రాష్ట్రవ్యాప్తంగా 12,966 జీపీలు, 1,14,620 వార్డుల్లో ఎన్నికలు
స్థానిక ఎన్నికలపై రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగబోయే గ్రామపంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు మారుతాయని రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాజకీయ పార్టీలకు స్పష్టం చేసింది. వాస్తవానికి రెండు టర్మ్‌ల వరకు రిజర్వేషన్లు మారకుండా గత ప్రభుత్వం చట్టం చేసిన విష యం తెలిసిందే. అయితే కొత్త ఓటర్ల జాబితాలకు అనుగుణంగా మళ్లీ రిజర్వేషన్లు మారుతాయని, సామాజికవర్గాల రిజర్వేషన్లు మాత్రం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. 50 శాతం మించరాదనే విషయంలో స్పష్టత ఉందని చెప్పింది. అయితే స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల ఖరారు అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది అని, ప్రభుత్వపరంగా ఇచ్చే రిజర్వేషన్లను తాము అమలు చేయాల్సి ఉంటుందని తెలిపింది.
క్షేత్రస్థాయిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా దామాషాకు అనుగుణంగా రిజర్వేషన్లు ఖరారు చేయాలన్న ట్రిపుల్ టెస్ట్ పేరిట సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వేషన్ల మార్పులు చోటు చేసుకుంటాయని చెప్పింది. శనివారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాల యంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధు లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి సమావేశ మయ్యారు. ఈ సందర్భంగా పార్థ సారథి మాట్లాడుతూ రాష్ట్రంలోని 12,966 గ్రామ పంచాయతీలు, వాటి పరిధిలోని 1,14,620 వార్డుల్లో ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితా ఆధారంగా ఎలాంటి మార్పులు లేకుండా గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాను వార్డుల వారీగా తయారు చేసి సెప్టెంబర్ 6న ముసాయిదా జాబితాను గ్రామపంచాయతీల్లో ప్రకటిస్తారని వెల్లడించారు. 7వ తేదీ నుంచి 13 వరకు ముసా యిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు స్వీకరించి, 19వతేదీ లోగా జిల్లా పంచాయతీ అధికారి పరిష్కరించి.. 21న గ్రామ పంచాయతీ తుది ఓటర్ల జాబితాను వార్డుల వారీగా ప్రకటిస్తారని తెలిపారు. ఓటర్ల జాబితా ప్రచురణకు ఇచ్చిన ప్రకటనలో పేర్కొన్న విధంగా 9న జిల్లా స్థాయిలో, 10న మండల స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు. ఓటరు ముసాయిదాలో లోపాలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తారని చెప్పారు.
కిలోమీటర్ పరిధిలోనే పోలింగ్ కేంద్రాలు ఉండాలి : పార్టీల ప్రతినిధులు
పోలింగ్‌స్టేషన్లు ఒక కిలోమీటర్ పరిధిలో ఉండేలా చూడాలని, ఓటర్ల జాబితాను గ్రామపంచాయతీలోని వార్డులుగా విభజించేటప్పుడు ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు ఒకే వార్డులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని రాజకీయ పార్టీల ప్రతినిధులు సూచించారు. అనుబంధ ఓటర్ల జాబితాలోని ఓటర్లను సంబంధిత వార్డుకు మాత్రమే అనుసంధానిస్తామని, కానీ చివరివార్డుకు కాదని కమిషనర్ తెలిపారు. గ్రామ, మండల స్థాయిలోని ప్రజాప్రతినిధులు ఓటర్లకు తగిన సూచనలు, సలహాలు చేసి వారితో అభ్యంతరాలు క్లెయిమ్ చేయించి.. వారిని ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా అవగాహన కల్పించాలని కోరారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్‌కుమార్ రాజకీయపార్టీ ప్రతినిధుల సందేహాలపై వివరణ ఇచ్చారు. ఈ సమావేశంలో గోపిశెట్టి నిరంజన్, పి.రాజేశ్‌కుమార్(కాంగ్రెస్), భరత్‌కుమార్ గుప్తా, పి.శశిధర్‌రెడ్డి, దుదిమెట్ల బాలరాజ్‌యాదవ్ (బీఆర్‌ఎస్) చింతల రామచంద్రారెడ్డి, రామారావు (బీజేపీ), పల్లా వెంకటరెడ్డి, ఎన్.బాలమల్లేష్ (సీపీఐ), ఎన్.నర్సింహారెడ్డి, నర్సింగరావు (సీపీఎం) బండ సురేందర్‌రెడ్డి (ఏఐఎఫ్‌బీ), ఇతర పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment