రెండు రకాల చార్జీలపై వివరణ ఇవ్వండి
ఓలా, ఉబర్‌కు సీసీపీఏ నోటీసులు
న్యూఢిల్లీ: నగరాలు, పట్టణాల్లో క్యాబ్‌ల కోసం ఓలా లేదా ఉబర్‌లో బుక్ చేసుకోవడం పరిపాటిగా మారింది. ఇందుకోసం స్మార్ట్‌ఫోన్‌లో సంబంధిత యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. క్యాబ్ బుకింగ్ కోసం ఉపయోగించిన ఫోన్ మోడల్‌ను బట్టి చార్జీలు మారుతుంటాయా? మారుతున్నాయనే చెబుతున్నారు. ఖరీదైన ఫోన్ నుంచి బుక్ చేస్తే ఎక్కువ చార్జీ, చౌకరకం ఫోన్ నుంచి బుక్ చేస్తే తక్కువ చార్జీ వసూలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
సంబంధిత యాప్‌ల్లో ఈ మేరకు మార్పులు చేర్పులు చేసినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఓలా, ఉబర్‌ల నిర్వాకంపై చాలామంది ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై కేంద్ర వినియోగదారుల పరిరక్షణ సంస్థ(సీసీపీఏ) స్పందించింది. ఓలా, ఉబర్‌లకు గురువారం నోటీసులు జారీ చేసింది. ఫోన్ మోడల్‌ను బట్టి క్యాబ్ చార్జీలు వసూలు చేస్తున్నట్లు వెల్లువెత్తుతున్న ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
ఐఫోన్ నుంచి బుక్ చేస్తే ఒకరకంగా, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ నుంచి బుక్ చేస్తే మరోరకంగా చార్జీలు విధిస్తుండడం నిజమేనా? అని ప్రశ్నించింది. ఒకే రకమైన సేవకు రెండు భిన్నమైన చార్జీలా? అని నిలదీసింది. చార్జీల విధిస్తున్న విధానం ఏమిటో చెప్పాలని పేర్కొంది. వినియోగదారుల నువంచి చార్జీల వసూలులో పూర్తి పారదర్శకత ఉండాలని సీసీపీఏ స్పష్టంచేసింది. ఒకేచోటు నుంచి ఒకే గమ్యస్థానానికి రెండు రకాల ఫోన్ల నుంచి రెండు క్యాబ్‌లు బుక్ చేస్తే రెండు రకాల చార్జీలు వసూలు చేసినట్లు ఢిల్లీకి ఓ వ్యాపారవేత్త బయటపెట్టడంతో ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ స్పందించారు. ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి యాప్‌లపై విచారణ జరపాలని సీసీపీఏను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment