అది రేప్ కాదు.. లీవ్ ఇన్ రిలేషన్షిప్
న్యూఢిల్లీ: అత్యాచారం కేసులో 10 ఏళ్లు జైలు శిక్షపడ్డ ఓ నిందితుడికి విముక్తి లభించింది. ట్రయల్ కోర్టు విధించిన శిక్షను ఢిల్లీ హైకోర్టు రద్దు చేసింది. ఆరోపణలు చేసిన బాధితురాలు నిందితుడితో లీవ్ ఇన్ రిలేషన్ షిప్లో ఉన్నట్టు తేలిందని, ఇది అత్యాచార ఘటన కాదని కోర్టు తీర్పు చెప్పింది.
2011 జనవరిలో తాను ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో నిందితుడు వచ్చి తనపై అత్యాచారం చేశాడని సంబంధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెండేళ్ల తర్వాత ట్రయల్ కోర్టు తీర్పు వెలువరించింది. నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు 15 వేల రూపాయల జరిమానా విధించింది. కింది కోర్టు తీర్పును సవాల్ చేస్తూ నిందితుడు హైకోర్టును ఆశ్రయించాడు. భర్తకు దూరంగా ఉంటున్న బాధిత మహిళను తాను అత్యాచారం చేయలేదని, ఆమె తనతో లీవ్ ఇన్ రిలేషన్షిప్లో ఉందని కోర్టుకు విన్నవించాడు. నిందితుడి నుంచి ఆమె 11 వేల రూపాయలు అప్పుగా తీసుకుందని, తిరిగి ఇవ్వమని అడిగినందుకు తప్పుడు కేసు పెట్టిందని అతని తరపు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. ఈ కేసును విచారించిన హైకోర్టు నిందితుడిని నిర్దోషిగా ప్రకటించింది.