వ్యవసాయ శాఖలో ఇష్టారాజ్యం
♦ రూ. 3 కోట్లు తినేసి కూడా ఏడీఏగా చలామణి
♦ ఖమ్మంలోనూ రూ. కోటి పక్కదారి పట్టినట్లు నిర్ధారణ
♦ అధికారుల విచారణ పూర్తి
సాక్షి, హైదరాబాద్: అతను వ్యవసాయశాఖలో ప్రస్తుతం అసిస్టెంట్ డెరైక్టర్ (ఏడీఏ) హోదాలో పనిచేస్తున్నాడు. కొన్నాళ్ల కిందట ఒక జిల్లాలో పనిచేస్తూ ప్రభుత్వ పథకాల నుంచి వచ్చిన నిధుల్లో రూ. 3 కోట్ల మేరకు కాజేశాడు. రోజుకు రూ. 10 లక్షల చొప్పున బ్యాంకు నుంచి సెల్ఫ్ చెక్కుల ద్వారా నొక్కేశాడు. అతనిపై రెండేళ్ల క్రితం క్రిమినల్ కేసు కూడా నమోదైంది. కానీ లాబీయింగ్ చేసుకుని దర్జాగా తిరిగి అదే హోదాలో పనిచేస్తున్నాడు.
కాజేసిన రూ. 3 కోట్లతో రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఇతరత్రా పెట్టుబడులు పెట్టి రెండు మూడింతలుపైగా ఆర్జించాడు. అలాగే, ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో జరిగిన అక్రమాలపై ముగ్గురు సభ్యుల విచారణ బృందం రూ. కోటి వరకు అక్రమాలు జరిగినట్లు నిర్ధారించిందని తెలిసింది. రిటైరైన జిల్లా అధికారి ఒకరు అందుకు సూత్రధారిగా తేల్చారు. జిల్లాలో వ్యవసాయ యంత్రాల నిధులు దుర్వినియోగం అయినట్లు ఆరోపణలు రావడంతో వ్యవసాయ శాఖ అడిషనల్ డెరైక్టర్ విజయ్‌కుమార్, అసిస్టెంట్ డెరైక్టర్ శ్యాంసుందర్‌రెడ్డి, డిప్యూటీ డెరైక్టర్ బాలు చేస్తున్న విచారణ శనివారం పూర్తయింది. సోమవారం వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథికి నివేదిక సమర్పించనుంది.
సాగు యంత్రాలకు సంబంధించి రైతుల తరఫున సబ్సిడీతో సహా కొనుగోలు చేసిన యంత్రాలకు ప్రభుత్వం కంపెనీలకు నిధులు ఇస్తుంది. కానీ కంపెనీలకు చెల్లించకుండానే ఖమ్మం జిల్లాలో సెల్ఫ్ చెక్కులు జారీచేసుకుని నిధులు కాజేసినట్లు తేలింది. ఆ ప్రకారం వ్యవసాయాంత్రీకరణ కింద 2014-15లో ప్రభుత్వం విడుదల చేసిన నిధులు గోల్‌మాల్ అయినట్లు నిర్ధారణ అయింది. గోల్‌మాల్‌లో రిటైర్డ్ అధికారి, ఆయనకు తోడ్పడిన అకౌంటెంట్లు, ఇతర కిందిస్థాయి అధికారులు బాధ్యులుగా నిర్ణయించినట్లు తెలిసింది. విచిత్రమేంటంటే కొల్లగొట్టిన సొమ్మును తిరిగి చెల్లించడానికి సిద్ధంగా ఉన్నానంటూ ఆ రిటైర్డ్ అధికారి చెబుతున్నారట. ఆయన కూడా కొల్లగొట్టిన సొమ్ముతో వ్యాపారం చేసి కాజేసిన సొమ్మును తిరిగి ఇస్తానని చెబుతుండటం అవినీతికి పరాకాష్ట. మరికొన్ని జిల్లాల్లోనూ ఇటువంటి అక్రమాలు జరిగి ఉంటాయని అధికారులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఆ జిల్లాలపైనా నిఘా పెట్టాలని వ్యవసాయ మంత్రి కార్యాలయం ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది.