SRPC
-
ట్రాన్స్మిషన్ లైన్ల సామర్థ్యం పెంపు సక్సెస్
సాక్షి, హైదరాబాద్: జనసాంద్రత అధికంగా ఉండే హైదరాబాద్ వంటి నగర ప్రాంతాల్లో కొత్త విద్యుత్ ట్రాన్స్మిషన్ లైన్ల నిర్మాణానికి అవసరమైన స్థలాల లభ్యత ఉండదు. మరోవైపు ఏటా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థల సామర్థ్యం పెంచుకోక తప్పని పరిస్థితి. కొత్తలైన్ల నిర్మాణానికి స్థలాలు లేకపోవడంతో ఉన్న ట్రాన్స్మిషన్ లైన్ల సరఫరా సామర్థ్యాన్ని కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో పెంచుకోవడం ఒక్కటే పరిష్కారం మార్గం. ఈ కోవలో చేపట్టిన 132 కేవీ నుంచి 220 కేవీకి ట్రాన్స్మిషన్ లైన్ల సామర్థ్యం పెంపు (అప్‌గ్రెడేషన్)కు సంబంధించిన పైలట్ ప్రాజెక్టు విజయవంతమైందని ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ, ఎస్ఆర్పీసీ చైర్మన్ ప్రభాకర్‌రావు తెలిపారు. మహారాష్ట్రలోని పుణేలో శనివారం జరిగిన సదరన్ రీజియన్ పవర్ కమిటీ (ఎస్ఆర్పీసీ) సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రయోగాత్మకంగా రెండు టవర్ల మధ్య ప్రస్తుత విద్యుత్ తీగల (కండక్టర్ల)ను తొలగించి వాటి స్థానంలో ‘హై టెంపరేచర్ లోసాగ్ కండక్టర్స్ (హెచ్‌టీఎల్‌ఎస్) తీగలను ఏర్పాటు చేయడంతో ఈ మేరకు విద్యుత్ సరఫరా సామర్థ్యం పెరిగిందని వెల్లడించారు. పైలట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో గచ్చిబౌలి నుంచి రామచంద్రాపురం వరకు 12 కి.మీ. పొడవునా 132 కేవీ ట్రాన్స్మిషన్ లైన్ సామర్థ్యాన్ని 220 కేవీకి పెంచే ప్రాజెక్టును చేపట్టామన్నారు. అదనపు స్థలాలు అవసరం లేకుండానే హెచ్‌టీఎల్‌ఎస్ తీగలతో సరఫరా లైన్ల సామర్థ్యం పెంచుకోవచ్చని ప్రభాకర్‌రావు వివరించారు. హెచ్‌టీఎల్‌ఎస్ తీగలు 210 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను సైతం తట్టుకొని అధిక సామర్థ్యంతో విద్యుత్‌ను ప్రసారం చేయగలుగుతాయి. సంప్రదాయ తీగలు అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోలేక కరిగిపోతాయి. ఎన్టీపీసీపై ఎస్ఆర్పీసీ అసంతృప్తి 2022 చివరిలోగా రామగుండంలోని 1,600 మెగావాట్ల ఎన్టీపీసీ థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణం పూర్తి చేస్తామని ఆ సంస్థ చైర్మన్ హామీనిచ్చినా గడువులోగా పూర్తికాలేదని ప్రభాకర్‌రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో తెలంగాణ విద్యుత్ సంస్థలు బయట నుంచి అధిక ధరకు విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సి వస్తోందన్నారు. ఇప్పటికైనా ఎన్టీపీసీ నిర్మాణ పనులను సత్వరమే పూర్తిచేయాలని ఎస్ఆర్పీసీ చైర్మన్ హోదాలో ఆదేశించారు. -
పొరుగు రాష్ట్రాలకు గంటలోనే విద్యుత్
► విద్యుత్ ఇచ్చిపుచ్చుకునే సరికొత్త విధానానికి రూపకల్పన ► ఎస్ఆర్పీసీ ముసాయిదాపై దక్షిణాది రాష్ట్రాల ఏకాభిప్రాయం సాక్షి, హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాల మధ్య విద్యుత్ ఇచ్చిపుచ్చుకునేందుకు సరికొత్త విధానం అనుసరించే విషయంలో భాగస్వా మ్య రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. దక్షిణాదిలో ఏ రాష్ట్రానికి విద్యుత్ అవసరం ఉన్నా, గంటలోపు పక్క రాష్ట్రాల నుంచి పొందే లా ఈ విధానానికి రూపకల్పన చేశారు. ఇది అమల్లోకి వస్తే ఎలాంటి జాప్యానికి అవకాశం లేకుండా ఇరుగు పొరుగు రాష్ట్రాలకు విద్యుత్ ఇచ్చిపుచ్చుకునే వెసులుబాటు కలుగుతుంది. త్వరలో దీనికి సంబంధించి దక్షిణాది రాష్ట్రాల విద్యుత్ సంస్థలు ఒప్పందం కుదుర్చుకోనున్నా యి. దక్షిణ భారత రాష్ట్రాల విద్యుత్ కమిటీ (ఎస్ఆర్పీసీ) అధ్యక్షుడు, తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు అధ్యక్షతన కేరళ రాజధాని తిరువనంతపురంలో సోమ, మంగళ వారాల్లో కమిటీ సమావేశాలు జరిగాయి. గత నెలలో హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల మధ్య సరళమైన విద్యుత్ విధానానికి సంబంధించి ప్రాథమిక చర్చలు జరిగాయి. ఆ సమావేశాల్లోనే ఎస్ఆర్పీసీ సభ్య కార్యదర్శి ఎస్ఆర్ భట్ నేతృత్వంలో కమిటీని నియమించారు. కొత్త విధానానికి సంబంధిం చి ఈ కమిటీ ముసాయిదాను తయారు చేసి తిరువనంతపురం సమావేశంలో ప్రవేశపెట్టిం ది. దీనిపై రెండు రోజులు చర్చ జరిగింది. ప్రభాకర్‌రావుతో పాటు సభ్య కార్యదర్శి ఎస్ఆర్ భట్, కేరళ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు సీఎండీ కె.ఎలంగోవన్, కర్ణాటక ట్రాన్స్‌కో ఎండీ జావేద్ అక్తర్, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ విద్యావంతుల, తమిళనాడు ట్రాన్స్‌కో ఎండీ ఎస్.షణ్ముగం, టీఎస్ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్‌రావు చర్చలో పాల్గొని ముసాయిదాకు ఆమోదం తెలిపారు. ప్రభాకర్‌రావు ఈ విధా నాన్ని ప్రతిపాదించడంతో పాటు దక్షిణాది రాష్ట్రాల విద్యుత్ సంస్థల మధ్య ఏకాభిప్రా యం కుదుర్చడానికి చేసిన ప్రయత్నం ఫలించడంతో ఈ ముందడుగు పడిందని ట్రాన్స్‌కో అధికార వర్గాలు తెలిపాయి. ముసాయిదా సారాంశం... దక్షిణ భారతదేశ పరిధిలోని పొరుగు రాష్ట్రంలో ఎక్కడ విద్యుత్ అవసరం ఉన్నా.. మిగులు విద్యుత్ కలిగిన రాష్ట్రం నుంచి పొందవచ్చని ముసాయిదాలో పేర్కొన్నారు. విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, సరఫరా విషయాల్లో పరస్ప రం సహకరించుకోవాలని కూడా నిర్ణయిం చారు. ప్రస్తుతం విద్యుత్ కొనుగోళ్లన్నీ పవర్ ఎక్సే్చంజ్ ద్వారానే జరగాలి. ఈ విధానం వల్ల క్రయవిక్రయాల్లో జాప్యం జరుగుతోంది. ఈ విధానం వల్ల ఒకరోజు ముందుగానే సమాచా రం ఇవ్వాల్సి ఉంటుంది. ఒకరోజు ముందే అంచనా వేయడం వల్ల అది వాస్తవ పరిస్థితికి తగ్గట్టు ఉండటం లేదు. ఈ పరిస్థితిని నివారిం చడానికి దక్షిణాది రాష్ట్రాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు గంట వ్యవధిలోనే పక్క రాష్ట్రం నుంచి విద్యుత్ పొందవచ్చు. క్రయ విక్రయాలకు సంబంధించి ప్రతిసారీ ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ విధానం వల్ల ఏ రోజు డిమాండ్‌ను ఆ రోజే అంచనా వేసి విద్యుత్‌ను పొందడమో, అందివ్వడమో చేయొచ్చు. దీని వల్ల మిగులు విద్యుత్ రాష్ట్రాలకు, లోటు విద్యుత్ రాష్ట్రాలకు మేలు కలుగుతుంది. ఎవరికి విద్యుత్ కావాల న్నా, ఎవరు విద్యుత్ ఇవ్వాలనుకున్నా ఈ సమాచారాన్ని సదరన్ లోడ్ డిస్పాచింగ్ సెంటర్‌కు సమాచారం అందివ్వాలి. దక్షిణాది రాష్ట్రాల మధ్య విద్యుత్ ఇచ్చిపుచ్చుకోవడం సదరన్ లోడ్ డిస్పాచింగ్ సెంటర్ ద్వారానే జరుగుతాయి. ఈ ముసాయిదాను సభ్య రాష్ట్రాలు రెండు రోజులు చర్చించాయి. త్వరలోనే ఈ విధానం అమలుకు విధివిధా నాలు రూపొందించుకోవాలని, ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించాయి. -
తెలంగాణకు విద్యుత్ ఆపేస్తాం
• రూ. 4,282 కోట్ల బిల్లులను తక్షణం చెల్లించాలి • ఎస్ఆర్పీసీ భేటీలో ఏపీ జెన్కో అల్టిమేటం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని ఏపీ జెన్కో అల్టిమేటం జారీ చేసింది. తెలంగాణకు సరఫరా చేసిన విద్యుత్‌కు సంబంధించిన రూ.4,282 కోట్ల బిల్లులను తక్షణమే చెల్లించకపోతే రాష్ట్రానికి విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని తేల్చి చెప్పింది. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన దక్షిణ ప్రాంతీయ పవర్ కమిటీ(ఎస్ఆర్పీసీ) సమావేశంలో ఈ మేరకు ఏపీ జెన్కో ఎండీ కె.విజయానంద్ ప్రకటన చేశారు. ఎస్ఆర్పీసీ కమిటీ సభ్యుడు భట్ నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో తెలంగాణ ట్రాన్స్‌కో నుంచి కమర్షియల్ విభాగం చీఫ్ ఇంజనీర్ నాగేశ్వరశర్మ, ఏపీ నుంచి ఏపీ జెన్కో ఎండీ విజయానంద్, ట్రాన్స్‌కో జేఎండీ దినేష్ పరుచూరి, జెన్కో ఫైనాన్స్ డెరైక్టర్ ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని జెన్కో విద్యుదుత్పత్తి ప్రాజెక్టుల నుంచి తెలంగాణకు 53.89 శాతం, ఏపీకి 46.11 శాతం విద్యుత్ కేటాయింపులు చేశారు. తెలంగాణలోని ప్రాజెక్టుల నుంచి ఏపీకి 46.11 శాతం.. ఏపీలోని ప్రాజెక్టుల నుంచి తెలంగాణకు 53.11 శాతం విద్యుత్ సరఫరా జరుగుతోంది. విభజన చట్టం ప్రకారం ఏపీ నుంచి తెలంగాణకు 450-300 మెగావాట్ల విద్యుత్ అదనంగా సరఫరా జరుగుతోంది. పరస్పరం చెల్లించుకోవాల్సిన విద్యుత్ బిల్లులను సర్దుబాటు చేసిన తర్వాత తమ రాష్ట్రానికి రూ. 4,282 కోట్ల బిల్లులను తెలంగాణ చెల్లించాల్సి ఉందని ఏపీ అధికారులు ఎస్‌ఆర్‌పీసీలో వాదించారు. ఏపీ వాదనతో విబేధించిన తెలంగాణ అధికారులు బిల్లుల సర్దుబాటు తర్వాత ఏపీ నుంచే తమ రాష్ట్రానికి రూ.2,406 కోట్లు రావాలని తేల్చి చెప్పారు. దీంతో తెలంగాణకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని విజయానంద్ చెప్పారు. ఈ వివాదాన్ని ఇరు రాష్ట్రాలు పరస్పరం చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, ఇది తమ పరిధిలోకి రాదని ఎస్ఆర్పీసీ తెలిపిందని తెలంగాణ అధికారులు పేర్కొన్నారు. ఆపేస్తే మంచిదే... : ‘తెలంగాణకు ఏపీ విద్యుత్‌ను నిలిపివేస్తే రాష్ట్రానికి మంచిదే. ఏపీ నుంచి యూనిట్ రూ.5కు పైగా చెల్లించి విద్యుత్ కొంటూ ఆ రాష్ట్రానికి రూ.4కు యూనిట్ చొప్పున ఇస్తున్నాం. ఏపీ నుంచి అదనంగా 300 మెగావాట్ల మాత్రమే వస్తోంది. ఆపేస్తే మాకు లాభమే’ అని తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు పేర్కొన్నారు. పరస్పర విద్యుత్ పంపకాలకు సంబంధించి ఏపీ అధికారులు తప్పుడు వాదనలు వినిపిస్తున్నారన్నారు. టీఎస్ఎస్పీడీసీఎల్ నుంచి వేరుపడిన కర్నూలు, అనంతపురం జిల్లాలకు సంబంధించిన ఆర్ఈసీ రుణ బకాయిలు, ఏపీ పెన్షనర్లకు చెల్లించిన పెన్షన్ల మొత్తాన్ని ఏపీ ప్రభుత్వం తెలంగాణకు చెల్లించాల్సి ఉందన్నారు. విద్యుత్ బిల్లుల బకాయిలు, పెన్షన్లు, రుణాలను సర్దుబాటు చేసిన తర్వాత ఏపీ నుంచితెలంగాణకు రూ.2,406 కోట్ల బకాయిలు రావాల్సి ఉందన్నారు. -
చర్చిద్దాం రండి!
రంగంలోకి దిగిన ఎస్ఆర్పీసీ ఇరు రాష్ట్రాల ఎస్ఎల్డీసీ చీఫ్ ఇంజనీర్లకు లేఖ 24న బెంగళూరులో సమావేశం సాక్షి, హైదరాబాద్: విద్యుత్ కొనుగోలు ఒప్పందాల(పీపీఏలు) రద్దు వివాదంతో తలెత్తుతున్న విద్యుత్ సరఫరా సమస్యను పరిష్కరించేందుకు దక్షిణ ప్రాంత విద్యుత్ కమిటీ(ఎస్ఆర్పీసీ) రంగంలోకి దిగింది. ఈ అంశంపై చర్చించేందుకు రావాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కమిటీ సభ్య కార్యదర్శి ఎస్.ఆర్.భట్ కోరారు. ఈ నెల 24న ఉదయం 11 గంటలకు బెంగళూరులోని ఎస్ఆర్పీసీ సమావేశ మందిరంలో సమావేశం ఉంటుందని ఇరు రాష్ట్రాలకు చెందిన లోడ్ డిస్పాచ్ సెంటర్ల(ఎస్ఎల్డీసీ) చీఫ్ ఇంజనీర్లను ఆహ్వానిస్తూ ఆయన శుక్రవారం లేఖ రాశారు. అంతకుముందు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య తలెత్తిన విద్యుత్ కోటాల అంశాన్ని పరిష్కరించాలని ఎస్ఆర్పీసీని దక్షిణ ప్రాంత లోడ్ డిస్పాచ్ సెంటర్(ఎస్ఆర్ఎల్డీసీ) ఆదేశించింది. దీంతో ఎస్ఆర్పీసీ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ‘ఏపీజెన్కో ప్లాంట్ల నుంచి వస్తున్న విద్యుత్ కోటా విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తున్న విషయాన్ని శుక్రవారం(20న) ఉదయం కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖతో పాటు కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి(సీఈఆర్సీ) దృష్టికి తెచ్చాం. ఏపీజెన్కో తమ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి షెడ్యూల్ వివరాలను ఇవ్వడం లేదు. కేవలం జీరో(సున్నా) అని పంపుతున్నారు. వివరాలు పంపాలని కోరినా వారి నుంచి స్పందన లేదు. కోటాకు మించి విద్యుత్‌ను ఆంధ్రప్రదేశ్ వాడుతోంది. ఇందుకు పెనాల్టీలు చెల్లించబోమని కూడా చెబుతోంది. ఇది గ్రిడ్ నిర్వహణకు చాలా సమస్యగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల ఎస్ఎల్డీసీ ఉన్నతాధికారులతో చర్చించాలనుకుంటున్నాం. మీరు సమావేశానికి రండి’ అని ఎస్ఆర్పీసీ తన లేఖలో పేర్కొంది. కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ(సీఈఏ)తో పాటు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ డెరైక్టర్, ఏపీ ట్రాన్స్‌కో, తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీలు, జాతీయ లోడ్ డిస్పాచ్ సెంటర్(ఎన్ఎల్డీసీ) ఈడీలకు కూడా ఈ లేఖ కాపీలను పంపినట్లు తెలిపింది.