
శ్రీశైలం బయల్దేరిన వైఎస్ జగన్
వైఎస్‌ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గురువారం హైదరాబాద్ నుంచి శ్రీశైలం బయల్దేరారు.
హైదరాబాద్ : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి శ్రీశైలం బయల్దేరారు. కర్నూలు జిల్లాలో అప్పుల బాధ తాళలేక, వ్యవసాయం గిట్టుబాటు కాక ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆయన ఓదార్చి, వారిలో ధైర్యం నింపనున్నారు.
శ్రీశైలం నుంచి ప్రారంభమయ్యే ఈ భరోసా యాత్ర మొదటి విడతలో శ్రీశైలం, నంద్యాల నియోజకవర్గాల్లో జరగనుంది. అప్పుల బాధతో, రుణమాఫీ అమలుకాక ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించి ఈ సందర్భంగా ఆయన భరోసా ఇస్తారు. ఇందులో భాగంగా వైఎస్ జగన్ హైదరాబాద్ నుంచి నేరుగా లింగాలగట్టుకు చేరుకుని శ్రీశైలం డ్యాంను పరిశీలించనున్నారు. అనంతరం సున్నిపెంట మీదుగా శ్రీశైలం చేరుకుంటారు.