Consumer Protection Council
-
ఓలాపై ఫిర్యాదుల వెల్లువ.. తగ్గుతున్న ఈవీల విక్రయాలు..
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ టూవీలర్ల తయారీలో ఉన్న ఓలాపై దేశవ్యాప్తంగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. నాణ్యత, అమ్మకాల తర్వాత సేవకు సంబంధించి 10,000 కంటే ఎక్కువ ఫిర్యాదులు పరిష్కరించకపోవడంతో వినియోగదారుల హక్కుల నియంత్రణ సంస్థ సెంట్రల్ కంజ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) ఓలాకు నోటీసును జారీ చేసింది. నేషనల్ కంజ్యూమర్ హెల్ప్‌లైన్‌కు (ఎన్సీహెచ్) ఏడాది కాలంగా ఓలా ఎలక్ట్రిక్‌పై ఫిర్యాదులు అందుతున్నాయి. వీటిని పరిష్కరించాల్సిందిగా కంపెనీలో ఉన్నత స్థాయి అధికారులకు విన్నవించినా వారు పెద్దగా ఆసక్తి చూపలేదని సమాచారం. దీంతో సెంట్రల్ కంజ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ క్లాస్ యాక్షన్ కోసం ఈ ఫిర్యాదులను పరిశీలించడం ప్రారంభించింది.ఏడాదిలో ఎన్‌సీహెచ్‌కు 10,000 కంటే ఎక్కువ ఫిర్యాదులు అందాయని గుర్తించింది. చీఫ్ కమిషనర్ నిధి ఖరే, కమిషనర్ అనుపమ్ మిశ్రా నేతృత్వంలోని సీసీపీఏ వినియోగదారుల ఫిర్యాదులను పరిశీలించింది. వినియోగదారుల హక్కుల ఉల్లంఘన, సేవల్లో లోపాలు, తప్పుదారి పట్టించే దావాలు, అన్యాయమైన వాణిజ్య పద్ధతులు అవలంభించడంతో సీసీపీఏ అక్టోబర్ 7న ఓలాకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. ప్రతిస్పందించడానికి కంపెనీకి 15 రోజుల గడువు ఇచ్చింది. సీసీపీఏ నుండి షోకాజ్ నోటీసు అందుకున్నట్టు అక్టోబర్ 7న ఓలా ఎలక్ట్రిక్ స్టాక్ ఎక్స్చేంజీలకు తెలిపింది.ఇవీ ఫిర్యాదులు..ఉచిత సేవా వ్యవధి/వారంటీ సమయంలో చార్జీల వసూలు, సేవలు ఆలస్యం కావడంతోపాటు అసంతృప్తికరం, వారంటీ ఉన్నప్పటికీ సర్వీసు తిరస్కరణ లేదా ఆలస్యం, సరిపోని సేవలు, పునరావృతం అవుతున్న లోపాలు, అస్థిర పనితీరు, అధిక చార్జీలు, ఇన్వాయిస్లో తేడాలు ఉంటున్నాయని ఓలాపై ఫిర్యాదులు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. అలాగే రీఫండ్ చేయకపోవడం, డాక్యుమెంటేషన్‌ను అందించడంలో వైఫల్యం, వృత్తిపర ప్రవర్తన, పరష్కారం కానప్పటికీ ఫిర్యాదుల మూసివేత, బ్యాటరీ, వాహన విడి భాగాలతో బహుళ సమస్యలను వినియోగదార్లు ఎదుర్కొంటున్నారు.చదవండి: మిడ్‌క్యాప్ విభాగంలో మెరుగైన రాబడులు ఇలా!కాగా, నేషనల్ కంజ్యూమర్ హెల్ప్‌లైన్‌ను (ఎన్సీహెచ్) డిపార్ట్మెంట్ ఆఫ్ కంజ్యూమర్ అఫైర్స్ పునరుద్ధరించింది. వ్యాజ్యానికి ముందు దశలో ఫిర్యాదుల పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా వినియోగదారులకు ఒకే పాయింట్‌గా ఎన్సీహెచ్ ఉద్భవించింది. ఇది దేశంలోని వినియోగదారులందరికీ అందుబాటులో ఉంది. వినియోగదారులు 17 భాషలలో టోల్–ఫ్రీ నంబర్ 1800114000 లేదా 1915 ద్వారా తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చు. వాట్సాప్, ఎస్ఎంఎస్, మెయిల్, ఎన్సీహెచ్ యాప్, వెబ్ పోర్టల్, ఉమంగ్ యాప్‌ల ద్వారా బాధితులు తమ సౌలభ్యం ప్రకారం ఫిర్యాదు చేయవచ్చు.తగ్గుతున్న విక్రయాలు.. భారత ఎలక్ట్రిక్ టూ వీలర్ల రంగంలో తొలి స్థానంలో కొనసాగుతున్న ఓలా ఎలక్ట్రిక్ సెప్టెంబర్‌లో 23,965 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. యూనిట్ల పరంగా అమ్మకాలు 11 నెలల కనిష్టానికి చేరుకోవడం గమనార్హం. ఈ ఏడాది జూలైలో ఓలా మార్కెట్ వాటా 39 శాతం కాగా సెప్టెంబర్‌లో ఇది 27 శాతానికి పడిపోయింది. ఈ ఏడాది మార్చిలో ఏకంగా 52,136 యూనిట్లను కంపెనీ విక్రయించింది. చదవండి: బంగారం కొనడానికి గోల్డెన్ ఛాన్స్!.. ఎందుకంటే?ఈ–టూ వీలర్స్ విక్రయాల పరంగా భారత్‌లో టాప్–2లో ఉన్న టీవీఎస్ మోటార్ కో స్థానాన్ని బజాజ్ ఆటో కైవసం చేసుకోవడం విశేషం. గత నెలలో బజాజ్ ఆటో 166 శాతం అధికంగా 18,933 యూనిట్లు విక్రయించింది. జనవరి–సెప్టెంబర్ కాలంలో ఈ కంపెనీ అమ్మకాలు దాదాపు మూడింతలై 1,19,759 యూనిట్లను సాధించింది. 21.47 శాతం మార్కెట్ వాటాను పొందింది. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే కొద్ది నెలల్లోనే బజాజ్ చేతక్ తొలి స్థానానికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. -
క్వాలిటీ లేని వస్తువులెలా అమ్ముతారు? అమెజాన్, ఫ్లిప్‌కార్టులకు నోటీసులు
న్యూఢిల్లీ: ప్రమాణాలు లేని ప్రెజర్ కుక్కర్లను విక్రయిస్తున్న పలు విక్రయ సంస్థలపై కేంద్ర వినియోగ హక్కుల పరిరక్షణా సంస్థ (సీసీపీఏ) దృష్టి సారించింది. బీఐఎస్ నిబంధనలకు అనుగుణంగా లేని ప్రెషర్ కుక్కర్లను అందిస్తున్నందుకు విక్రేతలకు నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీ అయిన సంస్థల్లో ఈ–కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, పేటిఎమ్మాల్ కూడా ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్, షాప్‌క్లూస్, పేటీఎంమాల్ తదితర విక్రేతలకు ఈ నెల 18న నోటీసులు జారీ అయ్యాయని సోమవారం ఒక అధికారిక ప్రకటన తెలిపింది. ఫోకస్ చేశాం 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకల్లో సందర్భంగా నిర్వహిస్తున్న ’ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా నాణ్యత నియంత్రణ ఉత్తర్వులను ఉల్లంఘించే వారిపై దృష్టి సారించినట్లు సీసీపీఏ స్పష్టం చేసింది. నకిలీ వస్తువుల విక్రయాలను నిరోధించడానికి సీసీపీఏ దేశవ్యాప్తంగా ప్రచారాన్ని ప్రారంభించిందని కూడా ఈ ప్రకటన తెలిపింది. నకిలీ వస్తువుల తయారీ లేదా విక్రయాల ద్వారా నిబంధలనకు వ్యతిరేకంగా వాణిజ్య విధానాలను అనుసరిస్తూ, వినియోగదారుల హక్కుల ఉల్లంఘన జరిపే సంస్థలపై దర్యాప్తు చేయాలని సీసీపీఏ ఇప్పటికే దేశవ్యాప్తంగా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది. రోజువారీ వినియోగ ఉత్పత్తులపై దృష్టి ప్రత్యేకించి రోజువారీ వినియోగ ఉత్పత్తులు హెల్మెట్లు, ప్రెషర్ కుక్కర్లు వంట గ్యాస్ సిలిండర్ల వంటి వస్తువులపై సీసీపీఏ దృష్టి సారించినట్లు ప్రభుత్వ ప్రకటన వివరించింది. ‘బీఐఎస్ చట్టం, 2016లోని సెక్షన్ 16 (1) ప్రకారం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన డొమెస్టిక్ ప్రెజర్ కుక్కర్ (క్వాలిటీ కంట్రోల్) ఆర్డర్, 2020ని ఉల్లంఘించి ప్రెజర్ కుక్కర్లను విక్రయిస్తున్నట్లు గుర్తించిన ఇ–కామర్స్ సంస్థలపై సీసీపీఏ తనకుతానుగా సీసీపీఐ చర్యలకు ఉపక్రమించింది’’ అని అని ప్రకటన పేర్కొంది. నోటీసులు నవంబర్ 18న జారీ అయ్యాయని ప్రకటన పేర్కొంటూ, నోటీసులు జారీ చేసినప్పటి నుండి ఏడు రోజుల్లోగా ఇ–కామర్స్ సంస్థల నుండి ప్రతిస్పందనను అథారిటీ కోరిందని, లేని పక్షంలో వినియోగదారుల రక్షణ చట్టం, 2019లోని నిబంధనల ప్రకారం వారిపై అవసరమైన చర్య తీసుకోవచ్చని వివరించింది. ఈ విషయాన్ని వెంటనే గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవాలని బీఐఎస్ డీజీ (డైరెక్టర్ జనరల్)కి కూడా సీసీపీఏ లేఖ రాసిందని వెల్లడించింది. బీఐఎస్ ఉత్తర్వు ప్రకారం, దేశీయ ప్రెషర్ కుక్కర్లు భారతీయ ప్రామాణిక ఐఎస్ 2347: 2017కి అనుగుణంగా ఉండాలి. అలాగే 2020 ఆగస్ట్ 1 నుండి అమలులోకి వచ్చిన బీఐఎస్ లైసెన్స్ కింద ప్రామాణిక గుర్తును కలిగి ఉండాలి. వినియోగదారుల రక్షణ (ఈ–కామర్స్) నిబంధనలు, 2020లోని రూల్ 4(2) ఏ ప్రకారం ఈ–కామర్స్ సంస్థలు తమ ప్లాట్‌ఫారమ్‌లో వ్యాపారానికి సంబంధించి వినియోగదారుకు వ్యతిరేకంగా ఎటువంటి అన్యాయమైన వాణిజ్య విధానాన్ని అవలంభించకూడదు. 13 ఉత్పత్తుల జాబితా ఉన్నత స్థాయి వర్గాల కథనం ప్రకారం వినియోగదారుల వ్యవహారాల విభాగం ఈ–కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో విక్రయానికి అందుబాటులో ఉన్న 13 ఉత్పత్తుల జాబితాపై దృష్టి సారించినట్లు సమాచారం. ► వీటిలో రెండు– ‘అమెజాన్ బేసిక్స్ స్టెయిన్లెస్ స్టీల్ ఔటర్ లిడ్ ప్రెజర్ కుక్కర్– నాలుగు లీటర్లు (విజిల్ ద్వారా ప్రెజర్ అలర్ట్ ఇవ్వదు), క్యూబా 5 లీటర్ ఇండక్షన్ బేస్ అల్యూమినియం ప్రెషర్ కుక్కర్– ఇన్నర్ లిడ్’ వీటిలో ఉన్నాయి. ► ఫ్లిఫ్‌కార్ట్. కామ్ విషయంలో మూడు ప్రాడక్టులపై పరిశీలన ఉంది. వీటిలో క్యూబా అల్యూమినియం రెగ్యులర్ ఐదు లీటర్ల ఇండక్షన్ బాటమ్ ప్రెజర్ కుక్కర్ (అల్యూమినియం), ప్రిస్టైన్ స్టెయిన్లెస్ స్టీల్ ఐదు లీటర్ల ఇండక్షన్ బాటమ్ ప్రెజర్ కుక్కర్ (స్టెయిన్లెస్ స్టీల్), డైమండ్ బై ఫాస్ట్కలర్స్ ఔటర్ లిడ్ 10 మినీ ప్రీమియం 10మిని ) ఉన్నాయి. ► స్నాప్ డీల్‌కు సంబంధించి రెండు ఉత్పత్తుల్లో– ఇండక్షన్ బేస్ లేకుండా ఎబోడ్ 5 లీటర్ల అల్యూమినియం ఔటర్లిడ్ ప్రెజర్ కుక్కర్, బెస్టెక్ మిర్రర్ ఫినిష్ ఇండక్షన్ స్టవ్టాప్ అనుకూలమైన చెర్రీ ప్రెజర్ కుక్కర్ (ఐదు లీటర్లు) ఉన్నాయి. ► షాప్‌క్లూస్.కామ్లోలో మూడు ఉత్పత్తులు ఉన్నాయి –– క్యూబా అల్యూమినియం రెగ్యులర్ ఐదు లీటర్ల ప్రెజర్ కుక్కర్ (ఇండక్షన్ బాటమ్–అల్యూమినియం), ప్రిస్టైన్ ఇండక్షన్ బేస్ స్టెయిన్లెస్ స్టీల్ ప్రెజర్ కుక్కర్ (ఐదు లీటర్లు), ఎథికల్ టీఆర్ఐ–నేచర్ ప్రెజర్ కుక్కర్ (ఐదు లీటర్లు), ఇండక్షన్ బోటమ్ స్టైన్లెస్ స్టీల్ ట్రైప్లే ఎస్ఏఎస్ జాబితాలో నిలిచాయి. ► పేటీఎంమాల్ మూడు ఉత్పత్తుల విక్రయాన్ని అందిస్తోంది. ప్రిస్టైన్ 5.5 లీటర్ల ఔటర్ లిడ్ ప్రెజర్ కుక్కర్ ఇండక్షన్ బాటమ్ (సిల్వర్, స్టెయిన్లెస్ స్టీల్, సెట్ ఆఫ్ 1), క్యూబా 5 లీటర్ల ఇన్నర్ మూత ప్రెజర్ కుక్కర్ ఇండక్షన్ బాటమ్ (సిల్వర్, అల్యూమినియం, సెట్ ఆఫ్ 1), ఎథికల్ కుక్వేర్ కాంబోస్ ఇండక్షన్ బాటమ్ (స్టెయిన్లెస్ స్టీల్, సెట్ ఆఫ్ 1) వీటిలో ఉన్నాయి. చదవండి: ఈ–కామర్స్ కంపెనీలకు షాక్! రూ.42 లక్షల జరిమానా -
ఇక వినియోగదారుడికి రక్షణ
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలో వినియోగదారుల రక్షణ మండలి (డిస్ట్రిక్ట్ కన్స్యూమర్స ప్రొటెక్షన్ సెల్) ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ప్రభు త్వ శాఖల నుంచి ప్రజలకు సత్వర న్యాయం జరిగే విధంగా ఈ మండలి పని చేసేలా మార్గదర్శకాలను రూపొందించింది. కలెక్టర్ చైర్మన్‌గా ఉండే మండలికి జాయింట్ కలెక్టర్ వైస్ చైర్మన్‌గా, 12 మంది జిల్లా అధికారులు, ఒక రైతు ప్రతినిధి సభ్యులుగా ఉంటారు. వినియోగదారుల రక్షణ చట్టం 1986 ప్రకారం మండలి పని చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి సి. పార్థసారథి బుధవారం జీఓఎంఎస్ నంబర్ 6 జారీ చేశారు. కమిటీ ఏర్పడినప్పటి నుంచి మూడేళ్లపాటు కొనసాగుతుందని పేర్కొన్నారు. 14 అంశాలకు ప్రాధాన్యం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు వివిధ శాఖల ద్వారా ప్రజలకు అందేలా జిల్లా వినియోగదారుల రక్షణ మండలి కృషి చేస్తుంది. ఈ మేరకు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులలో 14 అంశాలకు ప్రాధాన్యం ఇచ్చింది. వినియోగదారుల రక్షణ చట్టం 1986 సెక్షన్ 6(ఎఫ్) ప్రకారం మార్కెట్‌కు వ్యతిరేకంగా ప్రజల జీవితానికి ప్రమాదం కలిగించే వస్తువుల విక్రయంపై మండలి సీరియస్‌గా వ్యవహరిస్తుంది. వస్తువుల నాణ్యత, పరిమాణం, స్వచ్ఛత, ప్రామాణికం, ధరల వ్యత్యాసాలను పర్యవేక్షిస్తుంది. ఆహారధాన్యాలు, వంట నూనెల కల్తీపై నియంత్రణ ఉంటుంది. బిల్లుల సెటిల్మెంట్, ఫోన్ల బదిలీ, టెలికాం సేవలపై సమస్యలు తెలత్తకుండా చూ స్తుంది. సేవా రంగాలపైనా నిఘా ఉంచుతుంది. ప్రజా రవాణా వ్యవస్థపైనా కమిటీ ప్రత్యేక దృష్టి సారిస్తుంది. మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో రోడ్లు, పారిశుధ్య నిర్వహణ, సురక్షిత తాగునీటి సరఫరాను పరిశీలిస్తుంది. విద్యుత్ సరఫరా సంస్థలు సకాలంలో మీటర్ రీడింగ్ నమోదు చేసి, బిల్లులు అందజేయడం, విద్యుత్ సమస్యలపై సత్వరమే స్పందించే విధంగా చూస్తుంది. వీటితో పాటు వినియోగదారులతో ముడిపడి ఉండే అనేక అంశాలను మండలి సభ్యులు పరిగణనలోకి తీసుకుంటారు. అవసరాన్ని బట్టి సమావేశాలు నిర్వహించి వినియోగదారుల రక్షణకు కృషి చేస్తారు. మండలి సభ్యులు వీరే ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జిల్లా వినియోగదారుల రక్షణ మండలికి కలెక్టర్ రొనాల్డ్‌రాస్ చైర్మన్‌గా ఉంటారు. వైస్ చైర్మన్‌గా జాయింట్ కలెక్టర్, మెంబర్ కన్వీనర్‌గా డీఎస్ఓ కొండల్రావు వ్యవహరిస్తారు. ప్రాంతీయ రవాణా అధికారి రాజారత్నం నాయుడు, జిల్లా వైద్యాధికారి గోవింద్ వాగ్మారే, ట్రాన్స్‌కో ఎస్ఈ ప్రభాకర్, వ్యవసాయ శాఖ జేడీ నర్సింహా, ఆర్టీసీ ఆర్ఎం కృష్ణకాంత్, వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్, తూనికలు-కొలతల శాఖ అధికారి, కార్పొరేషన్ కమిషనర్, ఫుడ్ ఇన్స్పెక్టర్ (ప్రివెంటివ్ మెడిసిన్) సభ్యులుగా ఉంటారు. రైతు సహకార సంఘానికి చెందిన ఒకరిని కలెక్టర్ సభ్యునిగా నామినేట్ చేస్తారు. వీరు వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించి, వాటి సత్వర పరిష్కారానికి కృషి చేస్తారు. అందుకోసమే వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులను సభ్యులుగా చేర్చామని ప్రభుత్వ ఉత్తర్వులలో పేర్కొన్నారు.