ఓలా క్యాబ్స్ పై ఉబర్ ఫిర్యాదు
న్యూఢిల్లీ: తమ వ్యాపార కార్యకలాపాల్లో ఓలా క్యాబ్స్ జోక్యం చేసుకుంటోందని ఆరోపిస్తూ యాప్ బేస్డ్ ట్యాక్సీ అగ్రిగేటర్ ఉబర్.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఓలా ఉద్యోగులు, ఏజెంట్లు తమ వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నారని ఉబర్ ఆరోపించింది. తమ యాప్ పై నకిలీ బుకింగ్ లకు పాల్పడుతోందని న్యాయస్థానానికి తెలిపింది. ఉబర్ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ఓలా క్యాబ్స్ కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 14కు వాయిదా వేసింది.
అద్దె ట్యాక్సీల రంగంలో అగ్రస్థానంలో ఉన్న ఉబర్, ఓలా మధ్య కొంతకాలంగా ఆధిపత్యపోరు నడుస్తోంది. పోటీలో నిలబడేందుకు క్యాబ్ కంపెనీలు అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయి. కృత్రిమంగా చార్జీలు తగ్గించేస్తున్నాయి. ఇటీవలే బెంగళూరులో ఓలా క్యాబ్స్ పై కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)కు ఫాస్ట్ ట్రాక్ కాల్ క్యాబ్స్ ఫిర్యాదు చేసింది. నిబంధనలు ఉల్లఘించినట్టు రుజువైతే ఓలా క్యాబ్స్ పై సీసీఐ చర్యలు తీసుకోనుంది.