ముంబై: సీట్ల పంపకంపై చర్చకు అంగీకరించిన బీజేపీ, శివసేన నేతలు సంఖ్యపై మాత్రం మొండిపట్టు వీడడం లేదు. పొత్తు కొనసాగాలని ఉభయపక్షాలూ అభిలషిస్తున్నప్పటికీ సడలింపు ధోరణిని మాత్రం చూపడం లేదు. శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు వినోద్ తావ్డే శనివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ, శివసేన తమకు 125 సీట్లు ఇస్తామని ప్రతిపాదించిందని చెప్పారు. శివసేన 155 సీట్లలో పోటీ చేస్తుందని, ఇతర స్థానాలను భాగస్వామ్య పక్షాలకు కేటాయిస్తున్నట్లు తెలిపిందన్నారు.
అయితే ఆ ప్రతిపాదన తమకు అంగీకారం కాదని తావ్డే స్పష్టం చేశారు. అక్టోబర్ 15న జరగనున్న ఎన్నికలకు ఈ నెల 27 నామినేషన్లకు తుది గడువు. వచ్చే 24 గంటల్లో పొత్తుపై ఒక స్పష్టత వస్తుందని అన్నారు. సీట్ల పంపిణీపై రెండు ఎన్డీయే భాగస్వామ్య పక్షాల మధ్య కొద్దిరోజులుగా కొనసాగిన నిశ్శబ్ధాన్ని ఎట్టకేలకు శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే శుక్రవారం భగ్నం చేశారు.
చర్చల కోసం తన కుమారుడు ఆదిత్య ఠాక్రే, పార్టీ సీనియర్ నాయకుడు సుభాష్ దేశాయ్‌లను పంపారు. శివసేన చేసిన ప్రతిపాదనపై బీజేపీ కోర్ కమిటీ సభ్యులు శనివారం రెండు దఫాలుగా చర్చించారు. ఈ చర్చల్లో బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జి ఓపీ మాథుర్, పార్టీ ప్రధాన కార్యదర్శి, మహారాష్ట్ర ఇన్‌చార్జి రాజీవ్ ప్రతాప్ రూఢీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్ కూడా పాల్గొన్నారు. రెండు పార్టీలకూ ఆదివారం కీలకం కానుంది. ఈ రెండు పార్టీల నేతలు తమ పార్టీల ఎగ్జిక్యూటివ్ కమిటీలతో ఆదివారం సమావేశం కానున్నారు.
పొత్తు, సీట్ల పంపకంపై ఉద్ధవ ఠాక్రే ఆదివారం నాడొక ప్రకటనచేస్తారని భావిస్తున్నారు. అలాగే ఢిల్లీలో జరిగే బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో మహారాష్ట్ర ఎన్నికలపై ఓ తుది నిర్ణయం తీసుకుంటారని పరిశీలకులు భావిస్తున్నారు. గత 25 ఏళ్లుగా కొనసాగుతున్న పొత్తును కొనసాగించాలన్నదే తమ అభిమతమని తావ్డే పేర్కొన్నారు. ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలి, ఎవరు ముఖ్యమంత్రి కావాలన్న అంశంపై పొత్తు భగ్నం కాకూడదని అన్నారు. గత 25 ఏళ్లలో జరిగిన ఐదు అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన గెలుపొందని 59 సీట్లు, బీజేపీ గెలవని 19 సీట్లపై చర్చ జరగాలని తాము కోరుతున్నామని తావ్డే చెప్పారు. తమ కూటమి కనీసం 200 సీట్లలో గెలవాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు.
వీడని పీటముడి
ముంబై: సీట్ల పంపకంపై శివసేన నుంచి తమకు కొత్తగా ప్రతిపాదనలేవీ రాలేదని బీజేపీ శనివారం తెలిపింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే తమ అభ్యర్థుల జాబితాను ఆదివారం న్యూఢిల్లీలో పార్టీ సెంట్రల్ పార్లమెంటరీ బోర్డు ముందుంచనున్నామని పేర్కొంది. ప్రతిపక్ష నాయకుడు ఏక్‌నాథ్ ఖడ్సే అధికార నివాసంలో జరిగిన పార్టీ కోర్ కమిటీ సమావేశం అనంతరం బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జి ఓం మాథుర్ విలేకరులతో మాట్లాడారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డుకు అభ్యర్థుల జాబితాను సమర్పిస్తామని చెప్పారు.
‘మా సీట్లపై చర్చించాం. చర్చలు అవసరమైన సీట్లన్నింటిని గూర్చి మాట్లాడామ’ని ఆయన అన్నారు. సీట్ల పంపకంపై శివసేన ప్రతిపాదనలు పంపిందన్న ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యలను ప్రస్తావించగా, కొత్త ఫార్ములా ఏదీ తమకు అందలేదని మాథుర్ పేర్కొన్నారు. శివసేనకు చెందిన ఆదిత్య ఠాక్రే, సుభాష్ దేశాయ్‌లతో శుక్రవారం జరిగిన సమావేశం సందర్భంగా తదుపరి చర్చలు ఎప్పుడు జరిపేదీ వారే చెబుతామన్నారని మాథుర్ తెలిపారు. తమ సహచర పార్టీలకు సీట్ల కేటాయింపుపై కూడా ఢిల్లీలోనే నిర్ణయిస్తామన్నారు. శివసేనతో చర్చలు ఫలప్రదం కాకపోతే బీజేపీ తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుందన్న ప్రశ్నకు అన్నీ ఆదివారం ఢిల్లీలో తేలిపోతాయని చెప్పారు.
సగం సీట్లు ఇవ్వాల్సిందే: బీజేపీ
Published Sat, Sep 20 2014 11:30 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement