న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ టూవీలర్ల తయారీలో ఉన్న ఓలాపై దేశవ్యాప్తంగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. నాణ్యత, అమ్మకాల తర్వాత సేవకు సంబంధించి 10,000 కంటే ఎక్కువ ఫిర్యాదులు పరిష్కరించకపోవడంతో వినియోగదారుల హక్కుల నియంత్రణ సంస్థ సెంట్రల్ కంజ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) ఓలాకు నోటీసును జారీ చేసింది. నేషనల్ కంజ్యూమర్ హెల్ప్‌లైన్‌కు (ఎన్‌సీహెచ్) ఏడాది కాలంగా ఓలా ఎలక్ట్రిక్‌పై ఫిర్యాదులు అందుతున్నాయి. వీటిని పరిష్కరించాల్సిందిగా కంపెనీలో ఉన్నత స్థాయి అధికారులకు విన్నవించినా వారు పెద్దగా ఆసక్తి చూపలేదని సమాచారం. దీంతో సెంట్రల్ కంజ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ క్లాస్ యాక్షన్ కోసం ఈ ఫిర్యాదులను పరిశీలించడం ప్రారంభించింది.
ఏడాదిలో ఎన్‌సీహెచ్‌కు 10,000 కంటే ఎక్కువ ఫిర్యాదులు అందాయని గుర్తించింది. చీఫ్ కమిషనర్ నిధి ఖరే, కమిషనర్ అనుపమ్ మిశ్రా నేతృత్వంలోని సీసీపీఏ వినియోగదారుల ఫిర్యాదులను పరిశీలించింది. వినియోగదారుల హక్కుల ఉల్లంఘన, సేవల్లో లోపాలు, తప్పుదారి పట్టించే దావాలు, అన్యాయమైన వాణిజ్య పద్ధతులు అవలంభించడంతో సీసీపీఏ అక్టోబర్ 7న ఓలాకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. ప్రతిస్పందించడానికి కంపెనీకి 15 రోజుల గడువు ఇచ్చింది. సీసీపీఏ నుండి షోకాజ్ నోటీసు అందుకున్నట్టు అక్టోబర్ 7న ఓలా ఎలక్ట్రిక్ స్టాక్ ఎక్స్చేంజీలకు తెలిపింది.
ఇవీ ఫిర్యాదులు..
ఉచిత సేవా వ్యవధి/వారంటీ సమయంలో చార్జీల వసూలు, సేవలు ఆలస్యం కావడంతోపాటు అసంతృప్తికరం, వారంటీ ఉన్నప్పటికీ సర్వీసు తిరస్కరణ లేదా ఆలస్యం, సరిపోని సేవలు, పునరావృతం అవుతున్న లోపాలు, అస్థిర పనితీరు, అధిక చార్జీలు, ఇన్వాయిస్‌లో తేడాలు ఉంటున్నాయని ఓలాపై ఫిర్యాదులు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. అలాగే రీఫండ్ చేయకపోవడం, డాక్యుమెంటేషన్‌ను అందించడంలో వైఫల్యం, వృత్తిపర ప్రవర్తన, పరష్కారం కానప్పటికీ ఫిర్యాదుల మూసివేత, బ్యాటరీ, వాహన విడి భాగాలతో బహుళ సమస్యలను వినియోగదార్లు ఎదుర్కొంటున్నారు.
చదవండి: మిడ్‌క్యాప్ విభాగంలో మెరుగైన రాబడులు ఇలా!
కాగా, నేషనల్ కంజ్యూమర్ హెల్ప్‌లైన్‌ను (ఎన్‌సీహెచ్) డిపార్ట్‌మెంట్ ఆఫ్ కంజ్యూమర్ అఫైర్స్ పునరుద్ధరించింది. వ్యాజ్యానికి ముందు దశలో ఫిర్యాదుల పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా వినియోగదారులకు ఒకే పాయింట్‌గా ఎన్‌సీహెచ్ ఉద్భవించింది. ఇది దేశంలోని వినియోగదారులందరికీ అందుబాటులో ఉంది. వినియోగదారులు 17 భాషలలో టోల్–ఫ్రీ నంబర్ 1800114000 లేదా 1915 ద్వారా తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చు. వాట్సాప్, ఎస్‌ఎంఎస్, మెయిల్, ఎన్‌సీహెచ్ యాప్, వెబ్ పోర్టల్, ఉమంగ్ యాప్‌ల ద్వారా బాధితులు తమ సౌలభ్యం ప్రకారం ఫిర్యాదు చేయవచ్చు.
తగ్గుతున్న విక్రయాలు..
భారత ఎలక్ట్రిక్ టూ వీలర్ల రంగంలో తొలి స్థానంలో కొనసాగుతున్న ఓలా ఎలక్ట్రిక్ సెప్టెంబర్‌లో 23,965 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. యూనిట్ల పరంగా అమ్మకాలు 11 నెలల కనిష్టానికి చేరుకోవడం గమనార్హం. ఈ ఏడాది జూలైలో ఓలా మార్కెట్ వాటా 39 శాతం కాగా సెప్టెంబర్‌లో ఇది 27 శాతానికి పడిపోయింది. ఈ ఏడాది మార్చిలో ఏకంగా 52,136 యూనిట్లను కంపెనీ విక్రయించింది.
చదవండి: బంగారం కొనడానికి గోల్డెన్ ఛాన్స్!.. ఎందుకంటే?
ఈ–టూ వీలర్స్ విక్రయాల పరంగా భారత్‌లో టాప్–2లో ఉన్న టీవీఎస్ మోటార్ కో స్థానాన్ని బజాజ్ ఆటో కైవసం చేసుకోవడం విశేషం. గత నెలలో బజాజ్ ఆటో 166 శాతం అధికంగా 18,933 యూనిట్లు విక్రయించింది. జనవరి–సెప్టెంబర్ కాలంలో ఈ కంపెనీ అమ్మకాలు దాదాపు మూడింతలై 1,19,759 యూనిట్లను సాధించింది. 21.47 శాతం మార్కెట్ వాటాను పొందింది. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే కొద్ది నెలల్లోనే బజాజ్ చేతక్ తొలి స్థానానికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment