బీజేపీ ‘మహా’ విజయం | BJP cuts tiger's tail, wins 8 of 10 Maharashtra corporations | Sakshi
Sakshi News home page

బీజేపీ ‘మహా’ విజయం

Published Fri, Feb 24 2017 2:13 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

బీజేపీ ‘మహా’ విజయం - Sakshi

బీజేపీ ‘మహా’ విజయం

బీఎంసీ సహా 8 కార్పొరేషన్లలో సత్తా చాటిన కమలం
► ముంబైలో 84 సీట్లతో మొదటి స్థానంలో శివసేన.. బీజేపీకి 82
► గతంకన్నా కమలదళానికి 52 సీట్లు అధికం
►మ్యాజిక్‌ ఫిగర్‌కు రెండూ దూరం
►కాంగ్రెస్, ఎన్సీపీకి పరాభవం.. ఎంఐఎం బోణీ  


ముంబై: మహారాష్ట్రలో జరిగిన 10 మునిసిపల్‌ కార్పొరేషన్లు, 25 జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో అధికార బీజేపీ స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించింది. కీలకమైన ముంబై మునిసిపాలిటీలో గణనీయంగా సీట్లు పెంచుకుంది. 25 ఏళ్లుగా శివసేనతో పొత్తు ఆధారంగా స్థానిక, కార్పొరేషన్  ఎన్నికల్లో పోటీ చేస్తూ వచ్చిన బీజేపీ ఈసారి ఒంటరిగానే (అక్కడక్కడ చిన్న పార్టీలను కలుపుకుని) పోటీచేసి ఘనమైన ఫలితాలు సాధిం చింది. బృహన్‌ ముంబై కార్పొరేషన్  (బీఎంసీ) ఎన్నికల్లో బీజేపీ గణనీయంగా సీట్ల సంఖ్యను పెంచుకుంది. శివసేన కంచుకోటగా ఉన్న బీఎంసీలో మొత్తం 227 స్థానాలున్నాయి.

ఇందులో 84 సీట్లతో శివసేన అగ్రస్థానంలో ఉండగా, బీజేపీ 82 స్థానాలతో రెండోస్థానంలో నిలిచింది. కాంగ్రెస్‌ 31, ఎన్సీపీ (నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ) 9, మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేన 7, మజ్లిస్‌ పార్టీ 3 స్థానాల్లో గెలుపొందాయి. కాగా ఇండిపెండెంట్లు 11 స్థానాల్లో పాగా వేశారు. అయితే బీఎంసీ పీఠాన్ని అధిరోహించేందుకు కావాల్సిన 114 సీట్ల మ్యాజిక్‌ ఫిగర్‌ మాత్రం ఏ పార్టీకి దక్కలేదు. అయితే సంపన్న కార్పొరేషన్  (2016–17 సంవత్సరానికి 37వేల కోట్ల బడ్జెట్‌)పై అధికారాన్ని నిలుపుకుంటామని శివసేన, తమదే మేయర్‌ పీఠమని బీజేపీ ప్రకటనలు చేస్తుండటంతో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది.

జోరుమీదున్న బీజేపీ: శివసేనతో కలసి ప్రభుత్వంలో ఉన్నా విడిగా పోటీ చేయటమే బీజేపీకి కలిసొచ్చింది. సొంతంగా పోటీచేస్తామంటూ శివసేన ఆర్నెల్ల ముందునుంచే స్పష్టం చేస్తుండటంతో.. బీజేపీ తన బలాన్ని చాటుకునేందుకు అవకాశం కలిగింది. గత ఎన్నికల్లో 31 సీట్లు గెలుచుకున్న బీజేపీ ఈసారి 51 స్థానాలను అదనంగా గెలుచుకోవటంతో ముంబై బీజేపీ సంబరాలు జరుపుకుంటోంది.

తగ్గిన కాంగ్రెస్, ఎన్సీపీ సీట్లు
బీఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీలకు చుక్కెదురైంది. గత ఎన్నికల్లో 52 సీట్లు గెలుపొందిన కాంగ్రెస్‌ ఈసారి 31 సీట్లకే పరిమితమైంది. ఎన్సీపీ 13 స్థానాలనుంచి 9కి చేరుకుంది. చాలాచోట్ల ఈ రెండు పార్టీలు ఐదు, ఆరో స్థానాలకు పడిపోయాయి. అటు, రాజ్‌ఠాక్రే నాయకత్వంలోని ఎంఎన్  కూడా 28 స్థానాలనుంచి ఏడుకు పడిపోయింది. ముంబై మునిసిపల్‌ ఎన్నికల్లో తొలిసారి పోటీచేసిన ఎంఐఎం బోణీ చేసి 3 చోట్ల విజయం సాధించింది.

ఎన్సీపీ, కాంగ్రెస్‌ కోటల్లో కమలం పాగా
శరద్‌ పవార్‌కు కంచుకోట పుణేలో బీజేపీ తొలిసారి జెండా ఎగరేసింది. మహారాష్ట్ర సాంస్కృతిక, ఐటీ రాజధానిగా పేరున్న 162 స్థానాల పుణే మునిసిపల్‌ కార్పొరేషన్ ఎంసీ)లో 77 సీట్లతో బీజేపీ మొదటి స్థానంలో నిలిచింది. ఎన్సీపీకి 44 సీట్లు మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్‌16, శివసేన 10 స్థానాల్లో గెలుపొందాయి. మ్యాజిక్‌ ఫిగర్‌ 81 చేరుకునేందుకు బీజేపీకి 4 స్థానాలు తక్కువగా ఉన్నాయి. అయితే ఇండిపెండెంట్ల మద్దతుతో బీజేపీ మేయర్‌ పీఠం అధిరోహించనుంది.

నాగ్‌పూర్‌ మునిసిపాలిటీపై మరోసారి బీజేపీ పట్టు నిలుపుకోగా, థానేలో శివసేన ఆధిపత్యం కొనసాగింది. 131 సీట్లకు గానూ శివసేన 67 స్థానాలతో మేయర్‌ స్థానాన్ని కైవసం చేసుకుంది. అమరావతి, నాసిక్, ఉల్లాస్‌నగర్, పింప్రి–చించ్వాడ్, అకోలా, షోలాపూర్‌ మునిసిపల్‌ కార్పొరేషన్లనూ బీజేపీ స్పష్టమైన మెజారిటీతో కైవసం చేసుకుంది. ఇందులో అమరావతి, షోలాపూర్‌లో గతంలో కాంగ్రెస్‌ విజయం సాధించగా.. నాసిక్, పింప్రి–చించ్వాడ్‌ ఎన్సీపీ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాలు.

జెడ్పీల్లోనూ బీజేపీ హవా
25 జిల్లాపరిషత్‌లకు జరిగిన ఎన్నికల్లోనూ బీజేపీ ఆధిపత్యం కనబరిచింది. అర్బన్ పార్టీగా పేరున్న బీజేపీ క్రమంగా గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తోంది.  మొత్తం 1518 జెడ్పీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 409 చోట్ల విజయం సాధించింది. చెరకు రైతులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎన్సీపీకి పట్టు తప్పగా.. బీజేపీ ఇక్కడ పాగా వేసింది.

కాంగ్రెస్‌కు పట్టున్న ప్రాంతాల్లోనూ బీజేపీ దూసుకుపోయింది. కరువు కోరల్లో చిక్కుకున్న లాతూర్‌కు రైలు ట్యాంకర్ల ద్వారా నీరందించటం బీజేపీకి బాగా కలిసొచ్చింది. రత్నగిరి, సింధుదుర్గ్, బీడ్, పర్భణి ప్రాంతాల్లో   బీజేపీ జోరును ఎన్సీపీ అడ్డుకుంది. బీడ్‌ జెడ్పీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ స్థానిక మంత్రి పంకజా ముండే రాజీనామా చేశారు. అయితే దీన్ని ఆమోదించలేదని తెలుస్తోంది.

ధన్యవాదాలు... మోదీ: ‘మహారాష్ట్ర సోదర, సోదరీమణులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. బీజేపీ, అభివృద్ధి రాజకీయాలపై విశ్వాసం ఉంచుతున్న ప్రతి భారతీయుడికీ ధన్యవాదాలు. మహారాష్ట్ర, ఒడిశా ప్రజల ఆదరాభిమానాలకు కృతజ్ఞులం. కార్యకర్తలకు శుభాకాంక్షలు’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

తొందరెందుకు: ఉద్ధవ్‌ ఠాక్రే, శివసేన చీఫ్‌
‘బీఎంసీలో అధికారం ఎవరిదనే దానిపై తొందరెందుకు? కూటమి ఉండాలా వద్దా అనేది ఇప్పుడే నిర్ణయించలేం. కానీ బీఎంసీ మేయర్, భవిష్యత్తు ముఖ్యమంత్రి ఇద్దరూ శివసేన వాళ్లే ఉంటారని పక్కాగా చెప్పగలను’ అని ఉద్ధవ్‌ చెప్పారు.

దోస్తీ ఉంటుందా? లేదా?
బీఎంసీ ఎన్నికల్లో హంగ్‌ ఏర్పడటంతో ఎవరు మేయర్‌ అనేదానిపై ఆసక్తి నెలకొంది. బీజేపీ, శివసేన పొత్తుపై ఎలాంటి స్పష్టత రానప్పటకీ.. ఫలితాలకు ముందునుంచే బీజేపీ పొత్తు సంకేతాలు పంపుతోంది. గొడవలకు స్వస్తి పలికి పారదర్శకతకోసం ఒక్కటవ్వాలంటూ ఫడ్నవిస్‌ సంకేతాలివ్వగా.. ఇతర నాయకులు కూడా ఎన్నికల ప్రచారంలో విమర్శలను పక్కనపెట్టి ఏకమవ్వాలనే సందేశాన్ని పంపిస్తున్నారు. అటు శివసేన కూడా మేయర్‌ పీఠం తమదేనంటూనే.. బీజేపీతో పొత్తుపై ఇప్పుడేమీ చెప్పలేమంటోంది. పొత్తుపై గతంలో చేసిన ప్రకటనకే (బీజేపీతో కలిసే ప్రసక్తే లేదు) కట్టుబడతామని ఉద్ధవ్‌ చెబుతున్నా.. చర్చలు మొదలైతే ఉద్ధవ్‌ దూకుడు తగ్గించవచ్చని ముంబై రాజకీయ వర్గాలంటున్నాయి.

ముంబైలో ‘తెలుగు’ విజయం
బీఎంసీ ఎన్నికల్లోని 174 వార్డు (హిందూ కాలనీ) నుంచి బీజేపీ తరపున పోటీ చేసిన తెలుగు మహిళ కందిక కృష్ణవేణి రెడ్డి (45) విజయం సాధించారు. ఈమె చిత్తూరు జిల్లా, నిండ్ర మండలం కొత్త ఆరూరు గ్రామానికి చెందిన వినోద్‌రెడ్డిని వివాహమాడారు. ముంబైలోనే స్థిరపడినా.. కొత్త ఆరూరులో జరిగే గంగజాతరతో పాటు బంధువుల ఇళ్లలో జరిగే వేడుకలకు ఇప్పటికీ వీరి కుంటుంబం హాజరవుతోంది.

 


Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement