'కేసీఆర్.. నీ స్థానం కేరాఫ్ శశికళ'
'కేసీఆర్.. నీ స్థానం కేరాఫ్ శశికళ'
Published Fri, May 26 2017 2:20 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
హైదరాబాద్: పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పంప్ హౌస్‌లో రూ. 2400 కోట్లు కుంభకోణం జరిగింది.. రూ.50 కోట్ల మోటార్లు రూ.90 కోట్లకు అంచనాలు పెంచారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నాగం జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. ఆయన శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మొత్తం 35 పంపింగ్ స్టేషన్స్ ఉన్నాయంటూ కేసీఆర్‌కు ఆధారాలతో లేఖ రాసినట్టు చెప్పారు. కేసీఆర్ అవినీతిలో మొనగాడని.. మోదీతో పోల్చుకునే స్ధాయి కేసీఆర్ కు లేదన్నారు. రైతులకు బేడీలు.. ఉగ్రవాదులకేమో గులాబీ పూలు.. ఇదీ కేసీఆర్ విధానమంటూ విమర్శించారు.
రైతులకు కేంద్రం 700 కోట్లు ఇస్తే ఎక్కడ ఖర్చు చేశారని ప్రశ్నించారు. రాజకీయ లబ్ది కోసం నీచాతినీచంగా దిగజారారంటూ.. గతంలో ఈడీ, విజిలెన్స్, సీవీసీలకు కేసీఆర్‌పై ఫిర్యాదు చేసినట్టు గుర్తు చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో విచ్చలవిడి అవినీతి జరుగుతుంటే మోదీతో ఆయనకు పోలికనా అని ఎద్దేవా చేశారు. తెలంగాణ ద్రోహి అయిన కేసీఆర్.. అమిత్‌షాను అవమానిస్తారా అని నిలదీశారు. తాము చెప్పింది తప్పయిదే తమపై కేసు నమోదు చేసి జైలుకు పంపాలని.. లేదంటే కేసీఆర్ స్థానం కేరాఫ్ శశికళ అవుతుందని విమర్శించారు.
తెలంగాణకు రక్షణ కావాలంటే రజాకార్లను పెట్టుకుంటారా.. ఫెడరల్ స్పూర్తి ఉండకూడదా.. ముస్లింల పేరుతో, కులాల పేరుతో..పందులు.. కుక్కలు నక్కల పేరుతో ఎందుకు రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. అమిత్ షా నాయకత్వంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలంగాణలో బీజేపీదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు. తమ జోలికి వస్తే ఖబడ్దార్ అని.. ప్రగతి భవన్‌లో చర్చకు సిద్దమైతే కేసీఆర్ అవినీతిని నిరూపించడానికి బీజేపీ సిద్దమని నాగం తెలిపారు.
Advertisement
Advertisement