ఇది పర్సంటేజీల ప్రభుత్వం: నాగం
‘పాలమూరు’ టెండర్లలో అక్రమాలు జరిగాయని ఆరోపణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ శాఖలో అవినీతి కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని, ఇది పర్సంటేజీల ప్రభుత్వమని బీజేపీ నేత నాగం జనార్దనరెడ్డి ఆరోపించారు. కేసీఆర్‌కు సహనం నశించిందని, ప్రజాస్వామ్యంపై గౌరవం పోయిందని, అందుకే తెలంగాణ ఉద్యమాలకు వేదికైన ధర్నాచౌక్‌ను తరలిస్తామంటున్నారని ధ్వజమెత్తారు. ఆదివారం పార్టీ నేతలు కృష్ణసాగర్‌రావు, సుధాకర్‌శర్మలతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు.
పాలమూరుృరంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అర్హత లేని ఏజెన్సీకిచ్చిన టెండర్లను రద్దుచేసి, ఆ ఏజెన్సీని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ను నాగం కోరారు. తనవి అడ్డగోలు ఆరోపణలు కావని.. సాక్ష్యాలు, ఆధారాలు కూడా సీఎంకు ఈృమెయిల్ ద్వారా పంపుతున్నట్లు చెప్పారు. తాను పంపిన వాటిలో ఏ పత్రమైనా, డాక్యుమెంట్ అయినా సరైనది కాదని తేలితే చట్టరీత్యా చర్య తీసుకోవచ్చునని, నిజమైనవైతే ప్రభుత్వపరంగా శిక్షకు సిద్ధంగా ఉండాలన్నారు.