ఉప్పుకు కూడా బిల్లు వేస్తున్న రెస్టారెంట్
సాక్షి, హైదరాబాద్: హోటల్లో తినే తిండికి బిల్లు కడతారు, తాగే నీళ్లకు బిల్లు కడతారు, మరి వేసుకొనే ఉప్పుకు బిల్లు ఎప్పుడైనా కట్టారా... ఉప్పుకు బిల్లు ఏంటీ అనుకుంటున్నారా ? అవును భాగ్యనగరంలోని ఓ రెస్టారెంట్‌లో చిటికెడు ఉప్పుకు బిల్లు వేశారు.
వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి ఓ సోమాజిగూడలో నూతనంగా ప్రారంభించిన ఓ రెస్టారెంట్‌కు కుటుంబ సమేతంగా డిన్నర్‌కు వెళ్లాడు. తిన్న తరువాత లైమ్‌సోడా తీసుకున్నాడు. అందులోకి కొంచెం ఉప్పు కావాలని అడిగాడు. వెంటనే ఉప్పు ఇచ్చారు అక్కడి సిబ్బంది. అంతేకాదు చివరగా వచ్చే బిల్లులో ఇచ్చిన చిటికెడు ఉప్పుకు కూడా రూ.1 బిల్లు వేశారు.
అయితే రెస్టారెంట్‌పై వచ్చిన ఆరోపణలపై యాజమాన్యం స్పందించింది. ఈ సంఘటన కావలని చేసింది కాదని, సాఫ్ట్‌వేర్‌లో తప్పిదం వల్ల జరిగిందని తెలియచేసింది. తాజాగా బిల్లు ఇచ్చే యంత్రాల్లో కొత్త సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేశామని, దానిని పరిశీలించకుండా క్యాషియర్ బిల్లు జారీ చేశారని వివరణ ఇచ్చారు. ఈ సంఘటన అనంతరం బిల్లుపై వినియోగదారుడుకి లైమ్‌సోడాకు రేటు రూ.150 తగ్గింపు ఇచ్చినా కస్టమర్ దానిని తిరస్కరించాడు.