రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు!
♦ గోందియాలో బీజేపీ, కాంగ్రెస్ పొత్తుపై శివసేన వ్యాఖ్య
♦ అధికారం కోసం ఏమైనా చేస్తారని ఎద్దేవా
♦ బీజేపీపై ‘సామ్నా’లో విమర్శల దాడి
సాక్షి, ముంబై : ‘రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. 25 ఏళ్లుగా మిత్రులుగా ఉన్న వాళ్లు శత్రువులుగా మారిపోతారు. పుట్టుకతోనే శత్రుత్వం పెంచుకున్న వాళ్లు మిత్రులుగా మారిపోతారు’ అని శివసేన వ్యాఖ్యానించింది. గోందియా జిల్లా పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో బీజేపీ పొత్తు పెట్టుకోవడంతో తీవ్రస్థాయిలో మండిపడ్డ సేన, పార్టీ పత్రిక సామ్నాలో విమర్శలు ఎక్కుపెట్టింది. కాంగ్రెస్‌తో బీజేపీ పొత్తు పెట్టుకోవడం చూస్తుంటే భవిష్యత్తులో ఈ పరిస్థితి కొనసాగవొచ్చని అనుమానం వ్యక్తం చేసింది. నేటి రాజకీయాల్లో ఎవరినీ నమ్మడానికి వీల్లేదని, మిత్రులుగా ఉంటూ వెన్నుపోటు పొడుస్తున్నారని బీజేపీని ఉద్దేశిస్తూ ఆరోపించింది. వ్యక్తి సంృ్కతిని బట్టి సంస్కారం ఉంటుందని బీజేపీకి చురకలంటించింది.
రాజకీయాల్లో ఎవరి మెడలో హారం వేస్తారో, ఎవరి కాళ్లు పట్టి లాగుతారో నమ్మకం లేదని ఎద్దేవా చేసింది. రాజకీయాల్లో అధికారదాహం వల్ల ఏమైనా జరగొచ్చని వ్యాఖ్యానించింది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో అధికార బీజేపీని కాం గ్రెస్, ఎన్సీపీ ఎలా నిలదీస్తున్నాయో అందరూ గమనిస్తున్నారని, చర్చల సమయంలో కాంగ్రెస్ నిలదీస్తే ఎన్సీపీ మద్దతు ఇవ్వడం లేదని, ఎన్సీపీ ప్రశ్న లేవనెత్తినప్పుడు కాంగ్రెస్ నోరు విప్పడం లేదని ధ్వజమెత్తింది. రైతుల సమస్యలు, నిరుద్యోగం వంటి సమస్యలు ఈ ప్రభుత్వం వల్ల తీరుతాయన్న నమ్మకం లేదని దుయ్యబట్టింది.
ఇదీ అసలు విషయం..
ఇటీవల జరిగిన గోందియా, భండారా జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీజేపీ, శివసేన చతకిలపడ్డాయి. బీజేపీ 17, కాంగ్రెస్ 16, ఎన్సీపీ 20 సీట్లు గెలుచుకున్నాయి. అయితే దశాబ్దాల మిత్రబంధాన్ని కాదని, 20 సీట్లు గెలుచుకున్న ఎన్సీపీతో కాకుండా కాంగ్రెస్, బీజేపీతో పొత్తు పెట్టుకుంది. ఎన్సీపీని దూరం చేసుకుంది. జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని కాంగ్రెస్ దక్కించుకోగా, వైస్ ప్రెసిడెంట్ పదవి బీజేపీకి కట్టబెట్టింది. దీంతో ఇప్పటికే బీజేపీ వైఖరిపై అసంతృప్తితో ఉన్న శివసేన గోందియా బీజేపీ వైఖరితో తీవ్రంగా నిరసన వ్యక్తం చేసింది.