మా పార్టీ చీఫ్ చెబితే.. వెంటనే రాజీనామాలు
ముంబై: మిత్రపక్షాలు బీజేపీ, శివసేనల మధ్య సంబంధాలు పూర్తిగా తెగదెంపులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వం నుంచి శివసేన బయటకు వచ్చేలా ఉంది. తాను, తమ పార్టీకి చెందిన మంత్రులు రాజీనామా లేఖలను జేబులో సిద్ధంగా ఉంచుకున్నామని శివసేన సీనియర్ నేత, మంత్రి రాందాస్ కదమ్ చెప్పారు. తమ పార్టీ అధినేత ఉద్దవ్ ఠాక్రే ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నామని, ఆయన చెప్పిన వెంటనే రాజీనామా లేఖలు అందజేస్తామన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఏర్పాటు చేసిన అఖిల పక్ష ఎంపీల సమావేశాన్ని శివసేన ఎంపీలు బహిష్కరిస్తున్నట్టు తెలిపారు. కాగా మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో ఉంటుందని ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ రావ్సాహెబ్ దాన్వె ధీమా వ్యక్తం చేశారు.
మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోబోమని, ఒంటరిగా పోటీ చేస్తామని శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో బీజేపీ, శివసేన కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఎన్డీయే భాగస్వామిగా ఉన్న శివసేన.. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక పలు అంశాల్లో బీజేపీతో విభేదిస్తోంది.