తెలంగాణకు విద్యుత్ ఆపేస్తాం
• రూ. 4,282 కోట్ల బిల్లులను తక్షణం చెల్లించాలి
• ఎస్‌ఆర్‌పీసీ భేటీలో ఏపీ జెన్‌కో అల్టిమేటం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని ఏపీ జెన్‌కో అల్టిమేటం జారీ చేసింది. తెలంగాణకు సరఫరా చేసిన విద్యుత్‌కు సంబంధించిన రూ.4,282 కోట్ల బిల్లులను తక్షణమే చెల్లించకపోతే రాష్ట్రానికి విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని తేల్చి చెప్పింది. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన దక్షిణ ప్రాంతీయ పవర్ కమిటీ(ఎస్‌ఆర్‌పీసీ) సమావేశంలో ఈ మేరకు ఏపీ జెన్‌కో ఎండీ కె.విజయానంద్ ప్రకటన చేశారు. ఎస్‌ఆర్‌పీసీ కమిటీ సభ్యుడు భట్ నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో తెలంగాణ ట్రాన్స్‌కో నుంచి కమర్షియల్ విభాగం చీఫ్ ఇంజనీర్ నాగేశ్వరశర్మ, ఏపీ నుంచి ఏపీ జెన్‌కో ఎండీ విజయానంద్, ట్రాన్స్‌కో జేఎండీ దినేష్ పరుచూరి, జెన్‌కో ఫైనాన్స్ డెరైక్టర్ ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని జెన్‌కో విద్యుదుత్పత్తి ప్రాజెక్టుల నుంచి తెలంగాణకు 53.89 శాతం, ఏపీకి 46.11 శాతం విద్యుత్ కేటాయింపులు చేశారు. తెలంగాణలోని ప్రాజెక్టుల నుంచి ఏపీకి 46.11 శాతం.. ఏపీలోని ప్రాజెక్టుల నుంచి తెలంగాణకు 53.11 శాతం విద్యుత్ సరఫరా జరుగుతోంది. విభజన చట్టం ప్రకారం ఏపీ నుంచి తెలంగాణకు 450-300 మెగావాట్ల విద్యుత్ అదనంగా సరఫరా జరుగుతోంది.
పరస్పరం చెల్లించుకోవాల్సిన విద్యుత్ బిల్లులను సర్దుబాటు చేసిన తర్వాత తమ రాష్ట్రానికి రూ. 4,282 కోట్ల బిల్లులను తెలంగాణ చెల్లించాల్సి ఉందని ఏపీ అధికారులు ఎస్‌ఆర్‌పీసీలో వాదించారు. ఏపీ వాదనతో విబేధించిన తెలంగాణ అధికారులు బిల్లుల సర్దుబాటు తర్వాత ఏపీ నుంచే తమ రాష్ట్రానికి రూ.2,406 కోట్లు రావాలని తేల్చి చెప్పారు. దీంతో తెలంగాణకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని విజయానంద్ చెప్పారు. ఈ వివాదాన్ని ఇరు రాష్ట్రాలు పరస్పరం చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, ఇది తమ పరిధిలోకి రాదని ఎస్‌ఆర్‌పీసీ తెలిపిందని తెలంగాణ అధికారులు పేర్కొన్నారు.
ఆపేస్తే మంచిదే... : ‘తెలంగాణకు ఏపీ విద్యుత్‌ను నిలిపివేస్తే రాష్ట్రానికి మంచిదే. ఏపీ నుంచి యూనిట్ రూ.5కు పైగా చెల్లించి విద్యుత్ కొంటూ ఆ రాష్ట్రానికి రూ.4కు యూనిట్ చొప్పున ఇస్తున్నాం. ఏపీ నుంచి అదనంగా 300 మెగావాట్ల మాత్రమే వస్తోంది. ఆపేస్తే మాకు లాభమే’ అని తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు పేర్కొన్నారు. పరస్పర విద్యుత్ పంపకాలకు సంబంధించి ఏపీ అధికారులు తప్పుడు వాదనలు వినిపిస్తున్నారన్నారు. టీఎస్‌ఎస్పీడీసీఎల్ నుంచి వేరుపడిన కర్నూలు, అనంతపురం జిల్లాలకు సంబంధించిన ఆర్‌ఈసీ రుణ బకాయిలు, ఏపీ పెన్షనర్లకు చెల్లించిన పెన్షన్ల మొత్తాన్ని ఏపీ ప్రభుత్వం తెలంగాణకు చెల్లించాల్సి ఉందన్నారు. విద్యుత్ బిల్లుల బకాయిలు, పెన్షన్లు, రుణాలను సర్దుబాటు చేసిన తర్వాత ఏపీ నుంచితెలంగాణకు రూ.2,406 కోట్ల బకాయిలు రావాల్సి ఉందన్నారు.