సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలో వినియోగదారుల రక్షణ మండలి (డిస్ట్రిక్ట్ కన్స్యూమర్‌స ప్రొటెక్షన్ సెల్) ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ప్రభు త్వ శాఖల నుంచి ప్రజలకు సత్వర న్యాయం జరిగే విధంగా ఈ మండలి పని చేసేలా మార్గదర్శకాలను రూపొందించింది. కలెక్టర్ చైర్మన్‌గా ఉండే మండలికి జాయింట్ కలెక్టర్ వైస్ చైర్మన్‌గా, 12 మంది జిల్లా అధికారులు, ఒక రైతు ప్రతినిధి సభ్యులుగా ఉంటారు.
వినియోగదారుల రక్షణ చట్టం 1986 ప్రకారం మండలి పని చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి సి. పార్థసారథి బుధవారం జీఓఎంఎస్ నంబర్ 6 జారీ చేశారు. కమిటీ ఏర్పడినప్పటి నుంచి మూడేళ్లపాటు కొనసాగుతుందని పేర్కొన్నారు.
14 అంశాలకు ప్రాధాన్యం
ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు వివిధ శాఖల ద్వారా ప్రజలకు అందేలా జిల్లా వినియోగదారుల రక్షణ మండలి కృషి చేస్తుంది. ఈ మేరకు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులలో 14 అంశాలకు ప్రాధాన్యం ఇచ్చింది. వినియోగదారుల రక్షణ చట్టం 1986 సెక్షన్ 6(ఎఫ్) ప్రకారం మార్కెట్‌కు వ్యతిరేకంగా ప్రజల జీవితానికి ప్రమాదం కలిగించే వస్తువుల విక్రయంపై మండలి సీరియస్‌గా వ్యవహరిస్తుంది.
వస్తువుల నాణ్యత, పరిమాణం, స్వచ్ఛత, ప్రామాణికం, ధరల వ్యత్యాసాలను పర్యవేక్షిస్తుంది. ఆహారధాన్యాలు, వంట నూనెల కల్తీపై నియంత్రణ ఉంటుంది. బిల్లుల సెటిల్మెంట్, ఫోన్ల బదిలీ, టెలికాం సేవలపై సమస్యలు తెలత్తకుండా చూ స్తుంది. సేవా రంగాలపైనా నిఘా ఉంచుతుంది. ప్రజా రవాణా వ్యవస్థపైనా కమిటీ ప్రత్యేక దృష్టి సారిస్తుంది. మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో రోడ్లు, పారిశుధ్య నిర్వహణ, సురక్షిత తాగునీటి సరఫరాను పరిశీలిస్తుంది.
విద్యుత్ సరఫరా సంస్థలు సకాలంలో మీటర్ రీడింగ్ నమోదు చేసి, బిల్లులు అందజేయడం, విద్యుత్ సమస్యలపై సత్వరమే స్పందించే విధంగా చూస్తుంది. వీటితో పాటు వినియోగదారులతో ముడిపడి ఉండే అనేక అంశాలను మండలి సభ్యులు పరిగణనలోకి తీసుకుంటారు. అవసరాన్ని బట్టి సమావేశాలు నిర్వహించి వినియోగదారుల రక్షణకు కృషి చేస్తారు.
మండలి సభ్యులు వీరే
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జిల్లా వినియోగదారుల రక్షణ మండలికి కలెక్టర్ రొనాల్డ్‌రాస్ చైర్మన్‌గా ఉంటారు. వైస్ చైర్మన్‌గా జాయింట్ కలెక్టర్, మెంబర్ కన్వీనర్‌గా డీఎస్‌ఓ కొండల్‌రావు వ్యవహరిస్తారు. ప్రాంతీయ రవాణా అధికారి రాజారత్నం నాయుడు, జిల్లా వైద్యాధికారి గోవింద్ వాగ్మారే, ట్రాన్స్‌కో ఎస్‌ఈ ప్రభాకర్, వ్యవసాయ శాఖ జేడీ నర్సింహా, ఆర్‌టీసీ ఆర్‌ఎం కృష్ణకాంత్, వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్, తూనికలు-కొలతల శాఖ అధికారి, కార్పొరేషన్ కమిషనర్, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ (ప్రివెంటివ్ మెడిసిన్) సభ్యులుగా ఉంటారు.
రైతు సహకార సంఘానికి చెందిన ఒకరిని కలెక్టర్ సభ్యునిగా నామినేట్ చేస్తారు. వీరు వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించి, వాటి సత్వర పరిష్కారానికి కృషి చేస్తారు. అందుకోసమే వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులను సభ్యులుగా చేర్చామని ప్రభుత్వ ఉత్తర్వులలో పేర్కొన్నారు.
ఇక వినియోగదారుడికి రక్షణ
Published Thu, Sep 4 2014 2:41 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement