OLA cabs
-
ఓలా.. అలా కుదరదు.. రిఫండ్ ఇవ్వాల్సిందే!
న్యూఢిల్లీ: వినియోగదారులకు అనుకూల విధానాలను అమలు చేయాలంటూ ట్యాక్సీ సేవల సంస్థ ఓలాను కేంద్రీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ ప్రాధికార సంస్థ (సీసీపీఏ) ఆదేశించింది. కస్టమర్లకు రిఫండ్ ఆప్షన్లు, రైడ్లకు సంబంధించి రసీదులు కూడా ఇవ్వాలని సూచించింది.ప్రస్తుత విధానంలో బ్యాంకు ఖాతాలోకి రిఫండ్ పొందే అవకాశాన్ని కస్టమర్లకు ఇవ్వకుండా, భవిష్యత్ రైడ్లకు ఉపయోగించుకునేలా కూపన్ కోడ్లనే ఓలా జారీ చేస్తోందని సీసీపీఏ పేర్కొంది. ఫలితంగా కస్టమర్లు దాన్ని ఉపయోగించుకునేందుకు తప్పనిసరిగా మరోమారు ఓలానే ఎంచుకోవాల్సి వస్తోŠందని తెలిపింది. ఈ నేపథ్యంలోనే రిఫండ్ ఆప్షన్లు ఇవ్వాలని సీసీపీఏ సూచించింది. అలాగే, అన్ని రైడ్లకు సంబంధించి బిల్లులు, ఇన్వాయిస్లు జారీ చేయాల్సిందేనని స్పష్టం చేసింది.ఇదీ చదవండి: దూసుకెళ్లే టాప్10 ఎలక్ట్రిక్ బైక్లుఅలా చేయకపోతే అనుచిత వ్యాపార విధానాలు పాటిస్తున్నట్లుగా పరిగణించాల్సి వస్తుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఓలా తన వెబ్సైట్లో గ్రీవెన్స్, నోడల్ ఆఫీసర్ల కాంటాక్ట్ వివరాలను, క్యాన్సిలేషన్ నిబంధనలను, బుకింగ్.. క్యాన్సిలేషన్ ఫీజులు మొదలైన వాటిని పొందుపర్చింది. -
చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
ప్రముఖ క్యాబ్ సర్వీస్ సంస్థ ఓలా క్యాబ్స్‌లో కీలక పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. బాధ్యతలు చేపట్టిన మూడు నెలలకే ఆ సంస్థ సీఈఓ పదవికి హేమంత్ బక్షి రాజీనామా చేసినట్లు సమాచారం. దీంతో పాటు సంస్థ పునర్నిర్మాణంలో భాగంగా ఓలా క్యాబ్స్ దాదాపు 200 మంది ఉద్యోగుల్ని తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయిఐపీఓకి ఓలా ఓలా క్యాబ్స్ ఐపీఓ వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. ఇందుకోసం ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్‌తో ఓలా క్యాబ్స్ ఇటీవలే చర్చలు నిర్వహించింది. మరో రెండు మూడు నెలల్లో సెబీకి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఓలా ఎలక్ట్రిక్ ఇప్పటికే ఐపీఓ కోసం సెబీకి దరఖాస్తు చేసుకుంది.ఈ తరుణంలో సీఈఓ రాజీనామా, ఉద్యోగుల తొలగింపు అంశం ఓలా క్యాబ్స్ చర్చాంశనీయంగా మారింది. కాగా, ఓలా క్యాబ్స్ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. -
విదేశాల్లో ఓలా క్యాబ్స్ షట్‌డౌన్.. కారణం ఏంటంటే?
ప్రముఖ దేశీయ రైడ్ షేరింగ్ దిగ్గజం ఓలా క్యాబ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయంగా యూకే, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్‌లలో తన సేవల్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ చివరి నాటికి అంతర్జాతీయ ఓలా క్యాబ్స్ సేవలకు స్వస్తి పలకనుంది. ఓలా క్యాబ్స్ ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తన అంతర్జాతీయ యూజర్లకు నోటిఫికేషన్ పంపింది. సంస్థ 2018లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో తన సేవల్ని ప్రారంభించింది. అంతర్జాతీయ మార్కెట్‌కు ఓలా గుడ్‌బై కాగా, తమ దేశంలో ఓలా సేవలను మూసివేయడంపై ఆస్ట్రేలియన్ మీడియా గతంలోనే అనేక కథనాలు ప్రచురించింది. మీడియా సంస్థ ఆస్ట్రేలియన్ ఫైనాన్షియల్ రివ్యూ డ్రైవర్లకు ఓలా పంపిన ఇమెయిల్‌ను ఉదహరించింది. ఏప్రిల్ 12 నుండి అన్ని సంబంధిత లేబుల్‌లను తీసివేయమని, దాని పర్మిట్ల కింద బుకింగ్‌లు తీసుకోవడం ఆపివేయమని కోరింది. అదే తేదీ నుండి సంస్థ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు కస్టమర్లకు పంపిన ఇమెయిల్‌ను న్యూస్.కామ్.ఏయూ అనే మీడియా సంస్థ హైలెట్ చేసింది. కారణం ఇదేనా క్యాబ్ ఇంధన వాహనాల్ని ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చాలంటూ ఆయా దేశాల ప్రభుత్వాలు ఒత్తిడి చేస్తున్నాయి. క్యాబ్స్‌ను ఈవీలుగా మార్చాలంటే ఖర్చుతో కూడుకున్న పని. పెట్టుబడి కూడా భారీ మొత్తంలో పెట్టాలి. పైగా న్యూజిల్యాండ్, ఆస్ట్రేలియాల్లో విపరీతమైన పోటీ నెలకొంది. ఈ తరుణంలో ఓలా క్యాబ్స్ ఈ నిర్ణయం తీసుకుంది.భారత్‌లో విస్తరణకు మరింత అవకాశం ఉన్న నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్ నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నట్లు ఓలా ప్రతినిధులు చెబుతున్నారు. -
ఆ ఐడియా సూపర్ హిట్.. నేడు వేల కోట్లకు అధిపతిగా..
ప్రస్తుత రోజుల్లో ఓలా కంపెనీ పేరు తెలియని వారుండరు. నగర ప్రజలకు ఎనలేని సేవలు అందిస్తూ , మరో వైపు ఎందరో ట్యాక్సీ డ్రైవర్లకు ఉపాధి కల్పిస్తోంది ఓలా. ఎన్నో ఒడిదుడుకులు, జయఅపజయాలు ఎదుర్కొని ఒక చిన్న స్టార్టప్ కంపెనీగా మొదలై ప్రస్తుతం కొన్ని వేల కోట్ల కంపెనీగా రూపాంతరం చెందింది ఈ సంస్థ. ఓలా ఈ స్థాయికి చేరుకోవడానికి ఎన్నో కష్టనష్టాలు, వ్యయప్రయాసలు, అవమానాలు పడ్డా సంస్థ వ్యవస్థాపకుడు , సీఈఓ భవిష్ అగర్వాల్‌కు ఈ విజయం అంత సులువుగా రాలేదు. ఆయన సక్సెస్ స్టోరీపై ఏంటో తెలుసుకుందాం! ఐఐటీ బాంబేలో చదువు భవిష్ అగర్వాల్ పంజాబ్‌లోని లూథియానాలో పెరిగారు. ఆయన 2008లో ఐఐటీ బాంబే నుంచి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసారు. అగర్వాల్ 2008లో దేశీటెక్.ఇన్ (Desitech.in)పేరుతో బ్లాగర్‌గా తన స్వంత బ్లాగును ప్రారంభించారు.ఈ వెబ్సైట్ దేశంలోని సాంకేతిక రంగంలో సరికొత్త స్టార్టప్‌ల గురించి సమాచారాన్ని అందిస్తుంది. మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ ఇండియాలో రీసెర్చ్ ఇంటర్న్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన ఆగర్వాల్ రెండేళ్లపాటు అందులో పనిచేశాడు. ఆ ఘటనే మార్చింది.. ఒకసారి భవిష్ తన స్నేహితులతో కలిసి టూర్ ప్లాన్ చేసుకున్నాడు. అందుకోసం వారు అద్దెకు టాక్సీ బుక్ చేసుకున్నారు( బెంగళూరు నుంచి బందీపూర్‌కు వరకు) అయితే టాక్సీ డ్రైవర్ సడన్‌గా మైసూర్లో బండి ఆపేశాడు. తనకు ఈ ప్రయాణ ఖర్చులు సరిపోవని, ఇంకాస్త అదనంగా డబ్బులు ఇవ్వాలని వారిని డిమాండ్ చేశాడు. చివరికి వారు చెల్లించేందుకు అంగీకరించలేదు. దీంతో అక్కడే వారిని వదిలి టాక్సి డ్రైవర్ వెళ్లిపోయాడు. ఇదంతా అందులో ఉన్న భవిష్ అగర్వాల్‌ను ఆలోచనలో పడేసింది. ఇలాంటి పరిస్థితులు ప్రజలకు పలు సందర్భాల్లో ఎదురవుతుంటాయనే విషయాన్ని భవిష్ అర్థం చేసుకున్నాడు. ఈ సమస్యకు పరిష్కారంగానే నుంచే ఓలా ఆలోచన పుట్టుకొచ్చింది. ఉద్యోగం వదిలేసి.. భవిష్‌కు టెక్నాలజీపై ఆసక్తి ఉండటంతో.. అతని ఓ ఆలోచన వచ్చింది. అలా అతనికి అద్దె కార్ల ఐడియా ప్రస్తుతం ప్రముఖ సంస్థ ఓలా గా మారింది. మొదట్లో తన ఆలోచనకు కుటుంబ సభ్యుల మద్దతు లభించలేదు. ఓ సందర్భంలో 2010లో లక్షలు వస్తున్న మైక్రోసాఫ్ట్ ఉద్యోగాన్ని సైతం వదలాల్సిన పరిస్థితి ఏర్పడిన ధైర్యంగా రాజీనామా చేశాడు. తాను అనుకున్న గమ్యాన్ని చేరుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగాడు. చివరికి స్నేహితుడు అంకిత్ భాటియాతో కలిసి ఓలా కంపెనీని ప్రారంభించారు. ప్రస్తుతం ఓలా దాదాపుగా 15 లక్షల మందికి పైగా ట్యాక్సీ డ్రైవర్లకు ఉపాధి కల్పిస్తూ వేల కోట్ల విలువైన కంపెనీగా కార్యకలాపాలని నిర్వహిస్తోంది. చదవండి: Income Tax: కేంద్రం దీనికి ఓకే అంటే.. పన్ను చెల్లింపుదారులకు పండగే! -
నాసిరకం సర్వీస్, ఓవర్ ఛార్జింగ్: ఓలాకు కోర్టులో ఎదురుదెబ్బ
సాక్షి, హైదరాబాద్: క్యాబ్ సేవల సంస్థ ఓలాకు ఎదురు దెబ్బ తగిలింది. ఒక కస్టమర్ నుంచి ఎక్కువ చార్జీ వసూలు చేసినందుకు పరిహారం చెల్లించాలని వినియోగదారుల కోర్టు ఆదేశించింది. హైదరాబాద్‌కు చెందిన బాధితుడు జబేజ్ శామ్యూల్ ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన కోర్టు నాసిరకం సర్వీస్, ఓవర్ ఛార్జింగ్ కారణంగా మొత్తం రూ. 95,000 పరిహారం చెల్లించాలని స్పష్టం చేసింది. (లక్ అంటే టెకీలదే: అట్లుంటది ఐటీ కొలువంటే!) వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని ఓలా క్యాబ్స్ నుండి పరిహారం కోరుతూ ఫిర్యాదు దారు జబేజ్ శామ్యూల్ 2021, అక్టోబరు 19న నాలుగు గంటలకు ఓలా క్యాప్ బుక్ చేసుకున్నాడు. భార్య, మరొకరితో కలిసి క్యాబ్ ఎక్కినపుడు అంతా డర్టీగా కనిపించింది. ఏసీ ఆన్ చేయమన్నా, డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించారు. అంతేకాదు నాలుగైదు కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత శామ్యూల్‌ని మధ్యలోనే దింపేశాడు. దీనిపై ఓలాను సంప్రదించినప్పటికీ ఫలితం కనబడలేదు. పైగా రూ. 861 ఫీజు చెల్లించాల్సిందిగా పదేపదే కోరడంతో విసిగిపోయిన కస్టమరు దాన్ని చెల్లించారు. (భారీ నష్టాలు: సెన్సెక్స్ 650 పాయింట్లు పతనం) దీంతో హతాశుడైన శామ్యూల్ వినియోగదారుల చట్టం సెక్షన్ 35 కింద హైదరాబాద్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ - III ను ఆశ్రయించారు. దాదాపు రూ.5 లక్షల పరిహారం ఇప్పించాల్సిందిగా కోరారు. దీన్ని విచారించిన కోర్టు 5 లక్షల అంటే, చాలా పెద్ద మొత్తం అని అభిప్రాయపడినకోర్టు, ట్రిప్ చార్జీ, రూ. 861 వడ్డీతో (సంవత్సరానికి 12శాతం చొప్పున), అలాగే మానసిక వేదనకుగాను రూ. 88వేలు, ప్రొసీడింగ్స్ ఖర్చుల నిమిత్తం రూ. 7 వేలు కలిపి మొత్తం 95 వేల రూపాయలు చెల్లించాలని కమిషన్ ఓలా క్యాబ్‌ను ఆదేశించింది. -
ఓలా అరుదైన ఫీట్, ఇది దేశంలోనే కాదు ప్రపంచంలోనే రికార్డ్..!
దేశియ ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లో ఓలా ఎస్1,ఎస్1ప్రో మోడళ్లతో సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అతి తక్కువ కాలంలో 10లక్షల బుకింగ్స్ నమోదు చేసి ప్రత్యర్ధి ఎలక్ట్రిక్ ఆటోమొబైల్ సంస్థలకు సవాల్ విసిరింది. అయితే తాజాగా ఓలా అరుదైన ఫీట్‌ను సాధించింది. ఇప్పటివరకు 20,000 టెస్ట్ రైడ్లను పూర్తి చేసింది. ఓలా ఎలక్ట్రిక్ నవంబర్ 10న బెంగళూరు, ఢిల్లీ, అహ్మదాబాద్, కోల్‌కతాలో టెస్ట్ రైడ్లను ప్రారంభించింది. నవంబర్ 19న చెన్నై, హైదరాబాద్, కొచ్చి, ముంబై, పూణే వంటి ఐదు నగరాల్లో టెస్ట్ రైడ్ నిర్వహించింది. ఈ నేపథ్యంలో ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పుడే 20,000 టెస్ట్ రైడ్లను పూర్తి చేశాం. బహుశా ఈ రికార్డ్ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఒక అరుదైన రికార్డుగా నమోదవుతుంది' అని ట్వీట్లో పేర్కొన్నారు. We just completed 20,000 test rides! Amazing work by the team in the largest such initiative ever in India, maybe even the world. We will get to more than 10,000 test rides a day in Dec across 1000 cities! #JoinTheRevolution @OlaElectric pic.twitter.com/yeofFvFcvJ — Bhavish Aggarwal (@bhash) December 2, 2021 మరోవైపు ఎలక్ట్రిక్ స్కూటర్ ను అన్ని రకాల రోడ్లపై టెస్టులు నిర్వహించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా 1,000 నగరాల్లో రోజుకు 10,000 టెస్ట్ రైడ్లను నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భవిష్ అగర్వాల్ తెలిపారు. ఇక,దేశంలో ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు ఓలా ఎలక్ట్రిక్ తన ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ నెట్వర్క్ ను ఏర్పాటు చేయడంలో నిమగ్నమైంది. మొత్తం 400 నగరాల్లో 100,000 ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. చదవండి: ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులకు గుడ్ న్యూస్ చెప్పిన ఓలా..! -
ఓలాకు షాక్.. ఆరు నెలల నిషేధం
బెంగళూరు: ప్రముఖ క్యాబ్ సర్వీసెస్ సంస్థ 'ఓలా'కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. నిబంధనలను అతిక్రమించినందుకుగాను ఆ సంస్థ లైసెన్స్‌లను ఆరు నెలలు రద్దు చేస్తూ కర్ణాటక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కర్ణాటకలో ఆరు నెలలు ఈ సంస్థ సర్వీసులు నిలిచిపోనున్నాయి. రూల్స్‌ను అతిక్రమించి ఎలాంటి అనుమతులు లేకుండానే ఓలా బైక్ ట్యాక్సీని నడుపుతుందని కర్ణాటక రవాణ శాఖ తెలిపింది. దీనిపై వివరణ కోరామని.. అయితే సంస్థ ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదని వివరించింది. దీంతో కర్టాటక రవాణ చట్టం 2016 ప్రకారం ఆ సంస్థ లైసెన్స్‌లను ఆరు నెలలు రద్దు చేస్తున్నట్లు ఆదేశాలను జారీ చేశారు. ఈనెల 18వ తేదీనే ఆదేశాలను జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఆర్డర్ కాపీ అందిన మూడు రోజుల్లోనే లైసెన్సును సరెండర్ చేయాలని కూడా ఓలా కంపెనీని ఆదేశించారు. దీంతో ఓలా క్యాబ్స్ కర్ణాటక రోడ్లపై ఆరు నెలలు కనిపించవని ఆ శాఖ ఉన్నతాధికారి తెలిపారు. -
ఈకామర్స్ సంస్థలకూ అసోసియేషన్
న్యూఢిల్లీ: దేశీ ఈకామర్స్ సంస్థలు తాజాగా ది ఈ–కామర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (టీఈసీఐ) ఏర్పాటు చేసుకున్నాయి. స్నాప్‌డీల్, షాప్‌క్లూస్, అర్బన్‌క్లాప్ తదితర సంస్థలు కలిసి దీన్ని నెలకొల్పాయి. అంతర్జాతీయ సంస్థలకు దీటుగా దేశీ సంస్థలు కూడా రాణించేందుకు, దేశీ ఈకామర్స్ రంగం వృద్ధికి తోడ్పడేలా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వానికి తోడ్పడే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేసుకున్నట్లు స్నాప్‌డీల్ సీఈవో కునాల్ బెహల్ తెలిపారు. డేటా ప్రైవసీ, లాజిస్టిక్స్, పేమెంట్స్ తదితర అంశాలకు సంబంధించి భారతీయ ఈ–కామర్స్ రంగంలో ఉత్తమ ప్రమాణాలు నెలకొల్పేందుకు టీఈసీఐ ఉపయోగపడగలదని ఆయన పేర్కొన్నారు. 2017లో ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సాల్, ఓలా క్యాబ్స్ సహ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ తదితరులు కలిసి ఇండియాటెక్ పేరుతో ఇటువంటిదే లాబీ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. దేశీ స్టార్టప్స్‌కు సమాన అవకాశాలు కల్పించడం, ఐపీవో నిబంధనలను సరళతరం చేయడం, శక్తిమంతులైన ఇన్వెస్టర్ల నుంచి ఔత్సాహిక వ్యాపారవేత్తల ప్రయోజనాలు పరిరక్షించేలా డిఫరెన్షియల్ ఓటింగ్ విధానంలో మార్పులు తేవడం తదితర లక్ష్యాలతో ఇది ఏర్పాటైంది. అయితే, ఫ్లిప్‌కార్ట్ నుంచి బన్సాల్ నిష్క్రమణ అనంతరం దీని కార్యకలాపాలు నిల్చిపోయాయి. తాజాగా టీఈసీఐ ఆ లోటు భర్తీ చేయనుంది. -
నేటి నుంచి క్యాబ్‌ల బంద్
సాక్షి, హైదరాబాద్: క్యాబ్ డ్రైవర్లు మరోసారి రోడ్డెక్కారు. అంతర్జాతీయ క్యాబ్ సంస్థల వేధింపులను నిలిపివేయాలని, తమ శ్రమకు తగిన ఫలితం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బుధవారం కూకట్పల్లి హౌసింగ్ బోర్డులోని ఓలా కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. జై డ్రైవరన్న అసోసియేషన్‌తో పాటు ఇతర సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఆందోళనలో నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన క్యాబ్ డ్రైవర్లు పాల్గొన్నారు. లీజు విధానాన్ని రద్దు చేయాలని, వాహనాల కేటగిరీలతో నిమిత్తం లేకుండా ప్రతి కిలోమీటర్‌కు రూ.23 చొప్పున డ్రైవర్లకు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జై డ్రైవరన్న అసోసియేషన్ అధ్యక్షుడు సిద్ధార్థగౌడ్ మాట్లాడుతూ.. వేలాది వాహనాలను లీజు రూపంలో దారుణంగా దోచుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రైవర్‌కు లభించే ఆదాయంతో నిమిత్తం లేకుండా ప్రతి రోజు రూ.1150 చొప్పున వసూలు చేస్తున్నారని, రోజంతా కష్టపడినా డ్రైవర్‌కు ఏ మాత్రం ఆదాయం లభించడం ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో డ్రైవర్లు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారన్నారు. డ్రైవర్లను జలగల్లాగా పీడించే లీజు పద్ధతిని రద్దు చేయాలన్నారు. క్యాబ్‌లకు మినీ, మైక్రో, షేర్, ప్రైమ్ వంటి పేర్లు పెట్టి అతి తక్కువ చార్జీలు చెల్లించడం పట్ల డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ క్యాబ్ సంస్థల దోపిడీని అరికట్టేందుకు ప్రభుత్వమే స్వయంగా ఒక యాప్‌ను అందుబాటులోకి తేవాలని కోరారు. డ్రైవర్లకు ఈఎస్ఐ, పెన్షన్, తదితర సదుపాయాలతో పాటు ఎయిర్‌పోర్టు, బస్టేషన్లు, రైల్వేస్టేషన్లలో పార్కింగ్ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. క్యాబ్ సర్వీసులు నిలిపివేత ఇలా ఉండగా, తమ న్యాయమైన డిమాండ్ల సాధానకు ఓలా యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన వ్యక్తం కాకపోవడంతో గురువారం నుంచి నగరంలో క్యాబ్ సర్వీసుల బంద్ చేపట్టనున్నట్లు సిద్ధార్థగౌడ్ తెలిపారు. ఎక్కడి వాహనాలను అక్కడే నిలిపివేసి ఆందోళనను ఉధృతం చేయనున్నట్లు పేర్కొన్నారు. -
కంత్రీ డ్రైవర్లపై ఖాకీలకు మెసేజ్
బనశంకరి: వెకిలిచేష్టలు చేయడం, వేధించడం, ఖరీదైన వస్తువులను లాక్కోవడం, అశ్లీలంగా ఫొటోలు తీయడం, దారి మళ్లించి భయభ్రాంతులకు గురిచేయడం.. ఇలా యాప్ ఆధారిత క్యాబ్ సర్వీసుల్లో ప్రయాణించే మహిళలపై కొందరు ఘరానా డ్రైవర్లు లైంగిక వేధింపులకు పాల్పడుతున్న నేపథ్యంలో బెంగళూరు పోలీసులు నివారణ చర్యలు చేపట్టారు. ప్రయాణికులు ఆపదలో చిక్కుకుంటే వారు వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్‌కు అత్యవసర మెసేజ్ అందించే వ్యవస్థను ఓలా యాప్‌లో అమర్చాలని ఆ సంస్థకు నగర పోలీస్ శాఖ ఆదేశించింది. ఇందుకు ఓలా కంపెనీ సమ్మతించింది. ఇటీవల ఒక మహిళను ఓలా క్యాబ్ డ్రైవర్ బెదిరించి అర్ధనగ్నంగా ఫొటోలు తీసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడం తెలిసిందే. ఇక నేరుగా పోలీసులకు సందేశం ఓలా యాప్ క్యాబ్ ప్రయాణికులకు ఇబ్బందులు ఏర్పడితే వారి బంధువులకు సమాచారం అందించడానికి అత్యవసర సంఖ్యకు గతంలోనే అవకాశం కల్పించింది. ఇందులో తమకు ముఖ్యమైన ఐదుగురి నంబర్లను నమోదు చేసుకోవచ్చు. అత్యవసర వేళల్లో వారికి సందేశం పంపడానికి వీలవుతుంది. కానీ దీని బదులుగా యాప్ ద్వారా మొదట పోలీసులకే సమాచారం అందించే వ్యవస్థను కల్పించాలని ఆదేశించారు. ఓలా కంపెనీ తమ క్యాబ్‌లు ఎక్కడెక్కడ సంచరిస్తున్నాయో తరచూ పరిశీలిస్తుండాలి. సంచరించే మార్గం మళ్లించడం, అర్ధంతరంగా ట్రిప్ ముగించడం తదితరాల్లో ఏమైందో విచారించాలి. దీంతోపాటు మీపై నిఘా పెట్టి ఉంచామని డ్రైవర్లకు స్పష్టం చేయాలని అదనపు పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్‌సింగ్ తెలిపారు. బెంగళూరు పోలీస్‌శాఖ ఇప్పటికే సురక్ష యాప్ విడుదల చేసింది. అత్యవసర సమయాల్లో ఎస్వోఎస్ను నొక్కితే పోలీస్‌కంట్రోల్ రూమ్‌కు సందేశం వెళ్తుంది. అక్కడ నుంచి సమీపంలో ఉన్న పోలీసులకు సమాచారం అందుతుంది. ఇదే తరహాలో ఓలా యాప్‌లో వ్యవస్థ ఉండాలని ఓలా ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో సలహా ఇచ్చామని సింగ్ తెలిపారు. ఈ భద్రతా చర్యలను నిర్ణీత కాలవ్యవధిలో అమలు చేయాలని, తమకు నివేదిక అందజేయాలని ఆదేశించామన్నారు. -
క్యా'బ్' పరేషాన్
దేశీయ రవాణా రంగంలోకి ప్రవేశించిన క్యాబ్ సంస్థలు ప్రయాణికులపై దండయాత్ర చేస్తున్నాయి. సాధారణంగా ఆర్టీసీ, ఎంఎంటీఎస్ రైళ్లు, ఆటోరిక్షాలు, మెట్రో రైలు వంటి అన్ని రకాల ప్రజా రవాణా సదుపాయాల చార్జీలను ప్రభుత్వమే నియంత్రిస్తుంది. కానీ సిటీలో క్యాబ్ సంస్థలపై మాత్రం నియంత్రణ అనేదే లేదు. వీటి చార్జీలపైనా ప్రభుత్వానికి ఎలాంటి అజమాయిషీ లేకుండా పోయింది. మోటారు వాహన నిబంధనల మేరకు 2006లో ‘సిటీ క్యాబ్యాక్ట్’నుఅమల్లోకి తెచ్చారు. దీని ప్రకారం కిలోమీటర్‌కు రూ.10 చొప్పున, రాత్రి వేళల్లో రూ.15 చొప్పున చార్జీలు ఉండేవి. బడా క్యాబ్ సంస్థల ప్రవేశంతో చార్జీల నియంత్రణ అంశం ఎవరి పరిధిలో లేకుండా పోయింది. దీంతో ‘పీక్ అవర్స్’ పేరుతో సగటు ప్రయాణికుడి నడ్డి విరుస్తున్నాయి. సాక్షి, సిటీబ్యూరో:రవాణా రంగంలోకి దూసుకొచ్చిన అంతర్జాతీయ క్యాబ్ సంస్థలు విధించే చార్జీలు మొదట్లో ఆటోరిక్షా కంటే తక్కువగా ఉండేవి. ఈ చార్జీలతో ఆకట్టుకున్న ఊబెర్, ఓలా వంటి క్యాబ్ సంస్థలు ఇప్పుడు ప్రయాణికుల నడ్డి విరుస్తున్నాయి. ఆటోరిక్షాలు, ఇతర ప్రజా రవాణా వాహనాల్లో రాత్రి 10 గంటలు దాటాక మాత్రమే సాధారణ చార్జీలపైన 50 శాతం అదనపు చార్జీలు విధించే వెసులుబాటు ఉంది. కానీ క్యాబ్ సంస్థలు ప్రత్యేకంగా ‘పీక్ అవర్స్’ లేదా ‘స్లాక్ అవర్స్’కు వేర్వేరుగా చార్జీలు చార్జీలను పెంచేస్తున్నాయి. ఇలాంటి పెంపు నిబంధన నిర్దిష్టంగా లేకున్నా, నియంత్రించేవారు గాని.. కనీసం దీనిపై ఫిర్యాదు చేసేందుకు గాని అవకాశం లేకపోతోంది. వేసవిలో పెరిగిన క్యాబ్ డిమాండ్ కొద్ది రోజులుగా పెరుగుతున్న వేసవి ఉష్ణోగ్రతలతో పాటే క్యాబ్‌లకు డిమాండ్ పెరిగింది. సాధారణ రోజుల్లో 1.2 లక్షల క్యాబ్‌లు నగరంలోని వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగిస్తుండగా.. ప్రస్తుతం వేసవి రద్దీకి అనుగుణంగా సుమారు 1.6 లక్షల క్యాబ్‌లు తిరుగుతున్నాయి. 8 లక్షల నుంచి 10 లక్షల మంది ప్రయాణికులు ప్రతి రోజూ ఈ సేవలను వినియోగించుకుంటున్నారు. పెరుగుతున్న ఈ డిమాండ్‌కు అనుగుణంగా చార్జీలను పెంచేస్తున్నారు. ఒకవేళ పీక్ అవర్స్‌లో క్యాబ్‌ల కొరత కారణంగా చార్జీలు పెరుగుతున్నట్లు భావించినా ఉదయం 7 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు మాత్రమే పీక్ అవర్స్‌గా భావించాలి. కానీ క్యాబ్ చార్జీలు ప్రతి గంటకు మారిపోవడం పట్ల ప్రయాణికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం వేళల్లోనూ పీక్ అవర్ చార్జీలు విధిస్తున్నట్లు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దోపిడీకి సాక్ష్యాలివిగో.. ♦ దిల్సుఖ్నగర్ నుంచి బోడుప్పల్ వరకు 15 కిలోమీటర్లు ఉంటుంది. సాధారణంగా ఈ దూరానికి క్యాబ్ చార్జీ రూ.250 అవుతుంది. కానీ ఇటీవల ఓ ప్రయాణికుడు ఏకంగా రూ.798 చెల్లించాల్సి వచ్చింది. ♦ హైటెక్‌సిటీ నుంచి సికింద్రాబాద్ వరకు సాధారణంగా రూ.300 నుంచి రూ.350 వరకు ఉంటుంది. కానీ రెండు రోజుల క్రితం ఈ చార్జీ రూ.650కి పెరగడంతో సదరు ప్రయాణికుడు బెంబేలెత్తాడు. ♦ గంట గంటకూ చార్జీలు జంప్ అవుతున్నట్లు ప్రయాణికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ♦ పీక్ అవర్స్ నెపంతో 1:2, 1:3, 1:4 చొప్పున చార్జీలను ఆయా క్యాబ్ సంస్థలు పెంచేస్తున్నాయి. ♦ మీటర్ ఆధారంగా నడిచే ఆటో రిక్షాలు, ట్యాక్సీలు తదితర వాహనాల చార్జీలపై ఆర్టీఏ, తూనికలు–కొలతలు శాఖల నియంత్రణ ఉంటుంది. కానీ మొబైల్ యాప్‌తో సేవలందజేస్తున్న క్యాబ్‌లను నియంత్రించే అధికారం ఏ ప్రభుత్వ విభాగానికీ లేకుండా పోయింది. ప్రభుత్వమే చార్జీలునిర్ణయించాలి బడా క్యాబ్ సంస్థలను ప్రభుత్వం నియంత్రించకపోవడమే ఇందుకు కారణం. ఆటోలు, ట్యాక్సీలకు ఉన్నట్లుగానే క్యాబ్‌లకు కూడా ఫిక్స్డ్ చార్జీలు ఉండాలి. ప్రభుత్వమే ఈ చార్జీలను నిర్ణయించి పారదర్శకంగా అమలు చేయాలి. – అనిల్ కొఠారి, గ్రీన్‌క్యాబ్స్ ఓనర్ మాకూ అన్యాయమే.. క్యాబ్ సంస్థలు ప్రయాణికుల నుంచి వసూలు చేసే చార్జీల్లో సగానికి పైగా ఆవే తీసుకుంటాయి. జీఎస్టీతో సహా భారమంతా మా డ్రైవర్లపైనే వేస్తున్నారు. డీజిల్ ఖర్చులు, మెయింటనెన్స్ ఖర్చులన్నీ మినహాయిస్తే రోజుకు రూ.500 కూడా రావడం లేదు. – సిద్ధార్థ్గౌడ్, జై డ్రైవరన్న అసోసియేషన్ అధ్యక్షుడు -
ఓలా... ఇక ఎలక్ట్రిక్!
న్యూఢిల్లీ: ప్రముఖ దేశీ క్యాబ్ సేవల సంస్థ ‘ఓలా’ తాజాగా వచ్చే ఏడాది కాలంలో తన ప్లాట్‌ఫామ్ మీదకు 10,000 ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను (ఈవీ) తీసుకువస్తామని ప్రకటించింది. ఇందులో ఎక్కువగా ఇ–రిక్షాలుంటాయని పేర్కొంది. ‘మిషన్ ఎలక్ట్రిక్’ ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇక 2021 నాటికి తన ప్లాట్‌ఫామ్‌లోని ఎలక్ట్రిక్ వెహికల్స్ సంఖ్యను 10 లక్షలకు పెంచుకోవాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని తెలిపింది. ‘మేం ఇప్పటికే ఎలక్ట్రిక్ వెహికల్ ప్రాజెక్టును ఆవిష్కరించాం. దీన్నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాం. భారత్‌లో ఎలక్ట్రిక్ మొబిలిటికి ప్రాధాన్యమిస్తున్నాం. అందుకే మరిన్ని ఈవీలను ప్లాట్‌ఫామ్ మీదకు తీసుకువస్తాం’ అని ఓలా సహవ్యవస్థాపకుడు, సీఈవో భవిష్ అగర్వాల్ పేర్కొన్నారు. అందుబాటులోని స్థిరమైన మొబిలిటీ సొల్యూషన్స్‌ను తీసుకురావడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు సహా ఇతర సంస్థలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తమ ఈవీ ఫ్లీట్‌ను మరో మూడు పట్టణాలకు విస్తరిస్తామన్నారు. అయితే వాటి పేర్లు మాత్రం వెల్లడించలేదు. కాగా గతేడాది మే నెలలో ఓలా తన తొలి ఎలక్ట్రిక్ వెహికల్ ప్రాజెక్టును నాగ్‌పూర్‌లో ఆవిష్కరించింది. ఎలక్ట్రిక్ క్యాబ్స్, ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు, ఎలక్ట్రిక్ బస్సులు, చార్జింగ్ స్టేషన్లు, రూఫ్‌టాప్ సోలార్ ఇన్స్టాలేషన్ వంటి అంశాలు ఈ ప్రాజెక్టులో భాగంగా ఉన్నాయి. -
‘ఓలా’ మోసాల నుంచి రక్షించండి
హైదరాబాద్: ఓలా క్యాబ్స్ మోసాల నుంచి రక్షించాలని కార్ల యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్ల యజమానులతో సంస్థ ఒప్పందం కుదుర్చుకున్న సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా తుంగలో తొక్కుతూ తీవ్ర అన్యాయం చేస్తోందని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం కేపీహెచ్‌బీ కాలనీలోని ఓలా క్యాబ్స్ కార్యాలయం వద్దకు చేరుకున్న కార్ల యజమానులు, బాధితులు సంస్థ ప్రతినిధులతో మాట్లాడేందుకు యత్నించగా అక్కడి బౌన్సర్లు వారిని అనుమతించలేదు. దీంతో వారు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం తమకు న్యాయం చేయాలని కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓలా సంస్థ కిలోమీటరుకు రూ.17 ఇస్తామని, కస్టమర్ కారెక్కి దిగితే రూ.వంద ఇన్సెంటివ్ ఇస్తామని చెప్పి మూడు నెలలు మాత్రమే ఇచ్చిందని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. తరువాత ఒక్కొక్కటిగా హామీలన్నింటినీ తుంగలో తొక్కి ప్రస్తుతం కిలోమీటరుకు రూ.ఐదు చెల్లిస్తూ తీవ్ర అన్యాయం చేస్తోందన్నారు. దీంతో 14 గంటల పాటు డ్యూటీ చేసినా తిరిగి జేబులోంచి డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని బాధితులు విచారం వ్యక్తం చేశారు. కారు రుణాలు చెల్లించలేక, కుటుంబాలను పోషించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే 30కి పైగా కేసులు పెట్టినా పోలీసులు ఓలా క్యాబ్స్పై ఎలాంటి చర్యలూ తీసుకోలేదని బాధితుడు షేక్ సాజిద్ ఆవేదన వ్యక్తం చేశారు. -
ఓలా ట్విట్టర్ హ్యాకయింది!
దేశవ్యాప్తంగా టాక్సీ సర్వీసులు అందిస్తున్న ఓలా క్యాబ్స్ ట్విట్టర్ అకౌంట్ హ్యాకయింది. గుర్తుతెలియని వ్యక్తులు ఆ అకౌంటును హ్యాక్ చేసి, తమ చేతికి వచ్చిన సందేశాలను అందులో పెడుతున్నారు. అయితే అసలు తమ అకౌంట్ హ్యాక్ అయిన విషయాన్ని ఇంకా ఓలా కూడా గుర్తించినట్లు లేదు. అలాగే, అందులో పోస్టింగులు చేస్తున్నవాళ్లు కూడా తాము హ్యాక్ చేశామని ప్రకటించుకోలేదు గానీ, అసలు సంబంధం లేని ట్వీట్లు పెడుతున్నారు. 'మీరు తాగడానికి వెళ్తుంటే నన్ను కూడా పిలవండి'.. ఇలాంటి ఫన్నీ ట్వీట్లు అందులో కనిపిస్తున్నాయి. ఇక హ్యాక్ చేసినవారు కూడా తాము ఎందుకు చేశామో, తమ లక్ష్యం ఏంటో చెప్పలేదు. -
ఓలా క్యాబ్స్‌లో క్యాష్ విత్‌డ్రాయల్
న్యూఢిల్లీ: ఓలా క్యాబ్స్‌లో రైడింగే కాదు అవసరమైతే కార్డులను స్వైప్ చేసి నగదు పొందవచ్చు. ఇందుకు వీలుగా ఓలా క్యాబ్స్ ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఆంధ్రా బ్యాంకులతో టై అప్ అరుుంది. హైదరాబాద్, కోల్‌కతా నగరాల్లో ప్రయోగాత్మకంగా ఈ సేవలు ప్రారంభమయ్యాయని ఓలా తెలిపింది. ట్యాక్సీలో ఓ బ్యాంకు అధికారి ఉంటారని, వివిధ ప్రాంతాలకు పీఓఎస్ మెషీ న్ను తీసుకెళ్లడం ద్వారా ఓ కార్డుపై రూ.2,000 వరకు నగదు అందించనున్నట్టు వివరించింది. -
ఇంటర్నెట్ లేకున్నా ఓలా బుకింగ్
హైదరాబాద్ : క్యాబ్ అగ్రిగేటర్ ఓలా తాజాగా ఆఫ్‌లైన్ ఫీచర్‌ను జోడించింది. దీనితో ఇంటర్నెట్ లేనప్పటికీ స్మార్ట్‌ఫోన్ నుంచి క్యాబ్‌ను బుక్ చేయవచ్చు. బుక్ వయా ఎస్ఎంఎస్ అన్న ఆప్షన్‌పై క్లిక్ చేయగానే కస్టమర్ మొబైల్ నుంచి లొకేషన్‌తో కూడిన వివరాలతో ఒక మెసేజ్ ఓలాకు వెళ్తుంది. వెంటనే కస్టమర్‌కు సమీపంలో ఉన్న మైక్రో, మినీ, ప్రైమ్, లగ్జరీ క్యాబ్‌ల వివరాలతో ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. కస్టమర్ తనకు నచ్చిన క్యాబ్‌ను ఎంచుకోవచ్చు. ఎంపిక చేసుకోగానే డ్రైవర్, క్యాబ్ వివరాలతో మరో ఎస్ఎంఎస్ వస్తుంది. అటు డ్రైవర్‌కూ కస్టమర్ సమాచారం, జీపీఎస్ లొకేషన్ సైతం ఎస్ఎంఎస్ ద్వారా వెళ్తుంది. ఇంటర్నెట్ ఉంటే రైడ్ వివరాలు, జీపీఎస్ ట్రాకింగ్, ఎస్‌వోఎస్ బటన్ వంటి ఫీచర్లు వినియోగించుకోవచ్చు. ఓలా ఆఫ్‌లైన్ బుకింగ్ సౌకర్యం ప్రస్తుతం ప్రధాన నగరాల్లో ఉంది. దశలవారీగా మొత్తం 102 నగరాలు, పట్టణాలకు విస్తరిస్తామని ఓలా సహ వ్యవస్థాపకులు అంకిత్ భాటి తెలిపారు. -
ఓలా క్యాబ్స్ పై ఉబర్ ఫిర్యాదు
న్యూఢిల్లీ: తమ వ్యాపార కార్యకలాపాల్లో ఓలా క్యాబ్స్ జోక్యం చేసుకుంటోందని ఆరోపిస్తూ యాప్ బేస్డ్ ట్యాక్సీ అగ్రిగేటర్ ఉబర్.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఓలా ఉద్యోగులు, ఏజెంట్లు తమ వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నారని ఉబర్ ఆరోపించింది. తమ యాప్ పై నకిలీ బుకింగ్ లకు పాల్పడుతోందని న్యాయస్థానానికి తెలిపింది. ఉబర్ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ఓలా క్యాబ్స్ కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 14కు వాయిదా వేసింది. అద్దె ట్యాక్సీల రంగంలో అగ్రస్థానంలో ఉన్న ఉబర్, ఓలా మధ్య కొంతకాలంగా ఆధిపత్యపోరు నడుస్తోంది. పోటీలో నిలబడేందుకు క్యాబ్ కంపెనీలు అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయి. కృత్రిమంగా చార్జీలు తగ్గించేస్తున్నాయి. ఇటీవలే బెంగళూరులో ఓలా క్యాబ్స్ పై కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)కు ఫాస్ట్ ట్రాక్ కాల్ క్యాబ్స్ ఫిర్యాదు చేసింది. నిబంధనలు ఉల్లఘించినట్టు రుజువైతే ఓలా క్యాబ్స్ పై సీసీఐ చర్యలు తీసుకోనుంది. -
‘ఓలా క్యాబ్స్’లో 2,500 కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: విస్తరణలో భాగంగా ట్యాక్సీ సేవల సంస్థ ‘ఓలా’ తాజాగా 400 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 2,500 కోట్లు) సమీకరించింది. ఈ ఏడాది ఆఖరు నాటికి కార్యకలాపాలను రెట్టింపు స్థాయిలో 200 నగరాలకు విస్తరించడంతో పాటు క్యాబ్స్ సంఖ్యను కూడా పెంచుకోనుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టిన వాటిల్లో జీఐసీ, ఫాల్కన్ ఎడ్జ్ క్యాపిటల్‌తో పాటు ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్, టైగర్ గ్లోబల్, స్టెడ్‌వ్యూ క్యాపిటల్, యాక్సెల్ పార్ట్నర్స్ సంస్థలు ఉన్నాయి. ఓలా సహవ్యవస్థాపకుడు, సీఈవో భవిష్ అగర్వాల్ ఈ విషయాలు తెలిపారు. సెప్టెంబర్ నాటికి 1,000 మంది పైగా ఇంజనీర్లను తీసుకోనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం 100 నగరాల్లో కార్యకలాపాలు, 500 మంది ఇంజినీరింగ్ సిబ్బంది ఉన్నారన్నారు. ఇటీవలే కొనుగోలు చేసిన ట్యాక్సీఫర్‌ష్యూర్ విస్తరణకు 100 మిలి యన్ డాలర్లు వెచ్చించనున్నట్లు తెలిపారు. -
ఓలా చేతికి ట్యాక్సీ ఫర్ ష్యూర్
డీల్ విలువ రూ.1,240 కోట్లు - రోజుకు 1,000 వాహనాలు ఓలా సేవల ఖాతాలోకి... - డిసెంబర్‌కల్లా 200 నగరాలకు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్లైన్ క్యాబ్ సేవల రంగంలో ఉన్న ఓలా క్యాబ్స్ భారీ డీల్‌కు తెరలేపింది. క్యాబ్ సేవల్లో ఉన్న పోటీ కంపెనీ ట్యాక్సీ ఫర్ ష్యూర్‌ను సుమారు రూ.1,240 కోట్లకు కొనుగోలు చేసింది. కంజ్యూమర్ ఇంటర్నెట్ రంగంలో ఫ్లిప్‌కార్ట్-మింత్రాల రూ.2,260 కోట్ల డీల్ తర్వాతి స్థానాన్ని ఇది కైవసం చేసుకుంది. ఇక డీల్ అనంతరం కూడా ట్యాక్సీ ఫర్ ష్యూర్ తన సేవలను కొనసాగిస్తుంది. ఒక లక్షకుపైగా వాహనాలతో క్యాబ్ సర్వీసుల్లో ఓలా దేశంలో అగ్రస్థానంలో ఉంది. రూ.49లకే కారులో ప్రయాణించే సౌకర్యాన్ని తీసుకొచ్చిన ట్యాక్సీ ఫర్ ష్యూర్ మార్కెట్‌ను ఒక ఊపు ఊపింది. ఉత్సాహభరిత విధానాన్ని ఈ కంపెనీ అమలు చేసిందంటూ ఓలా సీఈవో, సహ వ్యవస్థాపకులు భవీశ్ అగర్వాల్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ట్యాక్సీ ఫర్ ష్యూర్ వద్ద 15,000లకుపైగా వాహనాలున్నాయి. క్యాబ్ ఆపరేటర్లతో సరఫరా, పంపిణీ విధానంలో పనిచేస్తోంది. ఓలా అందుకు భిన్నంగా డ్రైవర్-ఓనర్ విధానాన్ని అమలు చేస్తోంది. రోజుకు 1,000 వాహనాలు.. ఓలా క్యాబ్స్ ప్రస్తుతం 67 నగరాల్లో సర్వీసులందిస్తోంది. 2015 డిసెంబర్ నాటికి 200 నగరాలకు విస్తరించాలని లక్ష్యంగా చేసుకుంది. రోజుకు 1,000 వాహనాలు జతకూడుతున్నాయి. ఇందులో కార్లు 70%, ఆటోలు 30% ఉంటాయని ఓలా మార్కెటింగ్ డెరైక్టర్ ఆనంద్ సుబ్రమణియన్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఎస్బీఐ సహకారంతో రోజు వారీ చెల్లింపుల విధానం భారత్‌లో సంచలనం సృష్టిస్తోందని అన్నారు. ‘భారత్‌లో 100 మందిలో కారు యజమానుల సంఖ్య కేవలం 3 శాతమే. అందుకే క్యాబ్స్‌కు డిమాండ్ గణనీయంగా ఉంటుంది. ఇక డ్రైవర్లకు కంపెనీ ఇచ్చే నగదు ప్రోత్సాహకాలను పెట్టుబడిగా భావించాలి. ప్రతిభ కనబరిచే డ్రైవర్లకు స్టార్‌రేటింగ్ ఆధారంగా ప్రోత్సాహకాలు ఇస్తున్నాం. అలాగే ఆకర్షించే చార్జీలు, ఆఫర్లు కస్టమర్లను ప్రోత్సహించేందుకే’ అని అన్నారు. 47 నగరాల్లో సేవలందిస్తున్న ట్యాక్సీ ఫర్ ష్యూర్ ఎకానమీ విభాగంలో మార్కెట్లో పట్టు సాధించిందని చెప్పారు. ఓలా మధ్య, ప్రీమియం విభాగాల్లో ఉందని తెలిపారు.