క్యా'బ్‌' పరేషాన్‌ | Cab Rates Hikes In Peek Hours In Greater City | Sakshi
Sakshi News home page

‘పీక్‌’ అవర్స్‌ బాదుడు

Published Fri, May 11 2018 9:27 AM | Last Updated on Tue, Sep 4 2018 5:44 PM

Cab Rates Hikes In Peek Hours In Greater City - Sakshi

దేశీయ రవాణా రంగంలోకి ప్రవేశించిన క్యాబ్‌ సంస్థలు ప్రయాణికులపై దండయాత్ర చేస్తున్నాయి. సాధారణంగా ఆర్టీసీ, ఎంఎంటీఎస్‌ రైళ్లు, ఆటోరిక్షాలు, మెట్రో రైలు వంటి అన్ని రకాల ప్రజా రవాణా సదుపాయాల చార్జీలను ప్రభుత్వమే నియంత్రిస్తుంది. కానీ సిటీలో క్యాబ్‌ సంస్థలపై మాత్రం నియంత్రణ అనేదే లేదు. వీటి చార్జీలపైనా ప్రభుత్వానికి ఎలాంటి అజమాయిషీ లేకుండా పోయింది. మోటారు వాహన నిబంధనల మేరకు 2006లో ‘సిటీ క్యాబ్‌యాక్ట్‌’నుఅమల్లోకి తెచ్చారు. దీని ప్రకారం కిలోమీటర్‌కు రూ.10 చొప్పున, రాత్రి వేళల్లో రూ.15 చొప్పున చార్జీలు ఉండేవి. బడా క్యాబ్‌ సంస్థల ప్రవేశంతో చార్జీల నియంత్రణ అంశం ఎవరి పరిధిలో లేకుండా పోయింది. దీంతో ‘పీక్‌ అవర్స్‌’ పేరుతో సగటు ప్రయాణికుడి నడ్డి విరుస్తున్నాయి.

సాక్షి, సిటీబ్యూరో:రవాణా రంగంలోకి దూసుకొచ్చిన అంతర్జాతీయ క్యాబ్‌ సంస్థలు విధించే చార్జీలు మొదట్లో ఆటోరిక్షా కంటే తక్కువగా ఉండేవి. ఈ చార్జీలతో ఆకట్టుకున్న ఊబెర్, ఓలా వంటి క్యాబ్‌ సంస్థలు ఇప్పుడు ప్రయాణికుల నడ్డి విరుస్తున్నాయి. ఆటోరిక్షాలు, ఇతర ప్రజా రవాణా వాహనాల్లో రాత్రి 10 గంటలు దాటాక మాత్రమే సాధారణ చార్జీలపైన 50 శాతం అదనపు చార్జీలు విధించే వెసులుబాటు ఉంది. కానీ క్యాబ్‌ సంస్థలు ప్రత్యేకంగా ‘పీక్‌ అవర్స్‌’ లేదా ‘స్లాక్‌ అవర్స్‌’కు వేర్వేరుగా చార్జీలు చార్జీలను పెంచేస్తున్నాయి. ఇలాంటి పెంపు నిబంధన నిర్దిష్టంగా లేకున్నా, నియంత్రించేవారు గాని.. కనీసం దీనిపై ఫిర్యాదు చేసేందుకు గాని అవకాశం లేకపోతోంది. 

వేసవిలో పెరిగిన క్యాబ్‌ డిమాండ్‌
కొద్ది రోజులుగా పెరుగుతున్న వేసవి ఉష్ణోగ్రతలతో పాటే క్యాబ్‌లకు డిమాండ్‌ పెరిగింది. సాధారణ రోజుల్లో 1.2 లక్షల క్యాబ్‌లు నగరంలోని వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగిస్తుండగా.. ప్రస్తుతం వేసవి రద్దీకి అనుగుణంగా సుమారు 1.6 లక్షల క్యాబ్‌లు తిరుగుతున్నాయి. 8 లక్షల నుంచి 10 లక్షల మంది ప్రయాణికులు ప్రతి రోజూ ఈ సేవలను వినియోగించుకుంటున్నారు. పెరుగుతున్న ఈ డిమాండ్‌కు అనుగుణంగా చార్జీలను పెంచేస్తున్నారు. ఒకవేళ పీక్‌ అవర్స్‌లో క్యాబ్‌ల కొరత కారణంగా చార్జీలు పెరుగుతున్నట్లు భావించినా ఉదయం 7 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు మాత్రమే పీక్‌ అవర్స్‌గా భావించాలి. కానీ క్యాబ్‌ చార్జీలు ప్రతి గంటకు మారిపోవడం పట్ల ప్రయాణికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం వేళల్లోనూ పీక్‌ అవర్‌ చార్జీలు విధిస్తున్నట్లు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దోపిడీకి సాక్ష్యాలివిగో..
దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి బోడుప్పల్‌ వరకు 15 కిలోమీటర్లు ఉంటుంది. సాధారణంగా ఈ దూరానికి క్యాబ్‌ చార్జీ రూ.250 అవుతుంది. కానీ ఇటీవల ఓ ప్రయాణికుడు ఏకంగా రూ.798 చెల్లించాల్సి వచ్చింది.  
హైటెక్‌సిటీ నుంచి సికింద్రాబాద్‌ వరకు సాధారణంగా రూ.300 నుంచి రూ.350 వరకు ఉంటుంది. కానీ రెండు రోజుల క్రితం ఈ చార్జీ రూ.650కి పెరగడంతో సదరు ప్రయాణికుడు బెంబేలెత్తాడు.
గంట గంటకూ చార్జీలు జంప్‌ అవుతున్నట్లు ప్రయాణికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.  
పీక్‌ అవర్స్‌ నెపంతో 1:2, 1:3, 1:4 చొప్పున చార్జీలను ఆయా క్యాబ్‌ సంస్థలు పెంచేస్తున్నాయి.  
మీటర్‌ ఆధారంగా నడిచే ఆటో రిక్షాలు, ట్యాక్సీలు తదితర వాహనాల చార్జీలపై ఆర్టీఏ, తూనికలు–కొలతలు శాఖల నియంత్రణ ఉంటుంది. కానీ మొబైల్‌ యాప్‌తో సేవలందజేస్తున్న క్యాబ్‌లను నియంత్రించే అధికారం ఏ ప్రభుత్వ విభాగానికీ లేకుండా పోయింది.

ప్రభుత్వమే చార్జీలునిర్ణయించాలి  
బడా క్యాబ్‌ సంస్థలను ప్రభుత్వం నియంత్రించకపోవడమే ఇందుకు కారణం. ఆటోలు, ట్యాక్సీలకు ఉన్నట్లుగానే క్యాబ్‌లకు కూడా ఫిక్స్‌డ్‌ చార్జీలు ఉండాలి. ప్రభుత్వమే ఈ చార్జీలను నిర్ణయించి పారదర్శకంగా అమలు చేయాలి.    – అనిల్‌ కొఠారి, గ్రీన్‌క్యాబ్స్‌ ఓనర్‌

మాకూ అన్యాయమే..  
క్యాబ్‌ సంస్థలు ప్రయాణికుల నుంచి వసూలు చేసే చార్జీల్లో సగానికి పైగా ఆవే తీసుకుంటాయి. జీఎస్‌టీతో సహా భారమంతా మా డ్రైవర్లపైనే వేస్తున్నారు. డీజిల్‌ ఖర్చులు, మెయింటనెన్స్‌ ఖర్చులన్నీ మినహాయిస్తే రోజుకు రూ.500 కూడా రావడం లేదు.    – సిద్ధార్థ్‌గౌడ్, జై డ్రైవరన్న అసోసియేషన్‌ అధ్యక్షుడు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement