‘మహా’ పొత్తులు తెగదెంపులు
సీట్ల సర్దుబాటు కుదరక సేన-బీజేపీ, కాంగ్రెస్ - ఎన్సీపీ కటీఫ్
ముంబై/న్యూఢిల్లీ: మహారాష్ట్రలో శాసనసభ ఎన్నికలవేళ.., సీట్ల సర్దుబాటుపై ఒప్పందం కుదరక, ప్రధాన రాజకీయ కూటములు రెండూ తమతమ మిత్రపక్షాలతో సుదీర్ఘ మైత్రికి చరమగీతం పలికాయి. గురువారం చకచకా జరిగిన పరిణామాల్లో, రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. శివసేనతో పాతికేళ్ల మైత్రీ బంధానికి బీజేపీ స్వస్తిచెప్పగా, కాంగ్రెస్‌తో పదిహేనేళ్ల పొత్తుకు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కటీఫ్ చెప్పింది. అంతేకాదు, పృధ్వీరాజ్ చవాన్ నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది. పొత్తును తెగదెంపులు చేసుకున్నా, ‘మహాయుతి’ కూటమిలోని చిన్న పార్టీలతో కలసి ఎన్నికలకు వెళ్తామని, ప్రచారంలో శివసేనను కూడా విమర్శించబోమని బీజేపీ ప్రకటించగా, భావసారూప్యం కలిగిన సెక్యులర్ పార్టీలతో కలసి స్వతంత్ర పంథాతో ముందుకెళ్తామని ఎన్సీపీ తెలిపింది.
సీట్ల సర్దుబాటుపై ప్రతిష్టంభన కారణంగా శివసేనతో పొత్తు ఇక ముగిసినట్టేనని బీజేపీ సీనియర్ నేతలు గురువారం సాయంత్రం ముంబైలో ప్రకటించారు. సీట్లసర్దుబాటుపై శివసేనలో సడలింపు ధోరణి లోపించడంవల్లనే పొత్తు విచ్ఛిన్నమైనట్టు వారు ఆరోపించారు. బాధతో బరువెక్కిన హృదయంతో తామీ నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని మహారాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్ బీజేపీ కోర్‌కమిటీ భేటీ అనంతరం ప్రకటించారు. అయితే, ‘మహాయుతి’ కూటమిలోని మిగిలిన మిత్రపక్షాలతో కలసి ఎన్నికల్లో పోటీచేస్తామన్నారు. ఎన్నికల ప్రచారంలో శివసేనను విమర్శించబోమని, మిత్రపక్షంగానే కొనసాగుతామని అన్నారు. కాగా, ‘మహాయుతి’ కూటమిలోని రాష్ట్రీయ సమాజ పక్ష, స్వాభిమాని షేత్కార్ సంఘటన వంటి చిన్న పార్టీలతో సీట్ల సర్దుబాటు కుదుర్చుకన్నామని, శివసంగ్రామ్ పార్టీతో చర్చలు తుదిదశలో ఉన్నాయని, ఆర్‌పీఐకి చెందిన రామ్‌దాస్ అథవాలేతో కూడా చర్చలు జరుపుతామని ఫడ్నవిస్ చెప్పారు.
అంతకు ముందు,. సీట్ల సర్దుబాటుపై చర్చకోసం శివసేన ప్రతినిధులతో తాజాగా గురువారం బీజేపీ మహారాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు ఓపీ మాథుర్ నివాసంలో జరిగిన సమావేశం విఫలమైంది. తమతో తెగదెంపులు చేసుకునేందుకు బీజేపీయే తొందరపడుతోందంటూ శివసేన ఆరోపించగా, శివసేన ప్రతిపాదనలేవీ, బీజేపీకి గానీ, ఇతర మిత్రపక్షాలకు ఆమోదయోగ్యంగా లేవని ఫడ్నవిస్ అన్నారు. మొత్తం 288 అసెంబ్లీ సీట్లలో తాము 151పోటీ చేస్తామని, బీజేపీకి 130, మిత్రపక్షాలకు 7సీట్లు ఇస్తామని చివరిసారి పంపిన ప్రతిపాదనల్లో శివసేన పేర్కొందన్నారు. కాగా, బీజేపీతో పొత్తు తెగతెంపులైన నేపథ్యంలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో శివసేన తరఫున మంత్రిగా ఉన్న అనంత్ గీతే పదవి నుంచి తప్పుకోవచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి.
మరోవైపు, కాంగ్రెస్‌తో పదిహేనేళ్ల పొత్తుకు ఎన్సీపీ గుడ్‌బై చెప్పేసింది. తాము భావసారూప్యం కలిగిన పార్టీలతో కలసి స్వతంత్రంగా ఎన్నికల్లో ముందుకెళ్తామని ఎన్సీపీ మహారాష్ట్రశాఖ అధ్యక్షుడు సునీల్ తత్కారే గురువారం ముంబైలో ప్రకటించారు. ఎన్నికల్లో నామినేషన్లకు మరో రెండు రోజుల్లో ముగుస్తున్న దశలో కూడా పొత్తు ఖరారు విషయంలో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైందని ఎన్సీపీ సీనియర్ నేత ప్రఫుల్ పటేల్ వ్యాఖ్యానించారు. 118 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ ఏకపక్షంగా తమ తొలిజాబితా ప్రకటించిందని ఆయన విమర్శిం చారు. కాగా, తాజా పరిణామాల నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ఎన్సీపీ నేత అజిత్ పవార్ గవర్నర్ కార్యాలయానికి వెళ్లి లేఖను అందించారు.