మహారాష్ట్ర సర్కారులో శివసేన?
మహారాష్ట్రలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వంలో చేరేందుకు శివసేన సుముఖత వ్యక్తం చేసి, బీజేపీకి మద్దతు ఇవ్వాలని దాదాపుగా నిర్ణయించుకుంది. దాంతో మహారాష్ట్ర సర్కారు సుస్థిరతపై ఇన్నాళ్లుగా ఉన్న అనుమానాలు పటాపంచలు అయిపోయాయి. శుక్రవారం నాడు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాను శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే వెళ్లి పది నిమిషాల పాటు ముచ్చట్లు చెప్పారు. ఆ తర్వాత ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ బయటకు వచ్చారు. అప్పుడే శివసేన ప్రభుత్వంలో చేరడం దాదాపుగా ఖరారైపోయింది.
తాజాగా ఉద్ధవ్ ఠాక్రేతో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ సమావేశమయ్యారు. మహారాష్ట్ర ప్రభుత్వంలో మొత్తం 30 మంది మంత్రులు ఉండే అవకాశం కనిపిస్తోంది. ముందునుంచి బీజేపీ చెబుతున్న ప్రకారం 2:1 నిష్పత్తిలో 20 మంది బీజేపీ మంత్రులు, 10 మంది శివసేన మంత్రులు ఉండొచ్చని అంటున్నారు. అయితే ఉపముఖ్యమంత్రి పదవి తమకు ఇవ్వాలని శివసేన డిమాండ్ చేస్తోంది. ఈనెల పదోతేదీ లోగా దేవేంద్ర ఫడ్నవిస్ అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది.