Seat-sharing
-
కుదరని ఆప్, కాంగ్రెస్ పొత్తు
న్యూఢిల్లీ: హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్, ఆప్ ఏకాభిప్రాయానికి రాలేకపోయాయి. దీంతో ఇరు పార్టీల మధ్య పొత్తు చర్చలు విఫలమయ్యాయి. కురుక్షేత్ర ప్రాంతంలో ఎక్కువ సీట్లు కావాలని ఆప్ పట్టుబట్టింది. మొత్తంగా 10 సీట్లు కావాలని కోరగా ఐదుకు మించి ఇచ్చేది లేదని కాంగ్రెస్ తెగేసి చెప్పింది. దీంతో చర్చలు అర్ధంతరంగా ముగిశాయి. ఎవరికి వారే పోటీచేయడం ఖాయమైంది. దీంతో ఆప్ 20 మంది అభ్యర్థుల పేర్లతో తొలి జాబితాను సోమవారం విడుదలచేసింది. జాబితా విడుదలపై ఆప్ హరియాణా చీఫ్ సుశీల్ గుప్తా మాట్లాడారు. ‘‘ సోమవారం సాయంత్రంకల్లా మీ నిర్ణయం చెప్పాలని కాంగ్రెస్‌కు స్పష్టంచేశాం. అయినా కాంగ్రెస్ నుంచి ఎలాంటి సానుకూల సంకేతాలు రాలేదు. సెప్టెంబర్ 12కల్లా నామినేషన్ల స్వీకరణ గడువు ముగుస్తుంది. వాళ్ల కోసం నిరీక్షణ ముగిసింది. అందుకే ఒంటరిగా పోటీచేయాలని నిర్ణయించుకున్నాం’ అని ఆయన అన్నారు. ఆప్ తొలి జాబితా ప్రకారం ఆప్ సీనియర్ నేత అనురాగ్ ధండా కలాయత్‌లో పోటీచేస్తారు. బెడిసికొట్టిన చర్చలుబీజేపీకి ఉమ్మడిగా ఓడిద్దామని ఆప్, కాంగ్రెస్ భావించాయి. అందులోభాగంగానే పొత్తు కోసం చర్చలకు సిద్ధమయ్యాయి. కొన్ని చోట్ల ఉమ్మడిగా ఒక్కరినే నిలబెట్టాలని భావించాయి. కాంగ్రెస్ నుంచి కేసీ వేణుగోపాల్, దీపక్ బాబరియా, ఆప్ నుంచి రాఘవ్ చద్దా తదితరులు కొద్ది రోజుల క్రితమే చర్చలు మొదలెట్టారు. అయితే కొన్ని స్థానాల్లో మేమంటే మేము పోటీచేస్తామని ఆప్, కాంగ్రెస్ పట్టుబట్టడంతో ఏకాభిప్రాయం కష్టమైంది. హరియాణా అసెంబ్లీకి అక్టోబర్ ఐదో తేదీన పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 8వ తేదీన ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు. -
మిషన్ 2024.. పట్నాలో నేడే విపక్షాల సమావేశం
పట్నా: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఏకమవుతున్నాయి. 20 ప్రతిపక్ష పార్టీలతో పట్నాలో శుక్రవారం సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రధాని అభ్యర్థి ఎవరు వంటి అంశాల జోలికి పోకుండా ప్రజాసమస్యలపై పోరుబాట పట్టేలా వ్యూహరచన చేయనున్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే, పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ, పశ్చిమబెంగాల్, ఢిల్లీ, తమిళనాడు, జార్ఖండ్ ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, కేజ్రివాల్, స్టాలిన్, హేమంత్ సోరెన్‌లతో పాటు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, మహారాష్ట మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ వంటి అగ్ర నాయకులు హాజరుకానున్నారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సమావేశానికి ఆతిథ్యం ఇస్తారు. ఈ సమావేశం మొట్టమొదటిది కావడంతో అత్యంత సంక్లిష్టమైన ప్రధాని అభ్యర్థి, సీట్ల సర్దుబాటు వంటి అంశాల జోలికి పార్టీలన్నీ ఒకే తాటిపైకి వచ్చి మోదీపై పోరుబాట పట్టే వ్యూహాలు రచించనున్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారమే పట్నాకి చేరుకున్నారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ని కలుసుకున్న ఆమె బీజేపీని తాము ఉమ్మడిగా ఒక కుటుంబంలా ఎదుర్కొంటామన్నారు. ఇలా విపక్ష పార్టీలన్నీ ఏకం కావడం శుభారంభమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌కు ఆప్ అల్టిమేటమ్ విపక్ష పార్టీల సమావేశానికి ఒక్క రోజు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్‌కు గట్టి షాక్ ఇచ్చింది. ఢిల్లీలో ప్రభుత్వ అధికారుల్నిపై నియంత్రణ కోసం కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌పై పోరాటంలో తమకు మద్దతుగా నిలవకపోతే విపక్ష పార్టీల సమావేశాన్ని బహిష్కరిస్తామని అల్టిమేటమ్ ఇచ్చింది. -
ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% సీట్లు
న్యూఢిల్లీ: దేశంలోని అన్ని ప్రైవేట్, ప్రత్యేక కేటగిరీ పాఠశాలల్లో 25 శాతం సీట్లను బలహీన వర్గాల వారి పిల్లలకు కేటాయించాలని కేంద్రం రాష్ట్రాలకు స్పష్టం చేసింది. బాలలకు ఉచిత, నిర్బంధ విద్య చట్టం–2010 ప్రకారం..ప్రాథమికోన్నత స్థాయి విద్య 6–14 ఏళ్ల మధ్య పిల్లలందరి ప్రాథమిక హక్కని తెలిపింది. అదేవిధంగా బౌన్సర్ల నియమించుకుని బలవంతంగా రుణ వసూళ్లు చేపట్టే అధికారం ఏ బ్యాంకుకూ లేదని తెలిపింది. మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పొఖ్రియాల్ నిశాంక్ సోమవారం లోక్‌సభలో మాట్లాడుతూ.. అన్ని ప్రైవేట్ ఎయిడెడ్, అన్ ఎయిడెడ్, స్పెషల్ కేటగిరీ పాఠశాలల్లో ఒకటి, అంతకంటే తక్కువ తరగతులకు చేపట్టే ప్రవేశాల్లో ఆ తరగతిలోని కనీసం 25 శాతం సీట్లను బలహీన, వెనుకబడిన వర్గాల వారి పిల్లలకు ఇవ్వాలి. ఆ తరగతి పూర్తయ్యే వరకు వారికి ఉచితంగా విద్య అందించాలి’ అని ఆయన కోరారు. ‘ఆ చిన్నారుల కయ్యే ఖర్చును ప్రభుత్వమే చెల్లిస్తుంది. రాష్ట్రం నిర్ణయించిన ఫీజు ప్రకారం, లేదా వాస్తవంగా ఒక్కో చిన్నారి నుంచి వసూలు చేసే ఫీజు.. ఏది తక్కువైతే అందుకు సరిసమానమైన మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది’ అని తెలిపారు. ప్రభుత్వం నుంచి భూమి, వసతి, పరికరాలను ఉచితంగా గానీ లేదా తక్కువ ధరకుగానీ పొంది 25 శాతం మంది చిన్నారులకు రిజర్వేషన్ ప్రకారం ఉచిత విద్య అందిస్తున్న పాఠశాలలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఉండదని తెలిపారు. బౌన్సర్లతో వసూళ్లు వద్దు: బలవంతంగా రుణాలను వసూలు చేసుకునేందుకు గాను ఏ బ్యాంక్‌కు కూడా బౌన్సర్లను నియమించుకునే అధికారం లేదని ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రకటించారు. ‘ఆమోదించిన మార్గదర్శకాల మేరకే రుణ వసూళ్లు చేపట్టాలి. రుణ గ్రహీతపై దౌర్జన్యం చేయడం, ఇబ్బందులు పెట్టడాన్ని ఆర్బీఐ నిషేధించింది. పోలీసుల ధ్రువీకరణ, అవసరమైన ఇతర అర్హతలు పొందిన తర్వాత మాత్రమే బ్యాంకులు రికవరీ ఏజెంట్లను నియమించుకునేందుకు ఆర్బీఐ వీలు కల్పించింది’ అని తెలిపారు. టీచర్స్ కోటా బిల్లుకు ఆమోదం కేంద్ర విద్యాసంస్థలు (టీచర్స్ కేడర్ బిల్లు–2019) బిల్లును సోమవారం లోక్‌సభ ఆమోదించింది. దేశవ్యాప్తంగా 41 సెంట్రల్ యూనివర్సిటీల్లో 8వేల పోస్టుల భర్తీకి అమలయ్యే రిజర్వేషన్ల విషయంలో డిపార్టుమెంట్‌ను యూనిట్‌ను కాకుండా యూనివర్సిటీని యూనిట్‌గా పరిగణించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీంతోపాటు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఇటీవల ప్రభుత్వం తెచ్చిన చట్టం కూడా అమలవుతుంది. ఈ బిల్లు చట్ట రూపం దాల్చితే ఆర్డినెన్స్ స్థానంలో అమలవుతుంది. -
బిహార్‌లో మహాకూటమి సీట్ల ఖరారు
పట్నా: బిహార్‌లో మహాకూటమిలోని పార్టీల మధ్య లోక్‌సభ ఎన్నికల కోసం సీట్ల పంపిణీ పూర్తయింది. ఈ రాష్ట్రంలో మొత్తం 40 సీట్లుండగా ఆర్జేడీకి 20 సీట్లు దక్కాయి. కాంగ్రెస్ 9 స్థానాల్లో పోటీ చేయనుంది. ఉపేంద్ర కూష్వాహకు చెందిన ఆర్ఎల్ఎస్పీ ఐదు స్థానాల్లో, జతిన్ రాం మాంఝీ పార్టీ హెచ్ఏఎం మూడు చోట్ల, ముకేశ్ సాహ్నీకి చెందిన వీఐపీ మూడు సీట్లలో పోటీ చేయనుంది. అయితే ఆర్జేడీ తమకు దక్కిన 20 సీట్ల నుంచి అరా నియోజకవర్గాన్ని సీపీఐ(ఎంఎల్)కు వదిలిపెట్టింది. సీట్ల కేటాయింపు వివరాలను బిహార్ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ వెల్లడించారు. దర్భంగా నుంచి బీజేపీ ఎంపీగా ఉన్న కీర్తి ఆజాద్ ఇటీవలే కాంగ్రెస్‌లో చేరారు. దర్భంగా టికెట్‌ను కీర్తికే ఇస్తామని రాహుల్ హామీ ఇచ్చారు.∙ఇప్పుడు ఆ స్థానం నుంచి ఆర్జేడీ అబ్దుల్ బరీ సిద్దిఖీని బరిలోకి దింపుతోంది. ప్రధానంగా ఈ కారణంగానే సీట్ల కేటాయింపు విషయంలో కాంగ్రెస్ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. పాటలీపుత్ర నుంచి మిసా భారతి పాటలీపుత్ర నియోజకవర్గం నుంచి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు మిసా భారతి పోటీ చేయనున్నారు. దర్భంగా నుంచి అబ్దుల్ బరీ సిద్దిఖీని ఆర్జీడీ పోటీకి దింపుతుండటం అటు కాంగ్రెస్‌తోపాటు ఇటు ఆర్జేడీ సీనియర్ నేత అష్రఫ్ ఫాత్మికి కూడా ఇష్టం లేనట్లు తెలుస్తోంది. అష్రఫ్ ఫాత్మి ఆ స్థానం నుంచి గతంలో చాలా సార్లు గెలుపొందారు. 2014 ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచారు. బెగుసరాయ్ నియోజకవర్గంలో 2014లో పోటీచేసి ఓడిపోయిన తన్వీర్ హస్సన్‌నే ఆర్జేడీ మళ్లీ బరిలోకి దింపింది. పట్నాలో మీడియాతో మాట్లాడుతున్న తేజస్వీ -
బిహార్‌లో 20–20 ఒప్పందం
పట్నా: బిహార్‌లో ఎన్డీఏ పక్షాల మధ్య 2019 లోక్‌సభ సీట్ల పంపిణీ ఖరారైంది. బీజేపీ, జేడీయూ మధ్య కుదిరిన 20–20 ఒప్పందం ప్రకారం బీజేపీ 20 స్థానాల్లోనే పోటీ చేస్తుంది. జేడీయూకు 12, రామ్‌విలాస్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ) 7 చోట్ల, ఉపేంద్ర కుష్వాహ సారధ్యంలోని రాష్ట్రీయ సమతా పార్టీ(ఆర్ఎల్ఎస్పీ)కి రెండు చోట్ల బరిలోకి దిగేందుకు ఒప్పందం కుదిరింది. కుష్వాహతో విభేదిస్తున్న ఎంపీ అరుణ్ కుమార్‌కు ఒక స్థానాన్ని ఇవ్వనున్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీ 30 చోట్ల పోటీకి దిగి 22 స్థానాలను గెలుచుకుంది. తాజా ఒప్పందం ప్రకారం గెలిచే అవకాశం ఉన్న 2 స్థానాలను మిత్ర పక్షాలకు వదిలేసింది. ఈ స్థానాలు దర్భంగా, బక్సార్ కావచ్చు. దర్భంగా ఎంపీ కీర్తి ఆజాద్‌పై సస్పెన్షన్ వేటు పడగా, బక్సార్ ఎంపీ అశ్వినీ చౌబే మరో చోట నుంచి పోటీకి దిగొచ్చు. పట్నా సాహిబ్ ఎంపీ శతృఘ్నసిన్హాతోపాటు బెగూసరాయ్ ఎంపీ భోలాసింగ్‌పైనా వేటుపడనుందని పార్టీ వర్గాలు తెలిపాయి. పాట్నా సాహిబ్ ఎంపీ శతృఘ్న సిన్హా ప్రధాని విధానాలను విమర్శించడంతోపాటు ప్రతిపక్ష ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ను పొడుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించే అవకాశాలున్నాయి. అయితే, సీట్ల పంపకం అంశం ఇంకా అధికారికంగా నిర్ధారణ కాలేదని బిహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీ గురువారం వ్యాఖ్యానించారు. -
25 ఏళ్ల బీజేపీ-శివసేన పొత్తుకు బ్రేక్?
ముంబై: మహారాష్ట్ర రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ, శివసేన 25ఏళ్ల బంధానికి బ్రేక్ పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇరుపార్టీల మధ్య పొత్తు, సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం కుదిరే పరిస్థితి కనిపించడం లేదు. మహారాష్ట్రలోని 288 సీట్లలో బీజేపీకి 119 సీట్లను కేటాయించాలని శివసేన నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా శివసేన పార్టీ చీఫ్ ఉద్దవ్ థాక్రే మాట్లాడుతూ.. 2002 గుజరాత్ మత ఘర్షణల్లో నరేంద్రమోడీకి అప్పటి శివసేన అధినేత బాల్ థాక్రే బాసటగా నిలిచారు అన్నారు. అలాగే రాష్ట్రంలోని మహాకూటమిని ఎదుర్కొనేందుకు బీజేపీతో పొత్తుకు చివరిగా ప్రయత్నిస్తున్నానని ఉద్దవ్ అన్నారు. తొలుత 160 సీట్లలో పోటీ చేయాలని అనుకున్నామని.. బీజేపీతో పొత్తు కోసం మరో తొమ్మిది సీట్లను వదులుకోవడానికి ఓ మెట్టు దిగామన్నారు. బీజేపీకి 119 సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ఉద్దవ్ తెలిపారు. -
సగం సీట్లు ఇవ్వాల్సిందే: బీజేపీ
ముంబై: సీట్ల పంపకంపై చర్చకు అంగీకరించిన బీజేపీ, శివసేన నేతలు సంఖ్యపై మాత్రం మొండిపట్టు వీడడం లేదు. పొత్తు కొనసాగాలని ఉభయపక్షాలూ అభిలషిస్తున్నప్పటికీ సడలింపు ధోరణిని మాత్రం చూపడం లేదు. శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు వినోద్ తావ్డే శనివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ, శివసేన తమకు 125 సీట్లు ఇస్తామని ప్రతిపాదించిందని చెప్పారు. శివసేన 155 సీట్లలో పోటీ చేస్తుందని, ఇతర స్థానాలను భాగస్వామ్య పక్షాలకు కేటాయిస్తున్నట్లు తెలిపిందన్నారు. అయితే ఆ ప్రతిపాదన తమకు అంగీకారం కాదని తావ్డే స్పష్టం చేశారు. అక్టోబర్ 15న జరగనున్న ఎన్నికలకు ఈ నెల 27 నామినేషన్లకు తుది గడువు. వచ్చే 24 గంటల్లో పొత్తుపై ఒక స్పష్టత వస్తుందని అన్నారు. సీట్ల పంపిణీపై రెండు ఎన్డీయే భాగస్వామ్య పక్షాల మధ్య కొద్దిరోజులుగా కొనసాగిన నిశ్శబ్ధాన్ని ఎట్టకేలకు శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే శుక్రవారం భగ్నం చేశారు. చర్చల కోసం తన కుమారుడు ఆదిత్య ఠాక్రే, పార్టీ సీనియర్ నాయకుడు సుభాష్ దేశాయ్‌లను పంపారు. శివసేన చేసిన ప్రతిపాదనపై బీజేపీ కోర్ కమిటీ సభ్యులు శనివారం రెండు దఫాలుగా చర్చించారు. ఈ చర్చల్లో బీజేపీ ఎన్నికల ఇన్చార్జి ఓపీ మాథుర్, పార్టీ ప్రధాన కార్యదర్శి, మహారాష్ట్ర ఇన్చార్జి రాజీవ్ ప్రతాప్ రూఢీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్ కూడా పాల్గొన్నారు. రెండు పార్టీలకూ ఆదివారం కీలకం కానుంది. ఈ రెండు పార్టీల నేతలు తమ పార్టీల ఎగ్జిక్యూటివ్ కమిటీలతో ఆదివారం సమావేశం కానున్నారు. పొత్తు, సీట్ల పంపకంపై ఉద్ధవ ఠాక్రే ఆదివారం నాడొక ప్రకటనచేస్తారని భావిస్తున్నారు. అలాగే ఢిల్లీలో జరిగే బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో మహారాష్ట్ర ఎన్నికలపై ఓ తుది నిర్ణయం తీసుకుంటారని పరిశీలకులు భావిస్తున్నారు. గత 25 ఏళ్లుగా కొనసాగుతున్న పొత్తును కొనసాగించాలన్నదే తమ అభిమతమని తావ్డే పేర్కొన్నారు. ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలి, ఎవరు ముఖ్యమంత్రి కావాలన్న అంశంపై పొత్తు భగ్నం కాకూడదని అన్నారు. గత 25 ఏళ్లలో జరిగిన ఐదు అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన గెలుపొందని 59 సీట్లు, బీజేపీ గెలవని 19 సీట్లపై చర్చ జరగాలని తాము కోరుతున్నామని తావ్డే చెప్పారు. తమ కూటమి కనీసం 200 సీట్లలో గెలవాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. వీడని పీటముడి ముంబై: సీట్ల పంపకంపై శివసేన నుంచి తమకు కొత్తగా ప్రతిపాదనలేవీ రాలేదని బీజేపీ శనివారం తెలిపింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే తమ అభ్యర్థుల జాబితాను ఆదివారం న్యూఢిల్లీలో పార్టీ సెంట్రల్ పార్లమెంటరీ బోర్డు ముందుంచనున్నామని పేర్కొంది. ప్రతిపక్ష నాయకుడు ఏక్నాథ్ ఖడ్సే అధికార నివాసంలో జరిగిన పార్టీ కోర్ కమిటీ సమావేశం అనంతరం బీజేపీ ఎన్నికల ఇన్చార్జి ఓం మాథుర్ విలేకరులతో మాట్లాడారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డుకు అభ్యర్థుల జాబితాను సమర్పిస్తామని చెప్పారు. ‘మా సీట్లపై చర్చించాం. చర్చలు అవసరమైన సీట్లన్నింటిని గూర్చి మాట్లాడామ’ని ఆయన అన్నారు. సీట్ల పంపకంపై శివసేన ప్రతిపాదనలు పంపిందన్న ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యలను ప్రస్తావించగా, కొత్త ఫార్ములా ఏదీ తమకు అందలేదని మాథుర్ పేర్కొన్నారు. శివసేనకు చెందిన ఆదిత్య ఠాక్రే, సుభాష్ దేశాయ్‌లతో శుక్రవారం జరిగిన సమావేశం సందర్భంగా తదుపరి చర్చలు ఎప్పుడు జరిపేదీ వారే చెబుతామన్నారని మాథుర్ తెలిపారు. తమ సహచర పార్టీలకు సీట్ల కేటాయింపుపై కూడా ఢిల్లీలోనే నిర్ణయిస్తామన్నారు. శివసేనతో చర్చలు ఫలప్రదం కాకపోతే బీజేపీ తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుందన్న ప్రశ్నకు అన్నీ ఆదివారం ఢిల్లీలో తేలిపోతాయని చెప్పారు. -
స్నేహం కన్నా సీట్లే మిన్న
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా - ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి రాజీపడబోమని స్పష్టీకరణ - అధికార కూటమిని కూకటివేళ్లతో పెకిలించాలని కార్యకర్తలకు పిలుపు కొల్హాపూర్: కూటమి భాగస్వామి, పాత మిత్రుడు శివసేనతో సీట్ల పంపకంపై ఓ స్పష్టత రాకపోవడం పట్ల బీజేపీ అసహనం వ్యక్తం చేసింది. అయితే ఆత్మ గౌరవాన్ని పణంగా పెట్టి రాజీ పడబోమని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ‘మహాయుతి’ పటిష్టంగా నిలిచి పదిహేనేళ్ల కాంగ్రెస్-ఎన్సీపీ సర్కారును కూలదోయాల్సి ఉందని అన్నారు. ముంబై నుంచి గురువారం ఇక్కడికి వచ్చిన అమిత్ షా విమానాశ్రయలో పార్టీ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ, మహారాష్ట్రలో ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయేది బీజేపీయేనని ధీమా వ్యక్తం చేశారు. కూటమిలో సీట్ల పంపకం వ్యవహారాన్ని త్వరగా తేల్చాలని తాను రాష్ట్ర నేతలు దేవేంద్ర ఫడ్నవిస్, వినోద్ తావ్డేలకు చెప్పానని అన్నారు. తమవైపు ప్రయత్నాలకు శివసేన నుంచి సరైన స్పందన రావడం లేదని అన్నారు. రెండుడుగులు ముందుకేసి బీజేపీ కొంత చొరవ చూపిందని, అలాగే వారు (శివసేన) కూడా ముందుకొచ్చి సమస్య పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని షా సూచించారు. ఈ సమస్యకు బీజేపీ కార్యకర్తలు ఆత్మగౌరవంతో కూడిన పరిష్కారాన్ని కోరుతున్నారని అన్నారు. ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి తీర్మానానికి తలొగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మహారాష్ట్రలో పరివర్తన సాధించాలంటే ఈ రెండు పార్టీలు కలిసే ఉండాలని అన్నారు. రాష్ట్రం పురోగమన దిశగా సాగాలంటే ప్రజలు కాంగ్రెస్-ఎన్సీపీ సర్కారును కూకటివేళ్లతో పెకిలించి వేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, ఎన్సీపీలు తమ పదిహేనేళ్ల కాలంలో రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేశాయని షా ఆరోపించారు. సరైన విచారణ జరిగితే రాష్ట్రంలోని నాయకులందరూ జైలుకు వెళతారని అన్నారు. దేశంలో ఏ రాజకీయ నాయకుడూ చేయనంతగా ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్ రాజకీయాలను వ్యాపారమయం చేశారని విమర్శించారు. ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ కుంభకోణాల్లో కూరుకుపోయాడని అన్నారు. రాష్ట్రంలో వరుసగా కుంభకోణాలు చోటు చేసుకున్నాయని చెప్పారు. మహరాష్ట్రలో రూ.11,88,000 కోట్ల రూపాయల మేరకు కుంభకోణాలు జరిగాయని షా ఆరోపించారు. కుంభకోణాల్లో కోల్పోయిన డబ్బుతో రాష్ట్ర ఆర్థికస్థితిని కనీసం ఐదేళ్లపాటు నిర్వహించవచ్చని చెప్పారు. దేశాభివృద్ధిలో మహారాష్ట్ర సారథి వంటిదని కొనియాడారు. మహారాష్ట్ర లేకుండా దేశంలో అభివృద్ధి సాధ్యం కాదన్నారు. మహారాష్ట్రలో మార్పు రాకుండా దేశంలో మార్పు అసాధ్యమని అమిత్‌షా పేర్కొన్నారు. కోల్హాపూర్ తనకు అత్తారిల్లు అని అన్నారు. తన భార్య సోనల్ పశ్చిమ మహారాష్ట్రలోని పూర్వ మరాఠా రాజ్యానికి చెందినవారని చెప్పారు. అంతకుముందు, కొల్హాపూర్, సాంగ్లీ జిల్లాలకు చెందిన బీజేపీ కార్యకర్తలు తమ పార్టీ అధ్యక్షునికి ఘనంగా స్వాగతం పలికారు. ఆ తరువాత షా కర్వీర్ నివాసిని మహాలక్ష్మి ఆలయాన్ని దర్శించుకున్నారు. తిరిగి సాయంత్రం ఆయన పుణే వెళ్లారు.