న్యూఢిల్లీ: మామాఎర్త్ తదితర బ్రాండ్స్ పేరిట వ్యక్తిగత సౌందర్య సంరక్షణ సాధనాలు విక్రయించే ఈ–కామర్స్ సంస్థ హోనాసా కన్జూమర్ తాజాగా 1.2 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్‌తో 52 మిలియన్ డాలర్లు సమీకరించింది. తద్వారా ఈ ఏడాది యూనికార్న్ హోదా దక్కించుకున్న తొలి సంస్థగా నిల్చింది. సెకోయా, సోఫినా వెంచర్స్, ఎవాల్వెన్స్ క్యాపిటల్ తదితర సంస్థలు ఈ విడత ఇన్వెస్ట్ చేశాయి. సంస్థ ఇప్పటికే ఫైర్‌సైడ్ వెంచర్స్, స్టెలారిస్ వెంచర్ పార్ట్‌నర్స్ మొదలైన వాటి నుంచి పెట్టుబడులు సమకూర్చుకుంది. కొత్తగా సమీకరించిన నిధులను వ్యక్తిగత సంరక్షణ బ్రాండ్‌లు, నవకల్పనలు, పంపిణీ.. మార్కెటింగ్ వ్యవస్థలను మరింతగా విస్తరించేందుకు ఉపయోగించుకోనున్నట్లు హోనాసా సహ వ్యవస్థాపకుడు, సీఈవో వరుణ్ అలగ్ తెలిపారు.
మామాఎర్త్, ది డెర్మా కంపెనీతో పాటు కొత్తగా ఆక్వాలాజికా బ్రాండ్ పేరిట స్కిన్‌కేర్ విభాగంలోకి కూడా ప్రవేశించినట్లు ఆయన వివరించారు. మామాఎర్త్ బ్రాండ్ కింద శిరోజాలు, చర్మ సంరక్షణ, కాస్మెటిక్స్ మొదలైన ఉత్పత్తులను, ది డెర్మా కంపెనీ బ్రాండ్ కింద 40 పైగా ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు హోనాసా మరో సహ వ్యవస్థాపకుడు, సీఈవో గజల్ అలగ్ తెలిపారు. అయిదేళ్ల క్రితం ఏర్పాటైన హోనాసా దేశీయంగా 1,000 పైచిలుకు నగరాల్లో ఉత్పత్తులు అందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment