హరియాణాలో పది సీట్లు కావాలన్న ఆప్
ఐదుకు మించి ఇవ్వలేమన్న కాంగ్రెస్
20 మందితో తొలి జాబితా విడుదల చేసిన ఆప్
న్యూఢిల్లీ: హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్, ఆప్ ఏకాభిప్రాయానికి రాలేకపోయాయి. దీంతో ఇరు పార్టీల మధ్య పొత్తు చర్చలు విఫలమయ్యాయి. కురుక్షేత్ర ప్రాంతంలో ఎక్కువ సీట్లు కావాలని ఆప్ పట్టుబట్టింది. మొత్తంగా 10 సీట్లు కావాలని కోరగా ఐదుకు మించి ఇచ్చేది లేదని కాంగ్రెస్ తెగేసి చెప్పింది. దీంతో చర్చలు అర్ధంతరంగా ముగిశాయి. ఎవరికి వారే పోటీచేయడం ఖాయమైంది.
దీంతో ఆప్ 20 మంది అభ్యర్థుల పేర్లతో తొలి జాబితాను సోమవారం విడుదలచేసింది. జాబితా విడుదలపై ఆప్ హరియాణా చీఫ్ సుశీల్ గుప్తా మాట్లాడారు. ‘‘ సోమవారం సాయంత్రంకల్లా మీ నిర్ణయం చెప్పాలని కాంగ్రెస్‌కు స్పష్టంచేశాం. అయినా కాంగ్రెస్ నుంచి ఎలాంటి సానుకూల సంకేతాలు రాలేదు. సెప్టెంబర్ 12కల్లా నామినేషన్ల స్వీకరణ గడువు ముగుస్తుంది. వాళ్ల కోసం నిరీక్షణ ముగిసింది. అందుకే ఒంటరిగా పోటీచేయాలని నిర్ణయించుకున్నాం’ అని ఆయన అన్నారు. ఆప్ తొలి జాబితా ప్రకారం ఆప్ సీనియర్ నేత అనురాగ్ ధండా కలాయత్‌లో పోటీచేస్తారు.
బెడిసికొట్టిన చర్చలు
బీజేపీకి ఉమ్మడిగా ఓడిద్దామని ఆప్, కాంగ్రెస్ భావించాయి. అందులోభాగంగానే పొత్తు కోసం చర్చలకు సిద్ధమయ్యాయి. కొన్ని చోట్ల ఉమ్మడిగా ఒక్కరినే నిలబెట్టాలని భావించాయి. కాంగ్రెస్ నుంచి కేసీ వేణుగోపాల్, దీపక్ బాబరియా, ఆప్ నుంచి రాఘవ్ చద్దా తదితరులు కొద్ది రోజుల క్రితమే చర్చలు మొదలెట్టారు. అయితే కొన్ని స్థానాల్లో మేమంటే మేము పోటీచేస్తామని ఆప్, కాంగ్రెస్ పట్టుబట్టడంతో ఏకాభిప్రాయం కష్టమైంది. హరియాణా అసెంబ్లీకి అక్టోబర్ ఐదో తేదీన పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 8వ తేదీన ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment