పట్నా: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఏకమవుతున్నాయి. 20 ప్రతిపక్ష పార్టీలతో పట్నాలో శుక్రవారం సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రధాని అభ్యర్థి ఎవరు వంటి అంశాల జోలికి పోకుండా ప్రజాసమస్యలపై పోరుబాట పట్టేలా వ్యూహరచన చేయనున్నట్టుగా తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే, పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ, పశ్చిమబెంగాల్, ఢిల్లీ, తమిళనాడు, జార్ఖండ్ ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, కేజ్రివాల్, స్టాలిన్, హేమంత్ సోరెన్‌లతో పాటు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, మహారాష్ట మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ వంటి అగ్ర నాయకులు హాజరుకానున్నారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్‌జేడీ నేత తేజస్వి యాదవ్ సమావేశానికి ఆతిథ్యం ఇస్తారు.
ఈ సమావేశం మొట్టమొదటిది కావడంతో అత్యంత సంక్లిష్టమైన ప్రధాని అభ్యర్థి, సీట్ల సర్దుబాటు వంటి అంశాల జోలికి పార్టీలన్నీ ఒకే తాటిపైకి వచ్చి మోదీపై పోరుబాట పట్టే వ్యూహాలు రచించనున్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారమే పట్నాకి చేరుకున్నారు. ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ని కలుసుకున్న ఆమె బీజేపీని తాము ఉమ్మడిగా ఒక కుటుంబంలా ఎదుర్కొంటామన్నారు. ఇలా విపక్ష పార్టీలన్నీ ఏకం కావడం శుభారంభమని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్‌కు ఆప్ అల్టిమేటమ్
విపక్ష పార్టీల సమావేశానికి ఒక్క రోజు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్‌కు గట్టి షాక్ ఇచ్చింది. ఢిల్లీలో ప్రభుత్వ అధికారుల్నిపై నియంత్రణ కోసం కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌పై పోరాటంలో తమకు మద్దతుగా నిలవకపోతే విపక్ష పార్టీల సమావేశాన్ని బహిష్కరిస్తామని అల్టిమేటమ్ ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment