వాడివేడిగా..
రెండో రోజు దద్దరిలిన అసెంబ్లీ
కరువు, రైతు ఆత్మహత్యలపై చర్చకు పట్టుబట్టిన కాంగ్రెస్, ఎన్సీపీలు
పస్తుత పరిస్థితికి మీరే కారణమంటూ ప్రభుత్వం ఎదురుదాడి
మూడుసార్లు సభ వాయిదా .. అయినా వెనక్కు తగ్గని ప్రతిపక్షాలు
సాక్షి, ముంబై: నాగపూర్‌లో జరుగుతున్న శీతాకాల అసెంబ్లీ సమావేశాలు రెండవరోజైన మంగళవారం కూడా ప్రతిపక్షాలు గందరగోళం సృష్టించాయి. వాడివేడిగా ప్రారంభమైన రెండవరోజు సమావేశాలు మూడుసార్ల్లు వాయిదాపడ్డ అనంతరం నాలుగవసారి బుధవారం వరకు వాయిదా వేస్తున్నట్టు స్పీక ర్ ప్రకటించారు. సమావేశాల కాలంలో రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితి, రైతుల ఆత్మహత్యలపై ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. ముఖ్యంగా ఎన్నికలకు ముందు విడిపోయిన బీజేపీ, శివసేనలు ఒక్కటైనట్టుగానే మంగళవారం కాంగ్రెస్, ఎన్సీపీలు శీతాకాల సమావేశంలో ఒక్కటయ్యాయి. రెండు పార్టీలు కలిసి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. రైతు ఆత్మహత్యలపై చర్చ జరపాలని, కరువు ప్యాకేజీని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్, ఎన్సీపీలు మంగళవారం నాటి సమావేశంలో డిమాండ్ చేశాయి.
మరోవైపు దీనికి కారణం గతంలోని కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి ప్రభుత్వమే కారణమంటు బీజేపీ ఎదురుదాడికి దిగింది. ఇలా అధికార , ప్రతిపక్షాల ఆరోపణలు, ప్రత్యారోపణలతో అసెంబ్లీ దద్దరిల్లింది. అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ఉదయం 11.15 గంటలకు ప్రారంభమయ్యాయి. ప్రతిపక్ష నాయకుడు లేకుండా కొనసాగుతున్న శీతాకాల సమావేశాలలో కాంగ్రెస్ నాయకుడు జయంత్ పాటిల్, ఎన్సీపీ నాయకుడు ఛగన్ భుజ్‌భల్‌లు చర్చలు జరపడంతోపాటు ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. దీంతో సభలో గందరగోళం ప్రారంభమైంది. దీంతో 11.30 గంటలకు 30 నిమిషాలపాటు సభను వాయిదావేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. దీంతో కాంగ్రెస్, ఎన్సీపీ ఎమ్మెల్యేలు వెల్‌లోకి దూసుకుపోయి నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు.
ఈ ఆందోళనలో బాలాసాహెబ్ విఖేపాటిల్, బాలాసాహెబ్ థోరాత్, అజిత్ పవార్, ఛగన్‌భుజ్‌బల్, దిలీప్ వల్సేపాటిల్‌లతోపాటు కాంగ్రెస్, ఎన్సీపీకి చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు. మరోవైపు మధ్యాహ్నం 12 గంటలకు సమావేశాలు ప్రారంభించినప్పటికీ కాంగ్రెస్, ఎన్సీపీ నాయకులు మాత్రం తమ పట్టును వీడలేదు. దీంతో మళ్లీ 30 నిమిషాలపాటు వాయిదావేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అనతరం 12.30 గంటలకు కూడా సభ సాగకపోవడంతో ఒంటిగంట వరకు వాయిదా వేయాల్సి వచ్చింది. ఇలా మూడుమార్లు వాయిదావేసినప్పటికీ ప్రతిపక్షాలు తమ ఆందోళనను విరమించుకోలేదు. దీంతో మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో చర్చలు ప్రారంభమైనప్పటికీ, ముందు ప్యాకేజీ ప్రకటించాలని కోరడంతో చివరికి చేసేదేమీలేక స్పీకర్ బుధవారం వరకు సభను వాయిదావేశారు. ఇలా వాడివేడిగా ప్రారంభమైన సమావేశాలు రెండవరోజు కూడా ఎలాంటి చర్చలు జరగకుండానే వాయిదాపడ్డాయి.
ప్రతిపక్ష నేతగా ఆర్‌ఆర్ పాటిల్ పేరు ప్రతిపాదించిన ఎన్సీపీ
అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుని పదవి కోసం ఎన్సీపీ ఆర్ ఆర్ పాటిల్ పేరును ప్రతిపాదించింది. ఈ విషయంపై తొందర్లోనే అసెంబ్లీ స్పీకర్ వద్దకు వెళ్లనున్నట్టు ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్ తెలిపారు. శీతాకాల సమావేశాలకు ఒకరోజు ముందుగా ప్రతిపక్షంలో ఉన్న శివసేన ప్రభుత్వంలో బాగస్వామ్యం కావడంతో ప్రతిపక్ష హోదా ఎవరికి దక్కనుందా అనే విషయంపై అందరిలో ఉత్కంఠత ప్రారంభమైంది.
ఓ వైపు కాంగ్రెస్‌తోపాటు మరోవైపు ఎన్సీపీ కూడా ప్రతిపక్ష హోదా దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్సీపీ తమ అభ్యర్థి ఎవరనేది ప్రకటించి కాంగ్రెస్‌ను కొంత ఇరకాటంలో పెట్టిందని చెప్పవచ్చు. ఈ విషయంపై అజిత్ పవార్ మాట్లాడుతూ ఎన్సీపీ వద్ద 41 ఎమ్మెల్యేల సంఖ్య బలం ఉండగా మరో నలుగురు ఇండిపెండెంట్లు తమకు మద్దతు తెలుపుతూ లేఖలు ఇచ్చారన్నారు. ఈ మేరకు తాము ప్రతిపక్ష నాయకుడిగా ఆర్ ఆర్ పాటిల్ పేరును సిఫారసు చేస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు.