వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది.
అనంతపురం : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది. సోమవారానికి రైతు భరోసా యాత్ర ఏడోరోజుకు చేరింది. ఈ సందర్భంగా వైఎస్ జగన్ పీసీ గిరిలో బీడు భూములను పరిశీలించారు. పంటలు ఎందుకు సాగు చేయడం లేదని రైతులను ఆయన ప్రశ్నించారు.
వైఎస్ జగన్ ఇంకా ఏంమాట్లాడారంటే....'అనంతపురం జిల్లాలో 20 లక్షల ఎకరాల్లో వేరేశెనగ పంట సాగు చేయాల్సి ఉంది. ఇప్పటిదాకా వర్షాలు రాకపోవడంతో కేవలం 5 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయి. ప్రకృతి వైపరీత్యాలకు తోడు పాలకుల నిర్లక్ష్యం రైతులకు శాపం అవుతుంది. అనంతపురం జిల్లాలో 5 లక్షల క్వింటాళ్ల వేరుశెనగ విత్తనాలు సరఫరా చేయాల్సి ఉండగా కేవలం లక్షన్నర క్వింటాళ్లను ప్రభుత్వం సరఫరా చేసింది.
ఇచ్చిన విత్తనాలను కూడా బ్లాక్ మార్కెట్కు తరలించి టీడీపీ నేతలు సొమ్ము చేసుకున్నారు. రైతుల రుణాలు మాఫీ కాలేదు. రుణమాఫీ కాకపోవడంతో రైతులపై అపరాధ రుసుము పడుతోంది. గతంలో పావలా వడ్డీ చెల్లించే రైతులు ఇప్పుడు 14 శాతం వడ్డీ కట్టాల్సి వస్తోంది. ఎరువుల ధరలు ఆకాశానంటున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సురెన్స్ రైతులకు ఇవ్వలేదు. కరవు కాటకాలను తట్టుకోలేక అనంత రైతులు బెంగళూరుకు వలస వెళ్తున్నారు. చంద్రబాబుది మోసపూరిత పాలన, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఎందుకివ్వలేదు? పింఛన్లు, రేషన్ కార్డులు నిర్ధాక్షణ్యంగా కత్తిరిస్తున్నారు' అని అన్నారు.
మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి మరోవైపు అనంతపురం జిల్లా కరువు దుస్థితిపై వైఎస్ జగన్కు వివరించారు. రైతుల ఆత్మహత్యలు, వలసల పరిస్థితిని అసెంబ్లీలో ప్రస్తావించాలని ఆయన ఈ సందర్భంగా జగన్కు విజ్ఞప్తి చేశారు.