స్నేహం కన్నా సీట్లే మిన్న
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా
- ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి రాజీపడబోమని స్పష్టీకరణ
- అధికార కూటమిని కూకటివేళ్లతో పెకిలించాలని కార్యకర్తలకు పిలుపు
కొల్హాపూర్: కూటమి భాగస్వామి, పాత మిత్రుడు శివసేనతో సీట్ల పంపకంపై ఓ స్పష్టత రాకపోవడం పట్ల బీజేపీ అసహనం వ్యక్తం చేసింది. అయితే ఆత్మ గౌరవాన్ని పణంగా పెట్టి రాజీ పడబోమని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ‘మహాయుతి’ పటిష్టంగా నిలిచి పదిహేనేళ్ల కాంగ్రెస్-ఎన్సీపీ సర్కారును కూలదోయాల్సి ఉందని అన్నారు. ముంబై నుంచి గురువారం ఇక్కడికి వచ్చిన అమిత్ షా విమానాశ్రయలో పార్టీ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ, మహారాష్ట్రలో ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయేది బీజేపీయేనని ధీమా వ్యక్తం చేశారు.
కూటమిలో సీట్ల పంపకం వ్యవహారాన్ని త్వరగా తేల్చాలని తాను రాష్ట్ర నేతలు దేవేంద్ర ఫడ్నవిస్, వినోద్ తావ్డేలకు చెప్పానని అన్నారు. తమవైపు ప్రయత్నాలకు శివసేన నుంచి సరైన స్పందన రావడం లేదని అన్నారు. రెండుడుగులు ముందుకేసి బీజేపీ కొంత చొరవ చూపిందని, అలాగే వారు (శివసేన) కూడా ముందుకొచ్చి సమస్య పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని షా సూచించారు. ఈ సమస్యకు బీజేపీ కార్యకర్తలు ఆత్మగౌరవంతో కూడిన పరిష్కారాన్ని కోరుతున్నారని అన్నారు. ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి తీర్మానానికి తలొగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మహారాష్ట్రలో పరివర్తన సాధించాలంటే ఈ రెండు పార్టీలు కలిసే ఉండాలని అన్నారు.
రాష్ట్రం పురోగమన దిశగా సాగాలంటే ప్రజలు కాంగ్రెస్-ఎన్సీపీ సర్కారును కూకటివేళ్లతో పెకిలించి వేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, ఎన్సీపీలు తమ పదిహేనేళ్ల కాలంలో రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేశాయని షా ఆరోపించారు. సరైన విచారణ జరిగితే రాష్ట్రంలోని నాయకులందరూ జైలుకు వెళతారని అన్నారు. దేశంలో ఏ రాజకీయ నాయకుడూ చేయనంతగా ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్ రాజకీయాలను వ్యాపారమయం చేశారని విమర్శించారు. ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ కుంభకోణాల్లో కూరుకుపోయాడని అన్నారు. రాష్ట్రంలో వరుసగా కుంభకోణాలు చోటు చేసుకున్నాయని చెప్పారు. మహరాష్ట్రలో రూ.11,88,000 కోట్ల రూపాయల మేరకు కుంభకోణాలు జరిగాయని షా ఆరోపించారు.
కుంభకోణాల్లో కోల్పోయిన డబ్బుతో రాష్ట్ర ఆర్థికస్థితిని కనీసం ఐదేళ్లపాటు నిర్వహించవచ్చని చెప్పారు. దేశాభివృద్ధిలో మహారాష్ట్ర సారథి వంటిదని కొనియాడారు. మహారాష్ట్ర లేకుండా దేశంలో అభివృద్ధి సాధ్యం కాదన్నారు. మహారాష్ట్రలో మార్పు రాకుండా దేశంలో మార్పు అసాధ్యమని అమిత్‌షా పేర్కొన్నారు. కోల్హాపూర్ తనకు అత్తారిల్లు అని అన్నారు. తన భార్య సోనల్ పశ్చిమ మహారాష్ట్రలోని పూర్వ మరాఠా రాజ్యానికి చెందినవారని చెప్పారు. అంతకుముందు, కొల్హాపూర్, సాంగ్లీ జిల్లాలకు చెందిన బీజేపీ కార్యకర్తలు తమ పార్టీ అధ్యక్షునికి ఘనంగా స్వాగతం పలికారు. ఆ తరువాత షా కర్వీర్ నివాసిని మహాలక్ష్మి ఆలయాన్ని దర్శించుకున్నారు. తిరిగి సాయంత్రం ఆయన పుణే వెళ్లారు.