మహరాష్ట్ర శాసనసభ ప్రతిపక్ష నాయకునిగా ఎన్నుకోబడిన ఠాణే ....
సాక్షి, ముంబై: మహరాష్ట్ర శాసనసభ ప్రతిపక్ష నాయకునిగా ఎన్నుకోబడిన ఠాణే జిల్లా శివసేన ఎమ్మెల్యే ఏక్‌నాథ్ షిండేను ఠాణే తెలుగు సేవా సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. గత నెలలో జరిగిన మహరాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో శివసేన అభ్యర్థిగా ఏక్‌నాథ్ షిండే ఠాణే నుంచి గెలిచిన సంగతి తెలిసిందే. కాగా ఈ సన్మాన కార్యక్రమంలో తెలుగు సేవా సంస్థ చైర్మన్ నాయన జగదీశ్వర్‌రావు, అధ్యక్షుడు నాగేష్, సెక్రటరీ ఎ. రామారావు, ముఖ్య సలహాదారులు తులసీరావు, శివసేన కళ్యాణ్ లోక్‌సభ కార్యదర్శి తిరుపతి రెడ్డి, భివండీ నుండి వచ్చిన పలువురు తెలుగు సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ నాయన జగదీశ్వర్‌రావు మాట్లాడుతూ.... ఏక్‌నాథ్ షిండేకు స్థానిక తెలుగు ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఆయన తెలుగు ప్రజల సమస్యల పరిష్కారానికి తగిన ప్రాధాన్యత ఇస్తారని ఆశిస్తున్నామన్నారు. షిండే మాట్లాడుతూ.. తన గెలుపులో భాగస్వాములైన తెలుగు ప్రజల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు.