ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రం మణిపూర్ మళ్లీ అట్టుడుకుతోంది. జాతుల మధ్య ఘర్షణలు మరోసారి చెలరేగడంతో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇందుకు జిరిబామ్ జిల్లాలో మైతేయి వర్గానికి చెందిన ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులు హత్యకు గురవ్వడమే కారణం. వీరిని కుకీ మిలిటెంట్లు కిడ్నాప్ చేసి హత్య చేసి ఉంటారని భావిస్తుండటంతో రాష్ట్రంలో అల్లర్లు రాజుకున్నాయి. వీరి హత్యను నిరసిస్తూ నిరసనకారులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు.
రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు బీరెన్ సింగ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. ఈ క్రమంలో మణిపూర్ పరిణామాలపై చర్చించడానికి ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ సోమవారం సాయంత్రం మంత్రులు, ఎన్డీయే ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు.అయితే శాంతి భద్రతలపై సమీక్షించిన ఈ భేటికి 11 మంది ఎమ్మెల్యేలు ఎలాంటి కారణాలు వెల్లడించకుండానే గైర్హాజరు అయ్యారు.
మణిపూర్‌లో సాయుధ దళాల ప్రత్యేక అధికార చట్టాన్ని మళ్లీ అమలు చేయాల్సిన అవసరాన్ని కేంద్ర ప్రభుత్వం సమీక్షించాలని, జిరిబామ్ హత్యలకు కారణమైన కుకీ మిలిటెంట్లకు వ్యతిరేకంగా వారం రోజుల్లోగా భారీ ఆపరేషన్ చేయాలని తీర్మానం డిమాండ్ చేస్తుంది. అయితే మూడు కీలక హత్య కేసులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కి బదిలీ చేయాలని శాసనసభ్యులు డిమాండ్ చేశారు. జిరిబామ్ హత్యలకు కారణమైన కుకీ తీవ్రవాదులను చట్టవిరుద్ధమైన సంస్థ’ సభ్యులుగా ప్రకటించేందుకు అంగీకరించారు.
పై తీర్మానాలను నిర్ణీత వ్యవధిలోగా అమలు చేయకుంటే ఎన్డీయే శాసనసభ్యులందరూ రాష్ట్ర ప్రజలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తారని ముఖ్యమంత్రి సచివాలయం విడుదల చేసిన తీర్మానంలో పేర్కొంది.
అయితే ఈ సమావేశంలో ఆమోదించిన తీర్మానాలను మైతేయి పౌర సమాజ సంస్థలు తిరస్కరించాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేల సమావేశం కోసం తాము ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని కొకొమి (కోఆర్డినేషన్ కమిటీ ఆన్ మణిపూర్ ఇంటిగ్రిటీ) అధికార ప్రతినిధి ఖురైజం అథౌబా అన్నారు. ‘ ఈ తీర్మానాలతో మణిపూర్ ప్రజలు సంతృప్తి చెందలేదు. జిరిబామ్‌లో ఆరుగురు అమాయక మహిళలు, పిల్లలను చంపిన కుకీ మిలిటెంట్లపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. కానీ ఇది కేవలం జిరిబామ్‌లో మాత్రమే జరగలేదు. 2023 నుంచి మణిపూర్‌లోని అనేక ఇతర ప్రాంతాలలో జరుగుతున్నాయి. కాబట్టి కుకీ మిలిటెంట్ల చెందిన గ్రూపులపై (SoO groups) చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, శాసనసభ్యులను మణిపూర్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు’ అని తెలిపారు.
అన్ని SoO సమూహాలను చట్టవిరుద్ధమైన సంస్థగా ప్రకటించాలని, కుకీ తిరుగుబాటుదారులతో కార్యకలాపాల సస్పెన్షన్ ఒప్పందాన్ని కేంద్రం రద్దు చేయాలని మైతేయి పౌర సమాజ సంఘం డిమాండ్ చేసింది. ‘ప్రభుత్వం లేదా శాసనసభ్యులు మళ్లీ ప్రజలతో సంప్రదింపులు జరపాల్సిన అవసరం లేదు. మా వైఖరి చాలా స్పష్టంగా ఉంది. వచ్చే 24 గంటల్లో ప్రభుత్వం ఈ తీర్మానాన్ని సమీక్షించి మంచి తీర్మానంతో తిరిగి రావాలని మేము కోరుకుంటున్నాం. వారు అలా చేయకపోతే మా ఆందోళనను తీవ్రతరం చేస్తాం. ఇందులో భాగంతా ముందుగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మూసివేస్తాం’ కొకొమి ప్రతినిధి పేర్కొన్నారు.
మరోవైపు అల్లర్లను అదుపు చేయలేకపోవడం, హింసాకాండ ఎక్కువడంతో ఇప్పటికే ప్రభుత్వానికి నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్‌పీపీ) తన మద్దతు ఉపసంహరించుకుంది. మణిపూర్‌లో బీజేపీ నేతృత్వంలోని 60 స్థానాలున్న మణిపూర్ అసెంబ్లీలో ఎన్‌పీపీకి ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎన్‌పీపీ మద్దతు ఉపసంహరించినప్పటికీ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదు. బీజేపీకి 32 మంది ఎమ్మెల్యేలు ఉండగా, నాగా పీపుల్స్ ఫ్రంట్‌కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు, జేడీ(యూ)కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు సైతం ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు. ఇదిలా ఉండగా ఇక మైతేయి, కుకీ వర్గాల మధ్య హింసాకాండలో ఇప్పటి వరకు 220 మంది ప్రాణాలు కోల్పోగా.. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment