బనశంకరి: వెకిలిచేష్టలు చేయడం, వేధించడం, ఖరీదైన వస్తువులను లాక్కోవడం, అశ్లీలంగా ఫొటోలు తీయడం, దారి మళ్లించి భయభ్రాంతులకు గురిచేయడం.. ఇలా యాప్ ఆధారిత క్యాబ్ సర్వీసుల్లో ప్రయాణించే మహిళలపై కొందరు ఘరానా డ్రైవర్లు లైంగిక వేధింపులకు పాల్పడుతున్న నేపథ్యంలో బెంగళూరు పోలీసులు నివారణ చర్యలు చేపట్టారు. ప్రయాణికులు ఆపదలో చిక్కుకుంటే వారు వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్‌కు అత్యవసర మెసేజ్ అందించే వ్యవస్థను ఓలా యాప్‌లో అమర్చాలని ఆ సంస్థకు నగర పోలీస్ శాఖ ఆదేశించింది. ఇందుకు ఓలా కంపెనీ సమ్మతించింది. ఇటీవల ఒక మహిళను ఓలా క్యాబ్ డ్రైవర్ బెదిరించి అర్ధనగ్నంగా ఫొటోలు తీసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడం తెలిసిందే.
ఇక నేరుగా పోలీసులకు సందేశం
ఓలా యాప్ క్యాబ్ ప్రయాణికులకు ఇబ్బందులు ఏర్పడితే వారి బంధువులకు సమాచారం అందించడానికి అత్యవసర సంఖ్యకు గతంలోనే అవకాశం కల్పించింది. ఇందులో తమకు ముఖ్యమైన ఐదుగురి నంబర్లను నమోదు చేసుకోవచ్చు. అత్యవసర వేళల్లో వారికి సందేశం పంపడానికి వీలవుతుంది. కానీ దీని బదులుగా యాప్ ద్వారా మొదట పోలీసులకే సమాచారం అందించే వ్యవస్థను కల్పించాలని ఆదేశించారు. ఓలా కంపెనీ తమ క్యాబ్‌లు ఎక్కడెక్కడ సంచరిస్తున్నాయో తరచూ పరిశీలిస్తుండాలి. సంచరించే మార్గం మళ్లించడం, అర్ధంతరంగా ట్రిప్ ముగించడం తదితరాల్లో ఏమైందో విచారించాలి. దీంతోపాటు మీపై నిఘా పెట్టి ఉంచామని డ్రైవర్లకు స్పష్టం చేయాలని అదనపు పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్‌సింగ్ తెలిపారు. బెంగళూరు పోలీస్‌శాఖ ఇప్పటికే సురక్ష యాప్ విడుదల చేసింది. అత్యవసర సమయాల్లో ఎస్‌వోఎస్‌ను నొక్కితే పోలీస్‌కంట్రోల్ రూమ్‌కు సందేశం వెళ్తుంది. అక్కడ నుంచి సమీపంలో ఉన్న పోలీసులకు సమాచారం అందుతుంది. ఇదే తరహాలో ఓలా యాప్‌లో వ్యవస్థ ఉండాలని ఓలా ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో సలహా ఇచ్చామని సింగ్ తెలిపారు. ఈ భద్రతా చర్యలను నిర్ణీత కాలవ్యవధిలో అమలు చేయాలని, తమకు నివేదిక అందజేయాలని ఆదేశించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment