ముంబైలోని యాపిల్ స్టోర్ ముందు 2024 సెప్టెంబర్ 20న ఐఫోన్ 16 సిరీస్ స్మార్ట్‌ఫోన్ కోసం బారులు తీరిన యాపిల్ ఫ్యాన్స్ చిత్రమిది..
భారత స్మార్ట్‌ఫోన్ల మార్కెట్లో అమ్మకాల విలువ పరంగా ఐఫోన్ అగ్రస్థానం
విక్రయాల సంఖ్యపరంగా తొలిసారి టాప్–5 జాబితాలో చోటు
దేశంలో పెరుగుతున్న యాపిల్ ఫ్యాన్స్
ధర ఎంతైనా కొనుగోళ్లకు వెనుకాడని వినియోగదారులు
మారుమూల పల్లెలకూ పాకిన క్రేజ్
పాత విషయాన్ని ఇప్పుడెందుకు చెబుతున్నారనేగా మీ ప్రశ్న? భారత్‌లో ఐఫోన్ ‘విలువ’మరింత పెరిగిందని చెప్పేందుకే పాత జ్ఞాపకాన్ని మీ ముందుంచాం. భారత స్మార్ట్‌ఫోన్ల మార్కెట్లో అమ్మకాల విలువ పరంగా ఐఫోన్ ఏకంగా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. అంతేకాదు.. విక్రయాల సంఖ్యపరంగా తొలిసారిగా టాప్–5 జాబితాలోకి దూసుకొచి్చంది. భారతీయుల్లో యాపిల్ ఉత్పత్తులకు ఉన్న క్రేజ్‌కు ఈ మైలురాళ్లు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా విక్రయాలే కాదు.. ఎగుమతుల పరంగానూ ఐఫోన్ మార్కెట్ కొత్తపుంతలు తొక్కుతోంది. టాప్ సెల్లింగ్ మోడల్‌గా నిలిచిన యూఎస్, అర్బన్ చైనా, యూకే, ఫ్రాన్స్, ఆ్రస్టేలియా, జపాన్ సరసన భారత్ చేరింది. యాపిల్‌కు 5వ అతిపెద్ద మార్కెట్‌గా నిలిచింది.
ఖరీదైనా తగ్గేదేలే..
సగటున ఐఫోన్ ధర సామ్‌సంగ్, వివోతో పోలిస్తే మూడింతలు ఉంటుంది. షావొమీతో పోలిస్తే ఆరు రెట్లు ఎక్కువ. అయినా మనవాళ్లు తగ్గేదేలే అంటున్నారు. కొత్త సిరీస్ ఎప్పుడొస్తుందా.. ఎప్పుడెప్పుడు చేతుల్లోకి తీసుకుందామా అని ఎదురు చూసే కస్టమర్ల సంఖ్య పెరుగుతోంది. ఐఫోన్ అంటే చాలా మందికి స్టేటస్. అందుకే ఖరీదుకు వెనుకాడడం లేదు. ఈఎంఐ సౌకర్యం ఉందన్న భరోసా ఎలాగూ ఉంది.
దేశంలో అమ్ముడవుతున్న ఐఫోన్లలో పెద్ద నగరాల వాటా 40 శాతమే. మిగిలిన 60 శాతం చిన్న నగరాలు, పట్టణాలు, గ్రామాలు కైవసం చేసుకున్నాయంటే ఐఫోన్‌కు ఉన్న క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా యాపిల్ అమ్మకాల ఆధారంగా సగటు విక్రయ ధర 2024లో రూ. 78,200 ఉంది. 2020లో ఇది రూ. 62,700 నమోదైంది. ఐదేళ్లుగా ఐఫోన్ల అమ్మకాల జోరు కొనసాగుతోంది.
ప్రస్తుత వేగాన్నిబట్టి చూస్తే 2026లో భారత్‌లో 1.5 కోట్లకుపైగా ఐఫోన్లు అమ్ముడవుతాయని వివిధ నివేదికలు అంచనా వేస్తున్నాయి. ఐడీసీ ప్రకారం దేశవ్యాప్తంగా 2023లో 90 లక్షల ఐఫోన్లు అమ్ముడయ్యాయి. 2024లో ఈ సంఖ్య 35 శాతం వృద్ధితో 1.2 కోట్లకు ఎగిసింది. నివేదికలనుబట్టి సంఖ్యలు మారినా.. ఐఫోన్లకు డిమాండ్ ఊహించనంతగా దూసుకెళుతోందన్నది వాస్తవం.
యాపిల్ పంట పండింది..
భారత్‌లో 2024లో అన్ని బ్రాండ్స్ కలిపి 15.3 కోట్ల స్మార్ట్‌ఫోన్లను విక్రయించాయి. 2023తో పోలిస్తే విక్రయాలు ఒక శాతం పెరిగాయి. 2024లో అమ్ముడైన మొత్తం స్మార్ట్‌ఫోన్ల విలువలో యాపిల్ 23 శాతం వాటా సొంతం చేసుకొని తొలి స్థానంలో నిలిచిందని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ నివేదిక తెలిపింది. సంఖ్యాపరంగా 2024 అక్టోబర్–డిసెంబర్‌లో యాపిల్ 5వ స్థానానికి ఎగిసింది.
వార్షిక ప్రాతిపదికన పరిమాణంలో కంపెనీ వాటా 9 నుంచి 11 శాతానికి చేరింది. అయితే 2024లో భారత్‌లో రూ. 90,680 కోట్ల విలువైన ఐఫోన్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయని ఐడీసీ అంచనా వేసింది. 2023లో ఇది రూ. 75,255 కోట్లని వెల్లడించింది. ప్రీమియం ఫోన్లవైపు ప్రజలు మళ్లుతుండటం కంపెనీకి కలిసొస్తోంది. దేశంలో రూ. 30,000పైగా ఖరీదు చేసే స్మార్ట్‌ఫోన్ల విభాగం రెండంకెల వృద్ధిని నమోదు చేస్తోంది.
రికార్డుల భారత్..
యాపిల్ ఎగుమతులు భారత్ నుంచి గతేడా ది రూ. లక్ష కోట్ల మార్కును దాటాయి. 2023తో పోలిస్తే ఎగుమతులు 42 శాతం పెరిగి 2024లో రూ. 1.08 లక్షల కోట్లకు చేరాయి. గత సంవత్సరంలో దేశంలో రూ. 1.48 లక్షల కోట్ల విలువైన యాపిల్ ఉత్పత్తులు తయారయ్యాయి. అంత క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 46 శాతం అధికం కావడం విశేషం. ఇక దేశం నుంచి వివిధ దేశాలకు 2023లో సరఫరా అయిన ఐఫోన్ల విలువ రూ. 76,500 కోట్లు.
గతేడాది ఇది రూ. 1,02,000 కోట్లు. మొత్తం ఐఫోన్ల ఉత్పత్తిలో భారత వాటా 14 శాతం దాటిందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. లేటెస్ట్ మోడళ్లు అయిన ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ సైతం భారత్‌లో తయారవడం విశేషం. హైదరాబాద్ సమీపంలోని ఫాక్స్‌కాన్ ప్లాంటులో కొద్ది రోజుల్లో ఎయిర్‌పాడ్స్ తయారీ ప్రారంభం కానుంది. 2023–24లో యాపిల్ నికరలాభం 23 శాతం దూసుకెళ్లి రూ. 2,745.7 కోట్లు, ఆదాయం 36 శాతం పెరిగి రూ. 67,121 కోట్లుగా నమోదైంది.
భారీ అవకాశాలు ఉన్నాయ్..
భారత్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న స్మార్ట్‌ఫోన్ మోడల్‌గా ఐఫోన్ అవతరించింది. రికార్డు స్థాయిలో వ్యాపారాన్ని నమోదు చేసిన భారత్‌పై కంపెనీ చాలా ఆసక్తిగా ఉంది. డిసెంబర్ త్రైమాసికంలో ఐఫోన్ అత్యధికంగా అమ్ముడై భారత్‌లో రికార్డు నెలకొల్పింది. ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్లకు భారత్ రెండవ అతిపెద్ద విపణి.
అలాగే పర్సనల్ కంప్యూటర్లు, టాబ్లెట్ పీసీలకు మూడవ అతిపెద్ద మార్కెట్. ఇక్కడ భారీ వ్యాపార అవకాశాలు ఉన్నాయి. మరిన్ని యాపిల్ స్టోర్లను ప్రారంభిస్తాం. అంతర్జాతీయంగా డిసెంబర్ త్రైమాసికంలో యాపిల్ మొత్తం ఆదాయం రికార్డు స్థాయిలో 4 శాతం పెరిగి 124.3 బిలియన్ డాలర్లుగా నమోదైంది.
– టిమ్ కుక్, సీఈవో, యాపిల్
Comments
Please login to add a commentAdd a comment