న్యూఢిల్లీ: ప్రమాణాలు లేని ప్రెజర్ కుక్కర్‌లను విక్రయిస్తున్న పలు విక్రయ సంస్థలపై కేంద్ర వినియోగ హక్కుల పరిరక్షణా సంస్థ (సీసీపీఏ) దృష్టి సారించింది. బీఐఎస్ నిబంధనలకు అనుగుణంగా లేని ప్రెషర్ కుక్కర్‌లను అందిస్తున్నందుకు విక్రేతలకు నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీ అయిన సంస్థల్లో ఈ–కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, పేటిఎమ్‌మాల్ కూడా ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్, షాప్‌క్లూస్, పేటీఎంమాల్ తదితర విక్రేతలకు ఈ నెల 18న నోటీసులు జారీ అయ్యాయని సోమవారం ఒక అధికారిక ప్రకటన తెలిపింది.
ఫోకస్ చేశాం
75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకల్లో సందర్భంగా నిర్వహిస్తున్న ’ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా నాణ్యత నియంత్రణ ఉత్తర్వులను ఉల్లంఘించే వారిపై దృష్టి సారించినట్లు సీసీపీఏ స్పష్టం చేసింది. నకిలీ వస్తువుల విక్రయాలను నిరోధించడానికి సీసీపీఏ దేశవ్యాప్తంగా ప్రచారాన్ని ప్రారంభించిందని కూడా ఈ ప్రకటన తెలిపింది. నకిలీ వస్తువుల తయారీ లేదా విక్రయాల ద్వారా నిబంధలనకు వ్యతిరేకంగా వాణిజ్య విధానాలను అనుసరిస్తూ, వినియోగదారుల హక్కుల ఉల్లంఘన జరిపే సంస్థలపై దర్యాప్తు చేయాలని సీసీపీఏ ఇప్పటికే దేశవ్యాప్తంగా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది.
రోజువారీ వినియోగ ఉత్పత్తులపై దృష్టి
ప్రత్యేకించి రోజువారీ వినియోగ ఉత్పత్తులు హెల్మెట్‌లు, ప్రెషర్ కుక్కర్‌లు వంట గ్యాస్ సిలిండర్ల వంటి వస్తువులపై సీసీపీఏ దృష్టి సారించినట్లు ప్రభుత్వ ప్రకటన వివరించింది. ‘బీఐఎస్ చట్టం, 2016లోని సెక్షన్ 16 (1) ప్రకారం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన డొమెస్టిక్ ప్రెజర్ కుక్కర్ (క్వాలిటీ కంట్రోల్) ఆర్డర్, 2020ని ఉల్లంఘించి ప్రెజర్ కుక్కర్‌లను విక్రయిస్తున్నట్లు గుర్తించిన ఇ–కామర్స్ సంస్థలపై సీసీపీఏ తనకుతానుగా సీసీపీఐ చర్యలకు ఉపక్రమించింది’’ అని అని ప్రకటన పేర్కొంది. నోటీసులు నవంబర్ 18న జారీ అయ్యాయని ప్రకటన పేర్కొంటూ, నోటీసులు జారీ చేసినప్పటి నుండి ఏడు రోజుల్లోగా ఇ–కామర్స్ సంస్థల నుండి ప్రతిస్పందనను అథారిటీ కోరిందని, లేని పక్షంలో వినియోగదారుల రక్షణ చట్టం, 2019లోని నిబంధనల ప్రకారం వారిపై అవసరమైన చర్య తీసుకోవచ్చని వివరించింది. ఈ విషయాన్ని వెంటనే గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవాలని బీఐఎస్ డీజీ (డైరెక్టర్ జనరల్)కి కూడా సీసీపీఏ లేఖ రాసిందని వెల్లడించింది. బీఐఎస్ ఉత్తర్వు ప్రకారం, దేశీయ ప్రెషర్ కుక్కర్లు భారతీయ ప్రామాణిక ఐఎస్ 2347: 2017కి అనుగుణంగా ఉండాలి. అలాగే 2020 ఆగస్ట్ 1 నుండి అమలులోకి వచ్చిన బీఐఎస్ లైసెన్స్ కింద ప్రామాణిక గుర్తును కలిగి ఉండాలి. వినియోగదారుల రక్షణ (ఈ–కామర్స్) నిబంధనలు, 2020లోని రూల్ 4(2) ఏ ప్రకారం ఈ–కామర్స్ సంస్థలు తమ ప్లాట్‌ఫారమ్‌లో వ్యాపారానికి సంబంధించి వినియోగదారుకు వ్యతిరేకంగా ఎటువంటి అన్యాయమైన వాణిజ్య విధానాన్ని అవలంభించకూడదు.
13 ఉత్పత్తుల జాబితా
ఉన్నత స్థాయి వర్గాల కథనం ప్రకారం వినియోగదారుల వ్యవహారాల విభాగం ఈ–కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో విక్రయానికి అందుబాటులో ఉన్న 13 ఉత్పత్తుల జాబితాపై దృష్టి సారించినట్లు సమాచారం.
► వీటిలో రెండు– ‘అమెజాన్ బేసిక్స్ స్టెయిన్‌లెస్ స్టీల్ ఔటర్ లిడ్ ప్రెజర్ కుక్కర్– నాలుగు లీటర్లు (విజిల్ ద్వారా ప్రెజర్ అలర్ట్ ఇవ్వదు), క్యూబా 5 లీటర్ ఇండక్షన్ బేస్ అల్యూమినియం ప్రెషర్ కుక్కర్– ఇన్నర్ లిడ్’ వీటిలో ఉన్నాయి.
► ఫ్లిఫ్‌కార్ట్. కామ్ విషయంలో మూడు ప్రాడక్టులపై పరిశీలన ఉంది. వీటిలో క్యూబా అల్యూమినియం రెగ్యులర్ ఐదు లీటర్ల ఇండక్షన్ బాటమ్ ప్రెజర్ కుక్కర్ (అల్యూమినియం), ప్రిస్టైన్ స్టెయిన్‌లెస్ స్టీల్ ఐదు లీటర్ల ఇండక్షన్ బాటమ్ ప్రెజర్ కుక్కర్ (స్టెయిన్‌లెస్ స్టీల్), డైమండ్ బై ఫాస్ట్‌కలర్స్ ఔటర్ లిడ్ 10 మినీ ప్రీమియం 10మిని ) ఉన్నాయి.
► స్నాప్ డీల్‌కు సంబంధించి రెండు ఉత్పత్తుల్లో– ఇండక్షన్ బేస్ లేకుండా ఎబోడ్ 5 లీటర్ల అల్యూమినియం ఔటర్‌లిడ్ ప్రెజర్ కుక్కర్, బెస్టెక్ మిర్రర్ ఫినిష్ ఇండక్షన్ స్టవ్‌టాప్ అనుకూలమైన చెర్రీ ప్రెజర్ కుక్కర్ (ఐదు లీటర్లు) ఉన్నాయి.
► షాప్‌క్లూస్.కామ్‌లోలో మూడు ఉత్పత్తులు ఉన్నాయి –– క్యూబా అల్యూమినియం రెగ్యులర్ ఐదు లీటర్ల ప్రెజర్ కుక్కర్ (ఇండక్షన్ బాటమ్–అల్యూమినియం), ప్రిస్టైన్ ఇండక్షన్ బేస్ స్టెయిన్‌లెస్ స్టీల్ ప్రెజర్ కుక్కర్ (ఐదు లీటర్లు), ఎథికల్ టీఆర్‌ఐ–నేచర్ ప్రెజర్ కుక్కర్ (ఐదు లీటర్లు), ఇండక్షన్ బోటమ్ స్టైన్‌లెస్ స్టీల్ ట్రైప్లే ఎస్‌ఏఎస్ జాబితాలో నిలిచాయి.
► పేటీఎంమాల్ మూడు ఉత్పత్తుల విక్రయాన్ని అందిస్తోంది. ప్రిస్టైన్ 5.5 లీటర్ల ఔటర్ లిడ్ ప్రెజర్ కుక్కర్ ఇండక్షన్ బాటమ్ (సిల్వర్, స్టెయిన్‌లెస్ స్టీల్, సెట్ ఆఫ్ 1), క్యూబా 5 లీటర్ల ఇన్నర్ మూత ప్రెజర్ కుక్కర్ ఇండక్షన్ బాటమ్ (సిల్వర్, అల్యూమినియం, సెట్ ఆఫ్ 1), ఎథికల్ కుక్‌వేర్ కాంబోస్ ఇండక్షన్ బాటమ్ (స్టెయిన్‌లెస్ స్టీల్, సెట్ ఆఫ్ 1) వీటిలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment