పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులను ముఖ్యమంత్రి కేసీఆర్ 30 నెలల్లో పూర్తి చేస్తే సగం గుండు కొట్టించుకుని తిరుగుతానని మాజీమంత్రి, బచావో తెలంగాణ మిషన్ వ్యవస్థాపకుడు నాగం జనార్ధన్ రెడ్డి సవాల్ విసిరారు.
హైదరాబాద్ : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులను ముఖ్యమంత్రి కేసీఆర్ 30 నెలల్లో పూర్తి చేస్తే సగం గుండు కొట్టించుకుని తిరుగుతానని మాజీమంత్రి, బచావో తెలంగాణ మిషన్ వ్యవస్థాపకుడు నాగం జనార్దన్ రెడ్డి సవాల్ విసిరారు. హైదరాబాద్‌లోని కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రాజెక్టులపై కేసీఆర్ అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా చెప్పిన మాటను నిలుపుకోవాలని కోరారు. స్వార్థం కోసం చేస్తున్న తప్పులతో కేసీఆర్ జైలుకు వెళ్లకతప్పదని అన్నారు. కేసీఆర్ మోసాలు, అవినీతిపై ప్రజల్లోకి వెళ్లి పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తానని ఆయన ప్రకటించారు.
పాలమూరు- రంగారెడ్డి అంచనాలు ఆరునెలల్లోనే ఎందుకు రెట్టింపు అయ్యాయనే ప్రశ్నకు సమాధానం చెప్పి ప్రతిపక్షాలను, శాసనసభ్యులను, ప్రజలను మెప్పించాలని నాగం సవాల్ చేశారు. ప్రాజెక్టుల అంచనాలు, టెండర్లు వంటివాటిపై తాము అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారు. లేకపోతే సీఎం కేసీఆర్ చెంపలేసుకుని బహిరంగ క్షమాపణ చెప్తారా అని ప్రశ్నించారు. తెలంగాణను ఆయన లూఠీ చేస్తున్నాడని, ప్రశ్నించేవాళ్లు లేకుండా చేయాలని ప్రతిపక్షాల సభ్యులను టీఆర్‌ఎస్‌లో చేర్పించుకుంటున్నారని నాగం విమర్శించారు. గూగుల్ చీఫ్ ఇంజనీర్‌గా కేసీఆర్ వ్యవహరిస్తున్నాడని వ్యాఖ్యానించారు.