మహారాష్ట్రలో మళ్లీ అసంతృప్తి!
ముంబై: పూర్తిస్థాయిలో సయోధ్య కుదిరి ఒక రోజైనా గడవక ముందే మహారాష్ట్రలో మళ్లీ బీజేపీ, శివసేన మధ్య పొరపొచ్చాలు నెలకొంటున్నాయి. ఇప్పటికే ఎన్నికల ముందు సీట్ల పంపకం నుంచి ప్రభుత్వంలో చేరేదాకా విభేదాలు కొనసాగగా... తాజాగా శివసేన మంత్రులకు ప్రధాన శాఖలు కేటాయించకపోవడంతో అసంతృప్తి రాజుకుంది. శివసేన ఉప ముఖ్యమంత్రి పదవిని కోరగా, అలాంటి పదవేదీ ఉండబోదని స్పష్టం చేసిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్... కనీసం మంత్రివర్గంలోనూ హోం, రెవెన్యూ, నీటి పారుదల వంటి కీలక శాఖలను ఆ పార్టీ మంత్రులకు ఇవ్వలేదు. మహారాష్ట్రలో శుక్రవారం బీజేపీ తరఫున పది మంది, శివసేన తరఫున పది మంది మంత్రులుగా ప్రమాణం చేయడం తెలిసిందే. వీరందరికీ సీఎం ఫడ్నవిస్ శనివారం ప్రభుత్వ శాఖలను కేటాయించారు.
కీలక శాఖలన్నీ బీజేపీ వద్దే.. ఫడ్నవిస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడే.. తనతో పాటు ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు ఆర్థిక, రెవెన్యూ, విద్య వంటి కీలక శాఖలను కేటాయించారు. తాజాగా ఆ పార్టీ కేబినెట్ మంత్రులుగా గిరీశ్ బాపట్‌కు ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలను అప్పగించగా.. గిరీశ్ మహాజన్‌కు నీటి వనరుల శాఖ, చంద్రశేఖర్ బవంకులేకు విద్యుత్, పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ, బాబన్‌రావ్ లోణికార్‌కు తాగునీటి సరఫరా, శానిటేషన్ శాఖ, రాజ్‌కుమార్ బదోలేకు సామాజిక న్యాయం, ప్రత్యేక సహాయ శాఖను కేటాయించారు.
శివసేనకు అంతంతే.. కేబినెట్ శాఖల్లో శివసేన తరఫున ఆ పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రేకు సన్నిహితుడైన రాజ్‌కుమార్ దేశాయ్‌కు పరిశ్రమల శాఖను కేటాయించారు.రావుతేకు రవాణా శాఖ, ఏక్‌నాథ్‌కు ప్రజాపనులు, దీపక్‌కు ప్రజారోగ్యం, రామ్‌దాస్ కదమ్‌కు పర్యావరణశాఖను అప్పగించారు. అయితే శివసేన నేతలకు ముఖ్యమైన ఆర్థిక, గ్రామీణాభివృద్ధి, రెవెన్యూ, ఉన్నత, సాంకేతిక విద్య, నీటిపారుదల వంటి శాఖలకు సహాయ మంత్రులుగా అవకాశమిచ్చారు. అయితే కీలక శాఖలేవీ దక్కక పోవడంతో శివసేన నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
కాంగ్రెస్‌కు ‘సేన’ అనుకూలం!
మహారాష్ట్రలో ప్రతిపక్షంగా ఉన్న శివసేన ప్రభుత్వంలో చేరడంతో... ప్రతిపక్ష నేత హోదా కోసం కాంగ్రెస్, ఎన్సీపీలు ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌కు అనుకూలంగా శివసేన ప్రకటన చేసింది. కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే.. అది పొరపాటు అవుతుందని పార్టీ పత్రిక ‘సామ్నా’లో వ్యాఖ్యానించింది.