C. Parthasarathy
-
‘పంచాయతీ’ రిజర్వేషన్లు మారుతాయి
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగబోయే గ్రామపంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు మారుతాయని రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాజకీయ పార్టీలకు స్పష్టం చేసింది. వాస్తవానికి రెండు టర్మ్‌ల వరకు రిజర్వేషన్లు మారకుండా గత ప్రభుత్వం చట్టం చేసిన విష యం తెలిసిందే. అయితే కొత్త ఓటర్ల జాబితాలకు అనుగుణంగా మళ్లీ రిజర్వేషన్లు మారుతాయని, సామాజికవర్గాల రిజర్వేషన్లు మాత్రం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. 50 శాతం మించరాదనే విషయంలో స్పష్టత ఉందని చెప్పింది. అయితే స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల ఖరారు అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది అని, ప్రభుత్వపరంగా ఇచ్చే రిజర్వేషన్లను తాము అమలు చేయాల్సి ఉంటుందని తెలిపింది. క్షేత్రస్థాయిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా దామాషాకు అనుగుణంగా రిజర్వేషన్లు ఖరారు చేయాలన్న ట్రిపుల్ టెస్ట్ పేరిట సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వేషన్ల మార్పులు చోటు చేసుకుంటాయని చెప్పింది. శనివారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాల యంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధు లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి సమావేశ మయ్యారు. ఈ సందర్భంగా పార్థ సారథి మాట్లాడుతూ రాష్ట్రంలోని 12,966 గ్రామ పంచాయతీలు, వాటి పరిధిలోని 1,14,620 వార్డుల్లో ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితా ఆధారంగా ఎలాంటి మార్పులు లేకుండా గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాను వార్డుల వారీగా తయారు చేసి సెప్టెంబర్ 6న ముసాయిదా జాబితాను గ్రామపంచాయతీల్లో ప్రకటిస్తారని వెల్లడించారు. 7వ తేదీ నుంచి 13 వరకు ముసా యిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు స్వీకరించి, 19వతేదీ లోగా జిల్లా పంచాయతీ అధికారి పరిష్కరించి.. 21న గ్రామ పంచాయతీ తుది ఓటర్ల జాబితాను వార్డుల వారీగా ప్రకటిస్తారని తెలిపారు. ఓటర్ల జాబితా ప్రచురణకు ఇచ్చిన ప్రకటనలో పేర్కొన్న విధంగా 9న జిల్లా స్థాయిలో, 10న మండల స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు. ఓటరు ముసాయిదాలో లోపాలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తారని చెప్పారు.కిలోమీటర్ పరిధిలోనే పోలింగ్ కేంద్రాలు ఉండాలి : పార్టీల ప్రతినిధులు పోలింగ్స్టేషన్లు ఒక కిలోమీటర్ పరిధిలో ఉండేలా చూడాలని, ఓటర్ల జాబితాను గ్రామపంచాయతీలోని వార్డులుగా విభజించేటప్పుడు ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు ఒకే వార్డులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని రాజకీయ పార్టీల ప్రతినిధులు సూచించారు. అనుబంధ ఓటర్ల జాబితాలోని ఓటర్లను సంబంధిత వార్డుకు మాత్రమే అనుసంధానిస్తామని, కానీ చివరివార్డుకు కాదని కమిషనర్ తెలిపారు. గ్రామ, మండల స్థాయిలోని ప్రజాప్రతినిధులు ఓటర్లకు తగిన సూచనలు, సలహాలు చేసి వారితో అభ్యంతరాలు క్లెయిమ్ చేయించి.. వారిని ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా అవగాహన కల్పించాలని కోరారు.రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్‌కుమార్ రాజకీయపార్టీ ప్రతినిధుల సందేహాలపై వివరణ ఇచ్చారు. ఈ సమావేశంలో గోపిశెట్టి నిరంజన్, పి.రాజేశ్‌కుమార్(కాంగ్రెస్), భరత్‌కుమార్ గుప్తా, పి.శశిధర్‌రెడ్డి, దుదిమెట్ల బాలరాజ్యాదవ్ (బీఆర్ఎస్) చింతల రామచంద్రారెడ్డి, రామారావు (బీజేపీ), పల్లా వెంకటరెడ్డి, ఎన్.బాలమల్లేష్ (సీపీఐ), ఎన్.నర్సింహారెడ్డి, నర్సింగరావు (సీపీఎం) బండ సురేందర్‌రెడ్డి (ఏఐఎఫ్బీ), ఇతర పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
‘నంబర్ వన్’ టార్గెట్టే ముంచిందా!
సాక్షి, హైదరాబాద్: గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో కార్వీనే పైన ఉండాలి.. స్టాక్ బ్రోకింగ్‌లో తన సంస్థే వాటానే ఎక్కువగా ఉండాలి.. ఇలా నంబర్ వన్ స్థానం కోసం పోటీపడిన కార్వీ సంస్థల సీఎండీ సి.పార్థసారథి నిండా మునిగారు. బ్యాంకుల నుంచి రూ.వందల కోట్ల రుణాలు తీసుకుని మోసం చేసిన ఆరోపణలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సిటీ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ అధికారులు అనేక కీలక విషయాలు గుర్తించారు. కొసరు కోసం అసలు డబ్బు... స్టాక్ బ్రోకింగ్, డేటా మేనేజ్మెంట్ రంగాల్లో కార్వీకి ప్రత్యేక స్థానం ఉండేది. భారీ వ్యాపార సామ్రాజ్యం స్థాపించాలని, తనదో పెద్ద గ్రూప్ ఆఫ్ కంపెనీగా మారాలని భావించిన పార్థసారథి అనుబంధ సంస్థల్ని స్థాపించారు. దాదాపు 20కి పైగా కంపెనీలను ఏర్పాటు చేశారు. వీటికి మౌలిక వసతులు, ఇతరాల కోసం కార్వీ స్టాక్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (కేఎస్‌బీఎల్) నుంచి రూ.250 కోట్లు వెచ్చించారు. ఆ సంస్థలు ఆశించిన స్థాయిలో టర్నోవర్ సాధించలేకపోవడం, కార్వీ రియాల్టీ సంస్థ మహేశ్వరంలో నోవా ప్రాజెక్ట్స్ పేరుతో చేసిన 250 ఎకరాల వెంచర్‌లోనూ లాభాలు రాకపోవడంతో తీవ్రనష్టాల్లో మునిగిపోయారు. ఆయా సంస్థలకు అవసరమైన రుణాలు తీసుకోవడానికి కార్వీ ఆస్తులను గ్యారెంటీగా పెట్టారు. అతి పెద్ద బ్రోకింగ్ సంస్థగా మారాలని... గచ్చిబౌలి కేంద్రంగా పని చేసే కేఎస్‌బీఎల్.. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ), ది సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) వద్ద రిజిస్టరై ఉంది. ఏళ్లుగా అనేక మంది మదుపర్ల డీమ్యాట్ ఖాతాలను ఈ సంస్థ పర్యవేక్షించేది. జాతీయ స్థాయిలో బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో జరిగే ట్రేడింగ్‌లో కార్వీ వాటా 2శాతంగా ఉండేది. దీన్ని 7శాతానికి పెంచడం ద్వారా దేశంలోనే అతిపెద్ద బ్రోకింగ్ సంస్థగా అవతరించాలని పార్థసారథి భావించారు. దీనికోసం భారీ టర్నోవర్ సృష్టించడానికి ప్రయత్నించారు. తమ వద్ద ఉన్న డీమ్యాట్ ఖాతాల్లో మదుపరుల ప్రమేయం లేకుండా ట్రేడింగ్ చేయించారు. ఇలా కార్వీ ట్రేడింగ్ వాటా 6శాతానికి చేరాక ప్లాన్ బెడిసికొట్టింది. షేర్ మార్కెట్ కుప్పకూలడంతో రూ.400 కోట్లకు వరకు నష్టాలు వచ్చాయి. కోవిడ్ నేపథ్యంలో కంపెనీలు విక్రయించలేక.. ఈ నష్టాల నుంచి బయటపడటానికి మదుపరుల షేర్లను తాకట్టు పెట్టి రుణాలు పొందాలని భావించిన పార్థసారథి దానికోసం వారి అనుమతి లేకుండా వారి డీమ్యాట్ ఖాతాల్లోని షేర్లను తన సంస్థ ఖాతాల్లోకి మార్చుకున్నారు. ఆ షేర్లను తనఖా పెట్టి రూ.1,100 కోట్ల వరకు వివిధ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల నుంచి అప్పు తీసుకున్నారు. కాలక్రమంలో తన కంపెనీలకు విక్రయిం చి బ్యాంకులకు చెల్లించడం ద్వారా బయటపడాలని భావించారు. అయితే కోవిడ్‌తో మార్కెట్ కుప్పకూలడం పార్థసారథికి ప్రతికూలంగా మారింది. -
చెల్లించాల్సింది రూ.25–30 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్వీ స్టాక్ బ్రోకింగ్ (కేఎస్‌బీఎల్) తన కస్టమర్లకు చెల్లించాల్సిన బకాయిలు రూ.25–30 కోట్ల వరకూ ఉంటాయని కార్వీ గ్రూప్ చైర్మన్ సి.పార్థసారథి వెల్లడించారు. వీటిని రెండు వారాలు లేదా అంతకన్నా ముందే చెల్లించేస్తామని ఆయన స్పష్టం చేశారు. పెద్ద ఎత్తున నిధుల మళ్లింపు జరిగిందన్న వార్తల నేపథ్యంలో ఆయన ఈ వివరణ ఇచ్చారు. ఇవి దాదాపు 150–180 మంది క్లయింట్ల బకాయిలని తెలియజేశారు. కార్వీ స్టాక్ బ్రోకింగ్ నుంచి రియల్ ఎస్టేట్ విభాగానికి నిధులు మళ్లాయన్న ఎన్ఎస్ఈ ఆరోపణల నేపథ్యంలో.. గ్రూప్‌నకు హోల్డింగ్ కంపెనీ కేఎస్‌బీఎల్ కాబట్టే దాన్నుంచి నిధులు బదలాయించినట్లు చెప్పారు. పలు అనుబంధ కంపెనీల్లో కేఎస్‌బీఎల్ పెట్టుబడులున్నాయని గుర్తు చేశారు. కంపెనీ వాదన వినకుండానే సెబీ ఎక్స్‌పార్టీ ఉత్తర్వులు జారీ చేసిందని చెబుతూ... దీనిపై సెబీని సంప్రతిస్తామని తెలిపారు. కేఎస్‌బీఎల్, దాని అనుబంధ కంపెనీలన్నీ లాభాల్లోనే ఉన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. -
పీఎం–కిసాన్‌కు 34.51 లక్షల మంది రైతులు
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం–కిసాన్) పథకం లబ్ధిదారుల సంఖ్య పెరిగింది. ఎన్నికలకు ముందున్న మార్గదర్శకాల్లో మార్పు చేయడంతో అనేకమంది అర్హులయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 34.51 లక్షల మంది రైతులను ఈ పథకంలో లబ్ధిదారులుగా వ్యవసాయ శాఖ వర్గాలు గుర్తించాయి. ఆయా లబ్ధిదారుల వివరాలను పీఎం–కిసాన్ పోర్టల్‌లో మంగళవారం నమోదు చేసినట్లు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి తెలిపారు. తొలి విడతలో వీరికి పంపిణీ చేయాల్సిన సొమ్మును ఈ నెలాఖరులో బ్యాంకు ఖాతాల్లో కేంద్రం జమ చేయనుంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం ‘పీఎం–కిసాన్’పథకాన్ని ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఐదెకరాల్లోపు భూమి ఉన్న రైతులకు ఏడాదికి రూ.6 వేల ఆర్థిక సాయం అందిస్తామని, దానిని 3 విడతలుగా (విడతకు రూ.2 వేలు) పంపిణీ చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవానికి రాష్ట్రంలో 54.50 లక్షల మంది రైతులున్నారు. పీఎం–కిసాన్ పథకంలో గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో 27.42 లక్షల మంది రైతులనే అర్హులుగా గుర్తించి పోర్టల్‌లో అప్లోడ్ చేశారు. వారిలో మొదటి విడతలో 18.47 లక్షల మంది రైతులకు రూ.369.40 కోట్ల నగదు బదిలీ చేశారు. తొలి విడత పంపిణీ ఈ ఏడాది మార్చిలో జరిగింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉందన్న కారణంతో మే 23 తేదీ వరకు మిగిలిన రైతులకు నగదు బదిలీ చేయలేదు. ఆ తర్వాత రెండో విడతలో 18.58 లక్షల మంది రైతులకు రూ.370.16 కోట్లు పంపిణీ చేశారు. రాష్ట్రంలో 27.42 లక్షల మంది రైతులను పీఎం–కిసాన్ లబ్ధిదారులుగా గుర్తించినప్పటికీ 18 లక్షల మందికిపైగా రైతుల ఖాతాల్లోనే డబ్బులు జమ చేయగలిగారు. మిగిలిన లబ్ధిదారులను వివిధ రకాల సాంకేతిక కారణాలు చూపించి విస్మరించారు. పెరిగిన లబ్ధిదారులు.. ఈసారి పీఎం–కిసాన్ పథకంలో కొన్ని నియయ నిబంధనలను సడలించారు. కేవలం ఐదెకరాల్లోపు భూమి ఉన్న రైతులకు కాకుండా అంతకంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు కూడా రూ.6 వేల చొప్పున ఆర్థిక సాయం చేసేలా కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది . దీంతో లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గతంలో ఈ లబ్ధిదారుల సంఖ్య 27.42 లక్షలు ఉండగా.. ఇప్పుడు 34.51 లక్షలకు పెరిగింది. కొత్తగా 7.09 లక్షల మందిని ఈ పథకంలో లబ్ధిదారులుగా చేర్చారు. ఈ నెలాఖరులోగా మొదటి విడత డబ్బులు రైతుల ఖాతాలకు బదిలీ చేస్తారు. రెండో విడత సొమ్మును అక్టోబర్‌లో, మూడో విడత సొమ్మును తర్వాత మేలో పంపిణీ చేసే అవకాశాలున్నాయి. రాష్ట్రం నుంచి లబ్ధిదారులుగా ఎంపికైన రైతులకు నగదు బదిలీ చేయటానికి ఒక్క విడతకు రూ.690.20 కోట్లు కేంద్రం విడుదల చేయాల్సి ఉంటుంది. మూడు విడతల్లో కలిపి రూ.2,070.60 కోట్లు కేంద్రం నుంచి రాష్ట్రంలోని రైతాంగానికి అందుతాయి. రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా కేంద్రం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. -
సహకార బ్యాంకుల్లో 1,100 పోస్టులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్), జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)ల్లో ఖాళీగా ఉన్న 1100 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సహకార బ్యాంకుల్లో పరిస్థితిపై రాష్ట్రస్థాయిలో ఉన్నతస్థాయి కమిటీ సమావేశం బుధవారం జరిగింది. ఈ ఉన్నతస్థాయి కమిటీ చైర్మన్‌గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యవహరిస్తున్నారు. సమావేశంలో వ్యవసాయ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి సహా పలువురు నాబా ర్డు, సహకార బ్యాంకుల అధికారులు పాల్గొ న్నారు. ఈ సమావేశం వివరాలను పార్థసారథి ఒక ప్రకటనలో వెల్లడించారు. టెస్కాబ్, డీసీసీబీల్లో 600 క్లరికల్, ఆఫీసర్ స్థాయి పోస్టులను.. 500 డ్రైవర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. డ్రైవర్ పోస్టులకు రాత పరీక్ష నిర్వహిస్తారని, త్వరలో వాటికి సంబంధించి ఉత్తర్వులు వెలువడతాయన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామాబాద్ డీసీసీబీలు బలహీనంగా ఉన్నాయని తేల్చినట్లు చెప్పారు. వాటిల్లో ఐదు శాతంపైగా నిరర్ధక ఆస్తులున్నాయని, వాటిని బలోపేతం చేసేందుకు ప్రణాళిక రూపొందించనున్నామని అన్నారు. అలాగే హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, ఖమ్మం, వరంగల్ డీసీసీబీలకు పూర్తిస్థాయి సీఈవోలను నియమించాలని నిర్ణయం తీసుకున్నామని వివరించారు. -
ప్రకృతి సాగుతోనే ఆహార భద్రత
♦ వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసారథి ♦ జాతీయ శాశ్వత వ్యవసాయ సదస్సు ప్రారంభం సాక్షి, హైదరాబాద్: రోజురోజుకు తగ్గిపోతున్న భూసారం, నీటివనరుల నేపథ్యంలో రైతులు ప్రకృతి వ్యవసాయానికి మారాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసార థి సూచించారు. జీవవైవిధ్యం, సుస్థిర యాజమాన్యం, సామాజిక బాధ్యత వంటి మేలైన అంశాలతో కూడిన సతత హరిత విప్లవమే దేశ భవిష్యత్తు ఆహార భద్రతను కాపాడగలదని... అందుకు కార్యాచరణ రూపొందించాల్సిన అవసరముందన్నారు. హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శుక్రవారం ప్రారంభమైన మూడు రోజుల ‘జాతీయ శాశ్వత వ్యవసాయ సదస్సు’లో పార్థసారధి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మొదటి హరిత విప్లవ ఫలితాలు కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యానని...దానివల్ల భూములు నిస్సారమై రసాయన అవశేషాలు పెరిగి ప్రజల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తాయన్నారు. భూముల ఉత్పాదకత దెబ్బతిందన్నారు. ఫలితంగా వ్యవసాయం సంక్షోభంలోకి వెళ్లిపోయిందని...ఈ విషవలయం నుంచి గట్టెక్కించగలిగే తరుణోపాయమే పర్మాకల్చర్ అని ఆయన పేర్కొన్నారు. దేశంలో వర్షాధార, పర్వత ప్రాంతాల్లో ఇప్పటికే ప్రకృతి వ్యవసాయం సాగవుతోందన్నారు. సేంద్రియ వ్యవసాయ సాగును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయని... అవసరమైతే ఎక్కువ నిధులు కేటాయిస్తామని పార్థసారథి తెలిపారు. తెలంగాణలో 17 లక్షల హెక్టార్ల భూముల్లో సహజ వ్యవసాయానికి అవకాశముందన్నారు. అయితే పెరుగుతున్న జనాభా, ఆహార అవసరాల నేపథ్యంలో ఉత్పత్తి ధోరణులపై కూలంకషంగా చర్చించాల్సిన అవసరముందని నిపుణులను కోరారు. విఫల ప్రయోగాల వల్లే సాగు సంక్షోభం: వందనా శివ బహుళజాతి కంపెనీలకు ప్రయోజనం కలిగించే విఫల ప్రయోగాల వల్లే దేశం వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని...ఈ కారణంగానే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పర్యావరణవేత్త వందనా శివ విమర్శించారు. సదస్సులో ఆమె మాట్లాడుతూ బీటీ పత్తి తర్వాత జన్యుమార్పిడి ఆవ విత్తనాలకు తలుపులు తెరవడం నుంచి హైటెక్ బీమా పథకం వరకు అన్నీ కంపెనీల ప్రయోజనాల పరిరక్షణకే జరుగుతున్నాయని దుయ్యబట్టారు. విత్తన స్వాతంత్య్రం, ఆహార సార్వభౌమాధికారాల పరిరక్షణకు ప్రజలంతా ఉద్యమించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. -
వ్యవసాయ శాఖలో ఇష్టారాజ్యం
♦ రూ. 3 కోట్లు తినేసి కూడా ఏడీఏగా చలామణి ♦ ఖమ్మంలోనూ రూ. కోటి పక్కదారి పట్టినట్లు నిర్ధారణ ♦ అధికారుల విచారణ పూర్తి సాక్షి, హైదరాబాద్: అతను వ్యవసాయశాఖలో ప్రస్తుతం అసిస్టెంట్ డెరైక్టర్ (ఏడీఏ) హోదాలో పనిచేస్తున్నాడు. కొన్నాళ్ల కిందట ఒక జిల్లాలో పనిచేస్తూ ప్రభుత్వ పథకాల నుంచి వచ్చిన నిధుల్లో రూ. 3 కోట్ల మేరకు కాజేశాడు. రోజుకు రూ. 10 లక్షల చొప్పున బ్యాంకు నుంచి సెల్ఫ్ చెక్కుల ద్వారా నొక్కేశాడు. అతనిపై రెండేళ్ల క్రితం క్రిమినల్ కేసు కూడా నమోదైంది. కానీ లాబీయింగ్ చేసుకుని దర్జాగా తిరిగి అదే హోదాలో పనిచేస్తున్నాడు. కాజేసిన రూ. 3 కోట్లతో రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఇతరత్రా పెట్టుబడులు పెట్టి రెండు మూడింతలుపైగా ఆర్జించాడు. అలాగే, ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో జరిగిన అక్రమాలపై ముగ్గురు సభ్యుల విచారణ బృందం రూ. కోటి వరకు అక్రమాలు జరిగినట్లు నిర్ధారించిందని తెలిసింది. రిటైరైన జిల్లా అధికారి ఒకరు అందుకు సూత్రధారిగా తేల్చారు. జిల్లాలో వ్యవసాయ యంత్రాల నిధులు దుర్వినియోగం అయినట్లు ఆరోపణలు రావడంతో వ్యవసాయ శాఖ అడిషనల్ డెరైక్టర్ విజయ్‌కుమార్, అసిస్టెంట్ డెరైక్టర్ శ్యాంసుందర్‌రెడ్డి, డిప్యూటీ డెరైక్టర్ బాలు చేస్తున్న విచారణ శనివారం పూర్తయింది. సోమవారం వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథికి నివేదిక సమర్పించనుంది. సాగు యంత్రాలకు సంబంధించి రైతుల తరఫున సబ్సిడీతో సహా కొనుగోలు చేసిన యంత్రాలకు ప్రభుత్వం కంపెనీలకు నిధులు ఇస్తుంది. కానీ కంపెనీలకు చెల్లించకుండానే ఖమ్మం జిల్లాలో సెల్ఫ్ చెక్కులు జారీచేసుకుని నిధులు కాజేసినట్లు తేలింది. ఆ ప్రకారం వ్యవసాయాంత్రీకరణ కింద 2014-15లో ప్రభుత్వం విడుదల చేసిన నిధులు గోల్మాల్ అయినట్లు నిర్ధారణ అయింది. గోల్‌మాల్‌లో రిటైర్డ్ అధికారి, ఆయనకు తోడ్పడిన అకౌంటెంట్లు, ఇతర కిందిస్థాయి అధికారులు బాధ్యులుగా నిర్ణయించినట్లు తెలిసింది. విచిత్రమేంటంటే కొల్లగొట్టిన సొమ్మును తిరిగి చెల్లించడానికి సిద్ధంగా ఉన్నానంటూ ఆ రిటైర్డ్ అధికారి చెబుతున్నారట. ఆయన కూడా కొల్లగొట్టిన సొమ్ముతో వ్యాపారం చేసి కాజేసిన సొమ్మును తిరిగి ఇస్తానని చెబుతుండటం అవినీతికి పరాకాష్ట. మరికొన్ని జిల్లాల్లోనూ ఇటువంటి అక్రమాలు జరిగి ఉంటాయని అధికారులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఆ జిల్లాలపైనా నిఘా పెట్టాలని వ్యవసాయ మంత్రి కార్యాలయం ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. -
ఖరీఫ్‌కు సన్నద్ధంకండి
జేడీఏలకు వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి ఆదేశం హైదరాబాద్: ఖరీఫ్ సీజన్‌కు సన్నద్ధం కావాలని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి అధికారులను ఆదేశించారు. వ్యవసాయశాఖ కమిషనరేట్‌లో బుధవారం ఆయన ఖరీఫ్ సన్నద్ధతపై జిల్లా సంయుక్త సంచాలకుల (జేడీఏ)తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ పంటలకు అవసరమైన విత్తనాలను రైతులకు సకాలంలో అందుబాటులో ఉంచడానికి తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఖరీఫ్‌లో 6 లక్షల క్వింటాళ్ల విత్తనాలను రాయితీపై సరఫరా చేస్తున్నామన్నారు. ఇందులో సోయాబీన్ 2 లక్షలు, పచ్చిరొట్ట విత్తనాలు 90 వేల క్వింటాళ్లమేర సరఫరా చేస్తామన్నారు. ఈ మేరకు సీడ్ కార్పొరేషన్, ఆయిల్ సీడ్ ఫెడరేషన్, హాకాలకు ఆదేశాలిచ్చామన్నా రు. ఈ నెల 15వ తేదీలోగా విత్తనాలను మండల కేంద్రాల్లో అందజేయాలన్నారు. రుణమాఫీ పరిశీలనకు గ్రామాల ఎంపిక... గత ఏడాది రుణమాఫీకి విడుదల చేసిన నిధులకు సంబంధించి ఇప్పటివరకు బ్యాంకుల నుంచి ధ్రువీకరణ పత్రాలు రాలేదని... వాటిని వ్యవసాయాధికారులు అందజేయాలని ఆర్థికశాఖ సంయుక్త కార్యదర్శి సాయిప్రసాద్ ఆదేశించారు. ఖర్చుపెట్టని నిధులను ప్రభుత్వానికి తిరిగి చెల్లించాలన్నారు. కొన్నిచోట్ల రుణమాఫీలో అవకతవకలు జరిగినట్లుగా ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో ప్రతీ జిల్లాలో 10 గ్రామాలను ఎంపిక చేసి పంట రుణమాఫీ పథకాన్ని పరిశీలించాలన్నారు. -
ఇక వినియోగదారుడికి రక్షణ
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలో వినియోగదారుల రక్షణ మండలి (డిస్ట్రిక్ట్ కన్స్యూమర్స ప్రొటెక్షన్ సెల్) ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ప్రభు త్వ శాఖల నుంచి ప్రజలకు సత్వర న్యాయం జరిగే విధంగా ఈ మండలి పని చేసేలా మార్గదర్శకాలను రూపొందించింది. కలెక్టర్ చైర్మన్‌గా ఉండే మండలికి జాయింట్ కలెక్టర్ వైస్ చైర్మన్‌గా, 12 మంది జిల్లా అధికారులు, ఒక రైతు ప్రతినిధి సభ్యులుగా ఉంటారు. వినియోగదారుల రక్షణ చట్టం 1986 ప్రకారం మండలి పని చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి సి. పార్థసారథి బుధవారం జీఓఎంఎస్ నంబర్ 6 జారీ చేశారు. కమిటీ ఏర్పడినప్పటి నుంచి మూడేళ్లపాటు కొనసాగుతుందని పేర్కొన్నారు. 14 అంశాలకు ప్రాధాన్యం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు వివిధ శాఖల ద్వారా ప్రజలకు అందేలా జిల్లా వినియోగదారుల రక్షణ మండలి కృషి చేస్తుంది. ఈ మేరకు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులలో 14 అంశాలకు ప్రాధాన్యం ఇచ్చింది. వినియోగదారుల రక్షణ చట్టం 1986 సెక్షన్ 6(ఎఫ్) ప్రకారం మార్కెట్‌కు వ్యతిరేకంగా ప్రజల జీవితానికి ప్రమాదం కలిగించే వస్తువుల విక్రయంపై మండలి సీరియస్‌గా వ్యవహరిస్తుంది. వస్తువుల నాణ్యత, పరిమాణం, స్వచ్ఛత, ప్రామాణికం, ధరల వ్యత్యాసాలను పర్యవేక్షిస్తుంది. ఆహారధాన్యాలు, వంట నూనెల కల్తీపై నియంత్రణ ఉంటుంది. బిల్లుల సెటిల్మెంట్, ఫోన్ల బదిలీ, టెలికాం సేవలపై సమస్యలు తెలత్తకుండా చూ స్తుంది. సేవా రంగాలపైనా నిఘా ఉంచుతుంది. ప్రజా రవాణా వ్యవస్థపైనా కమిటీ ప్రత్యేక దృష్టి సారిస్తుంది. మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో రోడ్లు, పారిశుధ్య నిర్వహణ, సురక్షిత తాగునీటి సరఫరాను పరిశీలిస్తుంది. విద్యుత్ సరఫరా సంస్థలు సకాలంలో మీటర్ రీడింగ్ నమోదు చేసి, బిల్లులు అందజేయడం, విద్యుత్ సమస్యలపై సత్వరమే స్పందించే విధంగా చూస్తుంది. వీటితో పాటు వినియోగదారులతో ముడిపడి ఉండే అనేక అంశాలను మండలి సభ్యులు పరిగణనలోకి తీసుకుంటారు. అవసరాన్ని బట్టి సమావేశాలు నిర్వహించి వినియోగదారుల రక్షణకు కృషి చేస్తారు. మండలి సభ్యులు వీరే ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జిల్లా వినియోగదారుల రక్షణ మండలికి కలెక్టర్ రొనాల్డ్‌రాస్ చైర్మన్‌గా ఉంటారు. వైస్ చైర్మన్‌గా జాయింట్ కలెక్టర్, మెంబర్ కన్వీనర్‌గా డీఎస్ఓ కొండల్రావు వ్యవహరిస్తారు. ప్రాంతీయ రవాణా అధికారి రాజారత్నం నాయుడు, జిల్లా వైద్యాధికారి గోవింద్ వాగ్మారే, ట్రాన్స్‌కో ఎస్ఈ ప్రభాకర్, వ్యవసాయ శాఖ జేడీ నర్సింహా, ఆర్టీసీ ఆర్ఎం కృష్ణకాంత్, వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్, తూనికలు-కొలతల శాఖ అధికారి, కార్పొరేషన్ కమిషనర్, ఫుడ్ ఇన్స్పెక్టర్ (ప్రివెంటివ్ మెడిసిన్) సభ్యులుగా ఉంటారు. రైతు సహకార సంఘానికి చెందిన ఒకరిని కలెక్టర్ సభ్యునిగా నామినేట్ చేస్తారు. వీరు వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించి, వాటి సత్వర పరిష్కారానికి కృషి చేస్తారు. అందుకోసమే వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులను సభ్యులుగా చేర్చామని ప్రభుత్వ ఉత్తర్వులలో పేర్కొన్నారు.