు భరోసా యాత్ర’ చేపట్టనున్నారు. శ్రీశైలం నుంచి ప్రారంభమయ్యే ఈ భరోసా యాత్ర మొదటి విడతలో శ్రీశైలం, నంద్యాల నియోజకవర్గాల్లో జరగనుంది. ఈ నెల 5 నుంచి 11వ తేదీ వరకూ వారం పాటు ఈ యాత్ర కొనసాగుతుందని పార్టీ ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ తలశిల రఘురాం తెలిపారు. అప్పుల బాధతో, రుణమాఫీ అమలుకాక ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఆయన భరోసా ఇవ్వనున్నారు. ఈ నెల 5న హైదరాబాద్ నుంచి నేరుగా లింగాలగట్టుకు చేరుకుని శ్రీశైలం డ్యాంను పరిశీలించనున్నారు. అనంతరం సున్నిపెంట మీదుగా శ్రీశైలం చేరుకుని అక్కడే బస చేస్తారు. ఆ తర్వాత 6వ తేదీన శ్రీశైలంలో మల్లన్న దర్శనం అనంతరం ఆత్మకూరు చేరుకుని బహిరంగసభలో ప్రసంగించనున్నట్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి తెలిపారు. -
చంద్రబాబుది మోసపూరిత పాలన: వైఎస్ జగన్
-
చంద్రబాబుది మోసపూరిత పాలన: వైఎస్ జగన్
అనంతపురం : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది. సోమవారానికి రైతు భరోసా యాత్ర ఏడోరోజుకు చేరింది. ఈ సందర్భంగా వైఎస్ జగన్ పీసీ గిరిలో బీడు భూములను పరిశీలించారు. పంటలు ఎందుకు సాగు చేయడం లేదని రైతులను ఆయన ప్రశ్నించారు. వైఎస్ జగన్ ఇంకా ఏంమాట్లాడారంటే....'అనంతపురం జిల్లాలో 20 లక్షల ఎకరాల్లో వేరేశెనగ పంట సాగు చేయాల్సి ఉంది. ఇప్పటిదాకా వర్షాలు రాకపోవడంతో కేవలం 5 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయి. ప్రకృతి వైపరీత్యాలకు తోడు పాలకుల నిర్లక్ష్యం రైతులకు శాపం అవుతుంది. అనంతపురం జిల్లాలో 5 లక్షల క్వింటాళ్ల వేరుశెనగ విత్తనాలు సరఫరా చేయాల్సి ఉండగా కేవలం లక్షన్నర క్వింటాళ్లను ప్రభుత్వం సరఫరా చేసింది. ఇచ్చిన విత్తనాలను కూడా బ్లాక్ మార్కెట్‌కు తరలించి టీడీపీ నేతలు సొమ్ము చేసుకున్నారు. రైతుల రుణాలు మాఫీ కాలేదు. రుణమాఫీ కాకపోవడంతో రైతులపై అపరాధ రుసుము పడుతోంది. గతంలో పావలా వడ్డీ చెల్లించే రైతులు ఇప్పుడు 14 శాతం వడ్డీ కట్టాల్సి వస్తోంది. ఎరువుల ధరలు ఆకాశానంటున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సురెన్స్ రైతులకు ఇవ్వలేదు. కరవు కాటకాలను తట్టుకోలేక అనంత రైతులు బెంగళూరుకు వలస వెళ్తున్నారు. చంద్రబాబుది మోసపూరిత పాలన, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఎందుకివ్వలేదు? పింఛన్లు, రేషన్ కార్డులు నిర్ధాక్షణ్యంగా కత్తిరిస్తున్నారు' అని అన్నారు. మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి మరోవైపు అనంతపురం జిల్లా కరువు దుస్థితిపై వైఎస్ జగన్‌కు వివరించారు. రైతుల ఆత్మహత్యలు, వలసల పరిస్థితిని అసెంబ్లీలో ప్రస్తావించాలని ఆయన ఈ సందర్భంగా జగన్‌కు విజ్ఞప్తి చేశారు. -
21 నుంచి అనంతలో వైఎస్ జగన్ రైతు భరోసా యాత్ర
హైదరాబాద్ : అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడో విడత రైతు భరోసా యాత్ర షెడ్యూల్ ఖరారు అయింది. జులై 21 నుంచి జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ఆయన రైతు భరోసా యాత్ర చేపట్టనున్నారు. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శిస్తారు. అనంతపురంలో ఆయన రెండు విడతల్లో రైతు కుటుంబాలను పరామర్శించిన విషయం తెలిసిందే.